టెస్టా కార్లు, ఎలన్ మస్క్ విషయంలో కేంద్రం మంత్రి నితిన్ గడ్కారీ కుండబద్దలు కొట్టారు. ఇండియాలో తయారీ యూనిట్ పెడితే రాయితీలు, ప్రోత్సహాకల గురించి ఆలోచిస్తామని మరోసారి వెల్లడించారు. అలా కాకుండా చైనాతో కార్లు తయారు చేస్తాం.. వాటిని ఇండియాలో అమ్ముతామంటే.. కుదురదని తేల్చిచెప్పారు. ఆ ప్రతిపాదనే మాకు డైజెస్ట్ కావడం లేదన్నారు జాతీయ మీడియాతో మాట్లాడుతూ.
ఇండియా ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్లలో ఒకటి. బీఎండబ్ల్యూ, వోల్వో, ఫోక్స్‌వ్యాగన్, హ్యందాయ్, హోండా, రెనాల్ట్ లాంటి ఎన్నో కంపెనీలు ఇక్కడ తయారీ యూనిట్లను నెలకొల్పాయి. ఇప్పుడు కొత్తగా టెస్లాకు మేం రాయితీలు ఇస్తే.. పాత కంపెనీలకు అన్యాయం చేసినట్టు అవుతుంది. అయినా చైనాలో ప్లాంటు పెడతాం.. అక్కడి వారికి ఉద్యోగాలు ఇస్తాం.. ఇండియాలో కార్లు అమ్ముకుని లాభాలు పొందుతాం అనే ధోరణి మాకు మింగుడుపడటం లేదన్నారు నితిన్‌గడ్కారీ.
టెస్లా కార్లను ఇండియాలో అమ్మే లక్ష్యంతో గతంలో బెంగళూరులో టెస్లా కంపెనీ ఆఫీస్ రిజిస్టర్ చేసింది. అయితే ఎలక్ట్రిక్ వెహికల్ అయినందున పన్ను రాయితీలు ఇవ్వాలంటూ మెలిక పెట్టింది. ఇండియాలో తయారీ యూనిట్ స్థాపిస్తే రాయితీలు లేదంటే భారీ పన్నులు తప్పవంటూ కేంద్రం స్పష్టం చేసింది. అయితే అటు ఇండియా మార్కెట్‌ను వదులుకోలేక.. ఇటు ప్లాంట్లు పెడతానంటూ హామీ ఇవ్వలేక ఎలన్‌మస్క్ ‘ప్రభుత్వం సహాకరించడం లేదంటూ’ విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment