న్యూయార్క్: ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తాజాగా ప్రపంచ కుబేరుల్లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్‌ను రెండో స్థానానికి నెట్టారు. బ్లూమ్‌బర్గ్ నివేదిక బట్టి గురువారం టెస్లా షేర్ల ధర ప్రకారం ఆయన సంపద విలువ 188.5 బిలియన్ డాలర్ల పైగా ఉంది. బెజోస్ సంపదతో పోలిస్తే ఇది 1.5 బిలియన్ డాలర్లు అధికం. కుబేరుల జాబితాలో గతేడాది తొలి నాళ్లలో 35వ స్థానంలో ఉన్న మస్క్.. ఏడాది తిరిగేసరికి అగ్రస్థానానికి చేరడం గమనార్హం. గురువారం టెస్లా షేరు మరో 7 శాతం ఎగిసి 811.61 డాలర్ల రికార్డు స్థాయిని తాకడంతో ఇది సాధ్యపడింది.
టెస్లా షేరు ధర గతేడాది ఏకంగా ఎనిమిది రెట్లు పెరిగింది. ఏడాది వ్యవధిలో టెస్లా షేరు కనిష్ట ధర రూ. 65.42 డాలర్లు కాగా ప్రస్తుతం 811.61 డాలర్ల గరిష్ట స్థాయిని తాకింది. గతేడాది నవంబర్ ఆఖర్లో మస్క్ 127.9 బిలియన్ డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌ను తోసిరాజని రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. రెండు నెలలు కూడా తిరక్కుండానే మరో 60 బిలియన్ డాలర్లు ఖాతాలో వేసుకుని నంబర్ వన్ స్థానానికి ఎగబాకారు. టెస్లాలో మస్క్‌కు 20 శాతం దాకా వాటా ఉంది. ఆయన గతంలో ఇంటర్నెట్ పేమెంట్స్ కంపెనీ పేపాల్ హోల్డింగ్స్‌ను కూడా నెలకొల్పి, మంచి లాభాలకు విక్రయించారు. స్పేస్‌ఎక్స్ అనే రాకెట్ల తయారీ సంస్థ, న్యూరాలింక్ అనే మరో సంస్థను కూడా నెలకొల్పారు. టనెల్స్ ద్వారా పూర్తి ఎలక్ట్రిక్ ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా బోరింగ్ కంపెనీని సైతం ఎలాన్ మస్క్ ప్రారంభించారు.
మస్త్.. మస్క్!
Published Fri, Jan 8 2021 5:33 AM | Last Updated on Fri, Jan 8 2021 5:33 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment