Malegaon blast
-
బతికుంటే కోర్టుకెళతా: సాధ్వి ప్రజ్ఞ
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా కాంగ్రెస్‌పై పలు ఆరోపణలు గుప్పించారు. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఆమె కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. కాంగ్రెస్ తనను చిత్రహింసకు గురిచేసిందని, ఏటీఎస్ కస్టడీకి పంపిందని ఇవి తనను జీవితాంతం వెంటాడుతున్నాయని ఆమె పేర్కొన్నారు.మెదడులో వాపు, చూపు తగ్గడం, వినికిడి లోపం, మాటల్లో అసమతుల్యతతో పాటు స్టెరాయిడ్స్, న్యూరో డ్రగ్స్ కారణంగా తన శరీరమంతా వాపునకు గురవుతున్నదని ఆమె తెలిపారు. తాను బతికి ఉంటే కచ్చితంగా కోర్టు వాదనలకు వెళ్తానని ఆమె పేర్కొన్నారు. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్‌లోని ఫొటోలో ఆమె ముఖంలో వాపు స్పష్టంగా కనిపిస్తోంది.2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో సాధ్వి ప్రజ్ఞ నిందితురాలు. వైద్య కారణాలతో ఆమె గత కొన్ని నెలలుగా కోర్టుకు హాజరుకావడం లేదు. ఈ కేసులో ఎన్ఐఏ ఆమెకు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో తుది వాదనలు కొనసాగుతున్నాయని, ఆమె కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. #कांग्रेस_का_टॉर्चर सिर्फ ATS कस्टडी तक ही नहीं मेरेजीवन भर के लिए मृत्यु दाई कष्ट का कारण हो गएl ब्रेन में सूजन,आँखों से कम दिखना,कानो से कम सुनना बोलने में असंतुलन स्टेरॉयड और न्यूरो की दवाओंसे पूरे शरीर में सूजन एक हॉस्पिटल में उपचार चल रहा हैl जिंदा रही तो कोर्ट अवश्य जाउंगीl pic.twitter.com/vGzNWn6SzX— Sadhvi Pragya Singh Thakur (@sadhvipragyag) November 6, 2024 ఇటీవల సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ హిందూయేతర దుకాణదారులు వారి వ్యాపార సంస్థలపై వారి పేర్లను రాయాలని కోరారు. కన్వర్ యాత్ర మార్గాల్లో ఉన్న తినుబండారాల దుకాణదారులు వారిపేర్లను వెల్లడించాలని ఆమె కోరారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఇలాంటి ఆదేశాలు జారీ చేసిన దరిమిలా సాధ్వి ప్రజ్ఞా ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది.ఇది కూడా చదవండి: నా భర్తకు ఏం జరిగినా అందుకు హోంమంత్రి అనితదే బాధ్యత -
ప్రజ్ఞాసింగ్‌కు టిక్కెట్ ఇవ్వడంలో మతలబు?
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌పై హత్య, నేరపూరిత కుట్ర, రెండు మతాల మధ్య విద్వేషాన్ని రగిలించడం తదితర అభియోగాలతో క్రిమినల్ కేసులు ఉన్నాయి. భారత రాజకీయ నేతలపై ఇలాంటి అభియోగాలతో కేసులు దాఖలవడం కొత్తేమి కాదు. కానీ ప్రజ్ఞాసింగ్‌పై దాఖలైన కేసు చాలా భిన్నమైనది. అది టెర్రరిజం కేసు. అంతటి తీవ్రమైన కేసు ఉన్నప్పటికీ ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఖరారు చేయడం మామూలు విషయం కాదు. పైగా ఈ కేసులో ఆమె అనారోగ్య కారణాలతో బెయిల్‌పై ఉన్నారు. అనారోగ్యంతో ఉన్న ఆమె ఎన్నికల ప్రచారంలో ఎలా పాల్గొంటారు? సరే, ప్రస్తుతానికి అది వేరే విషయం. మహారాష్ట్రలోని మాలేగావ్‌లో 2008లో సంభవించిన మోటార్‌సైకిల్ బాంబు పేలుడులో ఆరుగురు మరణించగా, వంద మందికిపైగా గాయపడ్డారు. ఈ పేలుడు కుట్రదారుల్లో ప్రజ్ఞాసింగ్ ఒకరిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇతర వ్యవస్థీకత నేరాలకు, టెర్రరిజమ్ నేరానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. డబ్బుకోసమో లేదా ఇతర ప్రయోజనాల కోసమో వ్యవస్థీకత నేరాలు జరుగుతాయి. టెర్రరిజమ్ బుర్రను తొలిచే ఓ సిద్ధాంతం నుంచి పుట్టుకువస్తుంది. టెర్రరిస్టులు తాము ద్వేషించే శక్తుల అంతానికి హింసకు దిగుతారు. మెజారిటీలను అణచివేసేందుకు మైనారిటీలు టెర్రరిజాన్ని ప్రయోగిస్తారని భారత లాంటి దేశాల్లో ఒక అపోహ ఉంది. వాస్తవానికి మైనారిటీలను మెజారిటీలు అణచివేసినప్పుడు అసహనం, అశక్తతతో మైనారిటీల నుంచి తిరుగుబాట్లతోపాటు వాటి వికతరూపమైన టెర్రరిజమ్ పుట్టుకొస్తుందని ప్రపంచ మేధావులు ఇప్పటికే తేల్చి చెప్పారు. టెర్రరిజమ్ ఏ రూపంలో ఉన్నా, ఆ శక్తులు ఏమైనా తీవ్రంగా అణచివేయాల్సిందే, సమూలంగా నిర్మూలించాల్సిందేనంటూ పలు అంతర్జాతీయ తీర్మానాలు అమల్లో ఉన్నాయి. అలాంటప్పుడు ఓ టెర్రరిస్టు కేసులో ప్రధాన కుట్రదారుల్లో ఒకరైన ప్రజ్ఞాసింగ్‌కు బీజేపీ టిక్కెట్ ఇవ్వడంలో ఔచిత్యం ఉందా? ఇస్లాం టెర్రరిజమ్ నేరమయితే, దానికి వ్యతిరేకంగా వచ్చినప్పటికీ హిందూ టెర్రరిజమ్ నేరం కాదా? మైనారిటీలు చేస్తేనే తప్పు, మెజారిటీ వర్గీయులు చేస్తే తప్పుకాదనుకోవడం ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందేమోగానీ సెక్కులరిజమ్ అనిపించుకోదు. భారత రాజ్యాంగంలోని సెక్యులరిజమ్ భావాలకు ఇది విరుద్ధం కాదా ? భిన్న మతాలు, భిన్న సంస్కతుల సమ్మిలిత బహుల సమాజం భారత దేశం. దీనికి భిన్నంగా మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు పెద్ద పీట వేయడం వల్ల సమాజంలో సంక్షోభాలు తలెత్తి అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడతాయని ‘ది డార్క్ సైడ్ ఆఫ్ ది డెమోక్రసీ’ పుస్తకంలో ప్రముఖ రాజకీయ, సామాజిక శాస్త్రవేత్త మైఖేల్ మాన్ హెచ్చరించారు. దుష్ట శక్తి అనేది నాగరికతకు సంబంధం లేకుండా రాదని, నాగరికత నుంచే అది పుడుతుందని, దుష్ట శక్తికి రాజకీయ ఆసరా లభించినట్లయితే అది నాగరికత అంతానికి కారణం అవుతుందని కూడా మైఖేల్ మాన్ హెచ్చరించారు. ప్రజ్ఞాసింగ్‌పై కేవలం ఆరోపణలే కాదు, ఆమె బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు రెండు నెలల కాలంలోనే అప్పటి పోలీసు దర్యాప్తు అధికారి హేమంత్ ఖర్కరే కనుగొన్నారు. పేలుడు పదార్థాలు అమర్చిన బంగారు రంగు ‘ఎల్ఎంఎల్ ఫ్రీడమ్ మోటార్‌సైకిల్’ యజమానిని గుర్తించడం ద్వారా ఆయన మాలేగావ్ కేసు కూపీ లాగారు. అప్పటికి సైన్యంలో పనిచేస్తున్న లెఫ్ట్‌నెంట్ కల్నల్ శ్రీకాంత్ పురోహిత్‌తోపాటు రిటైర్డ్ మేజర్ రమేశ్ ఉపాధ్యాయ్‌తోపాటు పలువురు సాధువులు, మహంతుల హస్తం ఉన్నట్లు కనుగొని వారిపై ఆయన కేసులు పెట్టారు. దురదష్టవశాత్తు రెండు నెలల అనంతరం ఓ టెర్రరిస్టు కాల్పుల్లో ఆయన మరణించారు. తాను పెట్టిన శాపం పర్యవసానంగానే ఖర్కరే చచ్చాడని ప్రజ్ఞాసింగ్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. -
సాధ్వి ప్రజ్ఞ ..రాయని డైరీ
మే పన్నెండున భోపాల్ పోలింగ్. ప్రచారానికి తగినంత సమయం ఉన్నట్లేమీ కాదు. అయినప్పటికీ, ఉగ్రవాదుల తూటాలకు బలైన హేమంత్ కర్కరేను అమరవీరుడేనని కీర్తించడానికి నేను గత రెండు రోజులుగా నా ప్రచారసభలలో ఎక్కువ సమయం కేటాయిం చవలసి వస్తోంది. ఇది నేను కొనితెచ్చుకున్న పరిస్థితేమీ కాదు. విధి కొన్నిసార్లు అలా జరిపిస్తుంది. భోపాల్‌లో ముప్పై ఏళ్లుగా వరుసగా బీజేపీ వస్తోంది. తొలిసారి బీజేపీ వచ్చినప్పుడు నా వయసు ఏడాది. ముప్పై ఏళ్ల బీజేపీకి ఇప్పుడు ముప్పై ఏళ్ల యువతిగా నేను పోటీ చేస్తున్నాను. ఇక్కడి నుంచి మరో ముప్పై ఏళ్లయినా నేను, నాతో పాటు బీజేపీ విజయం సాధిస్తూ పోవాలి. మోదీ ఆకాంక్ష అది. మోదీ ఆకాంక్షను నెరవేర్చడం కోసం భోపాల్ ఎంపీగా గెలిచి తీరడం అన్నది నేను ఆచరిస్తున్న హైందవ ధర్మంలోని ఒక కనీసం విధి మాత్రమే. ఆ మాత్రమైనా నా విధిని నేను నిర్వహించే దారిలో అవరోధాలు సృష్టించ డానికి నా ప్రత్యర్థి దిగ్విజయ్ సింగ్, ఆయన్ని నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ.. అశోక చక్ర అవార్డు గ్రహీత హేమంత్ కర్కరే ఆత్మను ఆశ్రయించడం నా మనసుకు బాధ కలిస్తోంది. ‘నా శాపంతోనే కర్కరే బలి అయ్యారు’ అని ఆవేదనతో నేను అన్న మాటను ఒక జాతి విద్రోహ వ్యాఖ్యగా చిత్రీకరించి వీళ్లంతా తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని చూడడం ఏమంత సముచితం?! జాతి విద్రోహం అంటే దేశ విద్రోహమే కదా. దేశ విద్రోహం అంటే హైందవ విద్రోహ మేగా! హైదవ సాధ్విని నేను. నేనెందుకలా నన్ను నేను విద్రోహించుకుంటాను. ఆ మాత్రం ఆలోచించరా? సాధువు గానీ, సాధ్వి గానీ.. రాగద్వేషా లకు, భావోద్వేగాలకు అతీతమైనవారు. అయితే మాలెగావ్ పేలుడు కేసులో ముంబై జైల్లో ఉన్నప్పుడు ఏం జరిగిందన్న విషయాన్ని ఒక సాధ్విగా నేనిప్పుడు నా నియోజక వర్గ ప్రజల దృష్టికి తీసుకురాలేదు. ఆనాటి ఇరవై ఏళ్ల బాధిత యువతిగా మాత్రమే మాట్లాడాను. అవును శపించాను. ఆ రోజు కర్కరేకు, నాకు మధ్య జైల్లో జరిగిన సంభాషణే కర్కరేను నేను శపించేలా చేసింది. అయితే పైకేమీ నేను శపించలేదు. కమండలంలోని నీళ్లు ఆయన నెత్తిపై చల్లేమీ శపించలేదు. మనసులోనే శపించాను. శపించినట్లు ఇప్పటి వరకూ ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడైనా శపించా నని చెప్పలేదు. శాపానికి గురయ్యేలా కర్కరే నన్ను ఎంత హింసించిందీ చెప్పాను. ఒక సాధ్వి పడిన హింసను పక్కన పెట్టి, ఒక సాధ్వి పెట్టిన శాపం గురించే అంతా మాట్లాడుతున్నారు. నిర్బంధంలో ఉన్న ఇరవై ఏళ్ల ఆడపిల్ల.. తనెంత సాధ్వి అయినా.. శపించడం తప్ప ఏం చేయగలదు?! ఉగ్రవాదుల దగ్గర బాంబులు ఉంటాయి. పోలీసుల దగ్గర తూటాలు ఉంటాయి. రాజకీయ నాయకుల దగ్గర మాటలు ఉంటాయి. అవమానంతో క్షోభిస్తున్న స్త్రీ హృదయంలో శాపనార్థాలు తప్ప ఏముంటాయి?! నిజం చెప్పమంటాడు కర్కరే! ‘పేలుళ్లతో నాకు సంబంధం లేదన్నదే నిజం’ అన్నాను. నమ్మలేదు. ‘సంబంధం ఉన్నదీ లేనిదీ ఆ దేవు డికి తెలుసు’ అన్నాను. ‘అంటే ఏంటి! నేనిప్పుడు దేవుడి దగ్గరకు వెళ్లి తెలుసుకోవాలా?!’ అని బెల్టు తీశాడు. సాధ్వి తిరగబడ గలదా? దేవుణ్ణి వేడుకుంటుంది. నేను చేసిందీ అదే. ‘ఆప్ కి అదాలత్’ షోలో రజత్ శర్మ నన్ను ఒకమాట అడిగారు. ‘రాజకీయాల్లోకి వస్తు న్నారా?’ అని. దేశం కోరుకుంటే వస్తాను అన్నాను. ఆయనే ఇంకో మాట.. రాహుల్ గాంధీ గురించి.. అడిగారు. ‘స్మాల్ చైల్డ్’ అని అన్నాను. నా వంటి పరిత్యాగులకు ఏదీ పెద్ద విషయంగా అనిపించదు. ఎవరూ పెద్ద నాయ కులుగా అనిపించరు. మోదీ ఇందుకు అతీతం. ఆయన నాయకుడే అయినప్పటికీ ఈ దేశంలో అందరికన్న పెద్ద పరిత్యాగి. -
మాలెగావ్ కేసులో పురోహిత్‌కు బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ : మాలెగావ్ పేలుడు కేసులో ఎట్టకేలకు లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్‌కు సుప్రీం కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. తన బెయిల్ వినతిని తోసిపుచ్చుతూ బొంబాయి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంను ఆశ్రయించారు. పురోహిత్‌కు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస ఆర్కే అగర్వాల్, ఏఎం సప్రేతో కూడిన బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సందర్భంగా పురోహిత్ తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తూ నిందితుడు తొమ్మిదేళ్లుగా జైలులోనే ఉన్నా ఇప్పటివరకూ ఆయనపై అభియోగాలు నమోదు చేయలేదని చెప్పారు. పురోహిత్‌పై మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం కింద మోపిన అభియోగాలను వెనక్కి తీసుకున్నందున మధ్యంతర బెయిల్ పొందేందుకు అర్హుడని కోర్టుకు నివేదించారు. ఎన్ఐఏ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ మణిందర్ సింగ్ వాదిస్తూ పురోహిత్‌పై అభియోగాల నమోదుకు అవసరమైన ఆధారాలున్నాయని చెప్పారు. మాలెగావ్‌లో 2008 సెప్టెంబర్ 29న జరిగిన బాంబు పేలుళ్లలో ఏడుగురు మరణించారు. అక్కడ పెద్దసంఖ్యలో ముస్లింలున్నందునే పేలుళ్లకు లక్ష్యంగా చేసుకున్నారని 4000 పేజీల చార్జిషీట్లో పేర్కొన్నారు. పేలుళ్లకు ప్రగ్యా ఠాకూర్, పురోహిత్, సహ నిందితుడు దయానంద్ పాండేలు ప్రధాన కుట్రదారులుగా చార్జిషీట్ పొందుపరిచారు. -
మాలేగావ్ కేసులో ఎనిమిదిమందికి విముక్తి
న్యూఢిల్లీ : మాలేగావ్ పేలుళ్ల కేసులో ఎనిమిదిమంది నిందితులను ముంబై ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా తేల్చింది. వారిని తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. 2008 సెప్టెంబర్ 8న మాలేగావ్‌లో ఒక ప్రార్థనా స్థలంలో జరిగిన బాంబు పేలుడులో 37 మంది మృతి చెందగా సుమారు 160 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉగ్రవాద వ్యతిరేక విభాగం (ఏటీఎస్) జరిపిన దర్యాప్తు నేపథ్యం లో తొమ్మిది మంది ముస్లిం యువకులను అనుమానితులుగా అరెస్టు చేశారు. వీరిలో ఒకరు మృతి చెందారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వీళ్లంతా గత అయిదేళ్లుగా జైలు జీవితం గడుపుతున్నారు. -
‘మాలేగావ్’ పేలుడు కేసులో ఏటీఎస్, సీబీఐ, హోం శాఖకు నోటీసులు
ముంబై : మాలేగావ్ బాంబు పేలుడు కేసులో దర్యాప్తుపై ఏటీఎస్, సీబీఐ, రాష్ట్ర హోం శాఖకు ముంబై ప్రత్యేక కోర్టు శనివారం నోటీసులు జారీ చేసింది. నవంబర్ 27లోగా నోటీసులకు జవాబు ఇవ్వాలని కోర్టు అందులో పేర్కొంది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) జరిపిన దర్యాప్తును సవాలు చేస్తూ ఒక నిందితుడు వేసిన పిల్ శనివారం విచారణకు వచ్చింది. వివరాలిలా.. 2008 సెప్టెంబర్ 8న మాలేగావ్‌లో ఒక ప్రార్థనా స్థలంలో జరిగిన బాంబు పేలుడు జరిగింది అందులో 37 మమంది మృతి చెందగా సుమారు 160 మంది గాయపడిన విష యం తెలిసిందే. ఈ సందర్భంగా ఉగ్రవాద వ్యతి రేక విభాగం (ఏటీఎస్) జరిపిన దర్యాప్తు నేపథ్యం లో తొమ్మిది మంది ముస్లిం యువకులను అనుమానితులుగా అరెస్టు చేశారు. అనంతరం విచారణ జరిపిన ఎన్ఐఏ వారిని నిర్దోషులుగా పేర్కొంది. తమను ఏటీఎస్, సీబీఐ అక్రమంగా ఈ బాంబు పేలుడు కేసులో ఇరికించాయని వారు కోర్టును ఆశ్రయించారు. కాగా, ఎన్ఐఏ దర్యాప్తును వాస్తవికతను ప్రశ్నిస్తూ మనోహర్సింగ్ కోర్టును ఆశ్రయిం చాడు. కాగా, ఈ కేసు విచారణను సాగదీసేందుకు, కోర్టును తప్పుదోవ పట్టించేందుకు మనోహర్సింగ్ ఈ పిటిషన్ వేశాడని సదరు ముస్లిం యువకులకు అండగా నిలిచిన జమైత్ ఉలేమా-ఈ-హింద్ ఆరోపించింది. కాగా, 2010లో స్వామి ఆశీమానంద అరెస్టు అనంతరం కేసు మలుపు తిరిగింది. అతడిని పోలీసులు విచారించినప్పుడు ముస్లింలు ఎక్కువగా ఉండే మాలేగావ్ పట్టణంలో 2008లో జరిగిన బాంబు పేలుడులో హిందూ ఛాందసవాదుల పాత్ర ఉందని తెలిపాడు. దాంతో ఎన్ఐఏ రంగంలోకి దిగి2006 బాంబు పేలుడుపై తిరిగి దర్యాప్తు జరిపింది. ఈ సందర్భం గా కొత్తగా మనోహర్సింగ్, ధన్సింగ్, లోకేశ్ శర్మ, రాజేంద్ర చౌదరీలను అరెస్టు చేసింది. గత ఏడాది, ముస్లిం యువకులకు బెయిల్ లభించగా, ఎన్ఐఏ దర్యాప్తు ననుసరించి తమకు కేసునుంచి విముక్తి కలిగించాలని వారు కోర్టును ఆశ్రయించారు. కాగా, ఎన్ఐఏ విచారణ నిష్పక్షపాతంగా జరగలేదని పేర్కొంటూ నిందితుల్లో ఒకడైన మనోహర్ సింగ్ కోర్టులో పిటిషన్ దాఖలుచేశాడు.