ప్రతీకాత్మక చిత్రం
డ్రాయింగ్ రూమ్‌లో నేను, నా బుక్స్ ఉన్నాం. నవ్వుకున్నాను. వచ్చి వెళ్లిన వాళ్లలో ఒకరు అడిగిన మాట గుర్తొచ్చి మళ్లీ వచ్చిన నవ్వు అది! ‘‘మీకెలా కుదురుతుంది సోనియాజీ ఇన్ని బుక్స్ చదవడానికి’’ అని ఆయన ప్రశ్న. ‘‘అవన్నీ భారత పార్లమెంటు సంప్రదాయాలను తెలియజెప్పే పుస్తకాలు. ఎన్నిసార్లు చదివినా మళ్లీ మళ్లీ చదివించే ఆకర్షణ శక్తి ఏదో ఆ పుస్తకాల్లో ఉంది’’ అన్నాను.
‘‘గ్రేట్ సోనియాజీ.. పార్లమెంట్ సెషన్స్‌లో మీరెప్పుడూ పార్లమెంటు సంప్రదాయాలను గౌరవిస్తూ కనిపించేవారు. ఒక ఎంపీకి ఇదెలా సాధ్యమా అని మిమ్మల్ని చూసి ఆశ్చర్యపడుతుండేవాడిని. మీరు కనుక అనుమతిస్తే, మీ బుక్ ర్యాక్ లోంచి ఎంపిక చేసిన ఒక పుస్తకాన్ని పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందే ఎంపీలందరి చేతా చదివించాలన్న ఆలోచన నాలో కలుగుతోంది’’ అన్నారు ఆయన! నవ్వాను. ‘‘మీరు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అని గుర్తుంది. కానీ మీరు పేరును మాత్రం ఎంత ప్రయత్నించీ గుర్తుచేసుకోలేక పోతున్నాను. బహుశా మీ పేరు కూడా ‘పి’ తోనే స్టార్ అవుతుంది కదా!’’ అన్నాను.
ఆయనా నవ్వారు. ‘‘చక్కగా గుర్తు పెట్టుకున్నారు సోనియాజీ. ‘పి’తోనే మొదలౌతుంది నా పేరు! ప్రహ్లాద్ జోషి’’ అన్నారు. ఆయన తో పాటు వచ్చిన మరో ఇద్దరు పేర్లను కూడా ఆయనే చెప్పేశారు.‘‘కానీ జోషీజీ.. పార్లమెంటులో మొత్తం మీవాళ్లే ఉన్నప్పుడు.. భారత పార్లమెంటు సంప్రదాయాల గురించి వివరించే పుస్తకం ఒకటి మీకు అవసరం అవుతుందని నేను అనుకోవడం లేదు’’ అన్నాను. ఆ మాటకు జోషీ నొచ్చుకున్నట్లుగా కనిపించాడు.
‘‘పార్లమెంటులో మా జనాభానే ఎక్కువ కాబట్టి పార్లమెంటు సంప్రదాయాలను పాటించే అవసరం మాకేమిటని మీరు భావిస్తున్నట్లుగా ఉంది సోనియాజీ. కానీ మీరు పాటిస్తున్న పార్లమెంటు విలువల్నే మేమూ పాటించాలని అనుకుంటున్నాం కనుక.. అందుకోసం మీ ర్యాక్‌లోని పుస్తకాలలో ఒక పుస్తకాన్నయినా మేము చదవాలనుకోవడంలో తప్పేముంది?’’ అన్నారు జోషి. ఆయనింకా నొచ్చుకునే మూడ్‌లోనే ఉన్నారు!
‘‘జోషీజీ... ‘పార్లమెంటులో అంతా మీరే ఉన్నప్పుడు’ అని నేను అనడంలోని నా ఉద్దేశాన్ని మీరు వేరేలా అర్థం చేసుకున్నట్లుంది. చూడండి. నన్నొక్కర్ని కలిసేందుకు మీరు ముగ్గురు వచ్చారు. ఎంత చక్కటి పార్లమెంటరీ సంప్రదాయం! లోక్‌సభలో మేం గుప్పెడు మంది ఎంపీలం లేకపోయినా, ‘సోనియాజీ.. సభ సజావుగా సాగేందుకు మీ సహకారం అవసరం’ అంటూ వచ్చారు. అదెంత గొప్ప పార్లమెంటరీ సంప్రదాయం! అందుకే అంటున్నాను. మీవాళ్లెవరికీ పుస్తకాలు అవసరం లేదని. ఎందుకంటే జోషీజీ.. మీరంతా ఎవరికి వాళ్లు ఒక్కో పార్లమెంటరీ సంప్రదాయాల పుస్తకం’’ అన్నాను.
జోషీ ముఖం వెలిగిపోయింది.
‘‘జూన్ పదిహేడు నుంచి సోనియాజీ.. మన సమావేశాలు’’ అని చెప్పి ముగ్గురూ వెళ్లిపోయారు. వెళ్లిపోయాక, కళ్లు మూసుకుని ఆలోచిస్తోంటే ఇప్పుడనిపిస్తోంది. ఏదైనా ఎంపిక చేయబడిన ఒక పుస్తకం వాళ్లకు ఎంతైనా అవసరం ఉందని! కనీసం మాట మాత్రంగానైనా ఒక్కరూ అడగలేదు.. ‘రాహుల్ బాబు ఎక్కడ? ఇంట్లో కనిపించడం లేదు’ అని. లేచి, ర్యాక్ వైపు వెళుతుంటే వయనాడ్ నుంచి రాహుల్ ఫోన్. ‘‘మమ్మీ.. వీళ్లంతా నేను కావాలి.. నేను కావాలి అంటున్నారు. ఇక్కడే ఉండిపోయేదా?’’ అని అడుగుతున్నాడు!!
Comments
Please login to add a commentAdd a comment