చైనా స్టార్టప్ కంపెనీ తయారు చేసిన సూపర్ రేసింగ్ కారు నియో ఈపీ9
భూమి పది కాలాల పాటు పచ్చగా ఉండాలన్నా... వాతావరణ మార్పుల ప్రభావంతో మనిషి మనుగడే ప్రశ్నార్థకం కారాదన్నా పెట్రోలు, డీజిళ్ల కంటే కూడా విద్యుత్తు వాహనాలను వాడటం మేలని అందరూ చెబుతుంటారు. నిజమేకానీ.. ఈ రకమైన వాహనాలతో చిక్కులూ లేకపోలేదు. ఎక్కువ దూరం వెళ్లలేమన్నది ఒక చిక్కయితే... ఎక్కువ వేగంగానూ వెళ్లలేమని, బ్యాటరీలు తరచూ మార్చుకోవాలని ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఈ ఇబ్బందులన్నీ ఒక్కటొక్కటిగా తొలగిపోతున్నాయి కూడా. ఎలన్ మస్క్ తన టెస్లా కారుతో మైలేజీ ఇష్యూను కొంత వరకూ సాల్వ్ చేసినా... స్పీడు, బ్యాటరీల సమస్యలు ఇంకా తీరలేదు. కానీ చైనా స్టార్టప్ కంపెనీ నెక్స్ట్ ఈవీ మాత్రం తమకు ఇవన్నీ సమస్యలు కానే కావు అంటోంది. అనడమే కాదు.. నియో ఈపీ9 పేరుతో ఓ సూపర్ రేసింగ్ కారును సిద్ధం చేసింది కూడా. ఫొటోలో కనిపిస్తున్నది అదే.
నియో ఈపీ9 లోపలి భాగం
దీని శక్తి సామర్థ్యాలేమిటో ఒకసారి చూద్దాం. ముందుగా చెప్పాల్సింది వేగం గురించి. దీని గరిష్ట వేగం గంటకు 312 కిలోమీటర్లు! సున్నా నుంచి 200 కిలోమీటర్ల వేగాన్ని అందుకునేందుకు ఇది తీసుకునే టైమ్ కేవలం 7.1 సెకన్లు మాత్రమే! ఇందుకోసం మొత్తం నాలుగు విద్యుత్తు మోటర్లు కలిపి దాదాపు 1341 హార్స్‌పవర్లకు సమానమైన శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఒకసారి ఛార్జ్ చేసుకుంటే దాదాపు 427 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలం. కేవలం 45 నిమిషాల్లోనే బ్యాటరీని ఛార్జ్ చేసుకోగలగడంతోపాటు నిమిషాల్లో బ్యాటరీలు మార్చుకోగలగడమూ దీని ప్రత్యేకత. ఇప్పటికే నియో ఈపీ9 రెండు రేస్‌ట్రాక్‌లలో తన ప్రతాపాన్ని చూపింది. గత నెల 12న జర్మనీలోని ఎన్బ్రుర్జింగ్ నార్డ్స్‌షెలిఫే రేస్‌ట్రాక్‌పై సరికొత్త రికార్డు సృష్టించింది. ఫ్రాన్‌సలోని పాల్ రికార్డ్ రేస్‌ట్రాక్‌పై కేవలం 1 నిమిషం 52 సెకన్ల 7 మిల్లీ సెకన్లలో ఒక ల్యాప్‌ను పూర్తి చేసింది.