singaraju
-
వైఎస్సార్సీపీ సీనియర్ నేత సింగరాజు వెంకట్రావు కన్నుమూత
ఒంగోలు: వైఎస్సార్సీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు (55) అనారోగ్యంతో మంగళవారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన కొన్ని నెలలుగా హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. కోలుకుంటున్నారని అందరూ భావిస్తున్న సమయంలో ఆయన మరణవార్త తెలియడంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. హైదరాబాద్ నుంచి మంగళవారం మధ్యాహ్నం భౌతికకాయాన్ని ఒంగోలు బండ్లమిట్టలోని ఆయన నివాస గృహానికి తీసుకొచ్చారు. కన్నీటి పర్యంతమైన బాలినేని దంపతులు.. వెంకట్రావు భౌతికకాయం ఒంగోలుకు రాగానే వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన సతీమణి శచీదేవి, కుమారుడు బాలినేని ప్రణీత్‌రెడ్డి అక్కడకు చేరుకున్నారు. వెంకట్రావు భౌతికకాయాన్ని పట్టుకుని బాలినేని కన్నీటి పర్యంతమయ్యారు. నగరంలో మంచి అభిమానాన్ని సంపాదించుకున్న సింగరాజు వెంకట్రావు భౌతికకాయాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఫోన్లో పరామర్శించిన మంత్రి సురేష్.. సింగరాజు వెంకట్రావు మృతికి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకట్రావు కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. వెంకట్రావు పారీ్టకి అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నామన్నారు. ఇదీ వెంకట్రావు ప్రస్థానం.. సింగరాజు వెంకట్రావు నగరంలో వైఎస్సార్ సీపీకి ఎంతో కీలకమైన నేత. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి అత్యంత నమ్మకస్తుడు. వైఎస్సార్ సీపీ ప్రతిపక్షంలో ఉన్నా...అధికారంలో ఉన్నా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో, టీడీపీ ప్రభుత్వంలో అద్దంకి బస్టాండ్‌లో దుకాణాలను కూల్చివేసిన సమయంలో అండగా నిలబడి కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపారు. కమ్మపాలెంలో వైఎస్సార్ సీపీ కార్యాలయం ప్రారంభాన్ని టీడీపీ నేతలు అడ్డుకున్న సమయంలోనూ ఆయన వారిని ఎదిరించి నిలిచారు. ఈ క్రమంలో జైలుకు సైతం వెళ్లారు. పారీ్టలో ఆయన సేవలకు గుర్తింపుగా సింగరాజు వెంకట్రావు సతీమణి మీనాకుమారికి ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తొలి చైర్‌పర్సన్‌గా నామినేటెడ్ పోస్టు కేటాయించారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యానికి గురై కన్నుమూయడం అందరినీ కలిచివేసింది. వెంకట్రావుకు భార్య మీనాకుమారితో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకట్రావు భౌతికకాయానికి నగర మేయర్ గంగాడ సుజాత, బైరెడ్డి అరుణ, కుప్పం ప్రసాద్, వేమూరి సూర్యనారాయణ, వెలనాటి మాధవరావు, కటారి శంకర్, గంటా రామానాయుడు, సింగరాజు రాంబాబు, తోటపల్లి సోమశేఖర్, దామరాజు క్రాంతికుమార్, పంది రత్నరాజు, కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, హరిబాబు, పటాపంజుల శ్రీనివాసులు, బొట్ల సుబ్బారావు, పెద్దిరెడ్డి భాస్కరరెడ్డి, షేక్ మీరావలి ఇతర నేతలు నివాళులర్పించారు. నేడు అంత్యక్రియలు... బుధవారం స్థానిక బండ్లమిట్టలోని వెంకట్రావు నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఆర్టీసీ బస్టాండ్ వద్ద మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
సోనియా గాంధీ(యూపీఏ) రాయని డైరీ
డ్రాయింగ్ రూమ్‌లో నేను, నా బుక్స్ ఉన్నాం. నవ్వుకున్నాను. వచ్చి వెళ్లిన వాళ్లలో ఒకరు అడిగిన మాట గుర్తొచ్చి మళ్లీ వచ్చిన నవ్వు అది! ‘‘మీకెలా కుదురుతుంది సోనియాజీ ఇన్ని బుక్స్ చదవడానికి’’ అని ఆయన ప్రశ్న. ‘‘అవన్నీ భారత పార్లమెంటు సంప్రదాయాలను తెలియజెప్పే పుస్తకాలు. ఎన్నిసార్లు చదివినా మళ్లీ మళ్లీ చదివించే ఆకర్షణ శక్తి ఏదో ఆ పుస్తకాల్లో ఉంది’’ అన్నాను. ‘‘గ్రేట్ సోనియాజీ.. పార్లమెంట్ సెషన్స్‌లో మీరెప్పుడూ పార్లమెంటు సంప్రదాయాలను గౌరవిస్తూ కనిపించేవారు. ఒక ఎంపీకి ఇదెలా సాధ్యమా అని మిమ్మల్ని చూసి ఆశ్చర్యపడుతుండేవాడిని. మీరు కనుక అనుమతిస్తే, మీ బుక్ ర్యాక్ లోంచి ఎంపిక చేసిన ఒక పుస్తకాన్ని పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందే ఎంపీలందరి చేతా చదివించాలన్న ఆలోచన నాలో కలుగుతోంది’’ అన్నారు ఆయన! నవ్వాను. ‘‘మీరు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అని గుర్తుంది. కానీ మీరు పేరును మాత్రం ఎంత ప్రయత్నించీ గుర్తుచేసుకోలేక పోతున్నాను. బహుశా మీ పేరు కూడా ‘పి’ తోనే స్టార్ అవుతుంది కదా!’’ అన్నాను. ఆయనా నవ్వారు. ‘‘చక్కగా గుర్తు పెట్టుకున్నారు సోనియాజీ. ‘పి’తోనే మొదలౌతుంది నా పేరు! ప్రహ్లాద్ జోషి’’ అన్నారు. ఆయన తో పాటు వచ్చిన మరో ఇద్దరు పేర్లను కూడా ఆయనే చెప్పేశారు.‘‘కానీ జోషీజీ.. పార్లమెంటులో మొత్తం మీవాళ్లే ఉన్నప్పుడు.. భారత పార్లమెంటు సంప్రదాయాల గురించి వివరించే పుస్తకం ఒకటి మీకు అవసరం అవుతుందని నేను అనుకోవడం లేదు’’ అన్నాను. ఆ మాటకు జోషీ నొచ్చుకున్నట్లుగా కనిపించాడు. ‘‘పార్లమెంటులో మా జనాభానే ఎక్కువ కాబట్టి పార్లమెంటు సంప్రదాయాలను పాటించే అవసరం మాకేమిటని మీరు భావిస్తున్నట్లుగా ఉంది సోనియాజీ. కానీ మీరు పాటిస్తున్న పార్లమెంటు విలువల్నే మేమూ పాటించాలని అనుకుంటున్నాం కనుక.. అందుకోసం మీ ర్యాక్లోని పుస్తకాలలో ఒక పుస్తకాన్నయినా మేము చదవాలనుకోవడంలో తప్పేముంది?’’ అన్నారు జోషి. ఆయనింకా నొచ్చుకునే మూడ్‌లోనే ఉన్నారు! ‘‘జోషీజీ... ‘పార్లమెంటులో అంతా మీరే ఉన్నప్పుడు’ అని నేను అనడంలోని నా ఉద్దేశాన్ని మీరు వేరేలా అర్థం చేసుకున్నట్లుంది. చూడండి. నన్నొక్కర్ని కలిసేందుకు మీరు ముగ్గురు వచ్చారు. ఎంత చక్కటి పార్లమెంటరీ సంప్రదాయం! లోక్‌సభలో మేం గుప్పెడు మంది ఎంపీలం లేకపోయినా, ‘సోనియాజీ.. సభ సజావుగా సాగేందుకు మీ సహకారం అవసరం’ అంటూ వచ్చారు. అదెంత గొప్ప పార్లమెంటరీ సంప్రదాయం! అందుకే అంటున్నాను. మీవాళ్లెవరికీ పుస్తకాలు అవసరం లేదని. ఎందుకంటే జోషీజీ.. మీరంతా ఎవరికి వాళ్లు ఒక్కో పార్లమెంటరీ సంప్రదాయాల పుస్తకం’’ అన్నాను. జోషీ ముఖం వెలిగిపోయింది. ‘‘జూన్ పదిహేడు నుంచి సోనియాజీ.. మన సమావేశాలు’’ అని చెప్పి ముగ్గురూ వెళ్లిపోయారు. వెళ్లిపోయాక, కళ్లు మూసుకుని ఆలోచిస్తోంటే ఇప్పుడనిపిస్తోంది. ఏదైనా ఎంపిక చేయబడిన ఒక పుస్తకం వాళ్లకు ఎంతైనా అవసరం ఉందని! కనీసం మాట మాత్రంగానైనా ఒక్కరూ అడగలేదు.. ‘రాహుల్ బాబు ఎక్కడ? ఇంట్లో కనిపించడం లేదు’ అని. లేచి, ర్యాక్ వైపు వెళుతుంటే వయనాడ్ నుంచి రాహుల్ ఫోన్. ‘‘మమ్మీ.. వీళ్లంతా నేను కావాలి.. నేను కావాలి అంటున్నారు. ఇక్కడే ఉండిపోయేదా?’’ అని అడుగుతున్నాడు!! -
దొంగ పట్టాలు కాకపోతే దాగుడు మూతలెందుకు?
ఒంగోలు: ఒంగోలు నగరంలోని కేశవరాజుకుంట వెనుక ఎన్ఎస్పీ స్థలంలో టీడీపీ కార్యకర్తలకు ఇచ్చిన పట్టాలు దొంగపట్టాలు కాకపోతే దాడుగు మూతలెందుకని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు ప్రశ్నించారు. దర్జాగా వచ్చి అర్హులైన టీడీపీ నేతలకే ఇచ్చామంటూ వారి పేర్లను ప్రకటించాలని, అదేవిధంగా ఎన్ఎస్పీ అధికారులు, మండల రెవెన్యూ అధికారులతో బహిరంగంగా ప్రకటింపజేయాలని టీడీపీ నేతలకు, స్థానిక ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. 10 రోజులుగా ఎన్ఎస్పీ స్థలంలో టీడీపీ నేతలు దౌర్జన్యంగా ఆక్రమణలకు దిగడాన్ని ప్రజానీకం గమనిస్తున్నారన్న విషయం మరువరాదన్నారు. కేశవరాజుకుంట, రాజీవ్‌గృహ కల్ప కాలనీ, ఇందిరమ్మ కాలనీలలో భూసేకరణ చేసింది టీడీపీ అంటూ టిడిపి నేతలు ప్రకటించడం చూస్తుంటే కనీస అవగాహన లేనివారే మాట్లాడుతున్నట్లు స్పష్టం అవుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వం పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ పేరుతో కాలనీలు ఏర్పాటు చేసిందా అంటూ ఎద్దేవా చేశారు. నగరపాలక సంస్థ, ఆర్అండ్బీ, పీడబ్లు్యడీ పంచాయతీరాజ్ శాఖలలో మీ నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్క శాతం లెస్‌కు అయినా టెండర్లు ఖరారు కాలేదని, తద్వారా పెద్ద మొత్తంలో ప్రజాథనం దోపిడీ అయిందన్నారు. ఎవరైనా పోటీపడి లెస్‌కు వేస్తే వారిపై కక్షపూరితంగా వ్యవహరించడం, రోడ్లమీద రోడ్లు వేసి శివారు కాలనీలను నిర్లక్ష్యం చేయడమేనా అభివృద్ధి అంటూ మండిపడ్డారు. బాలినేనిపై తెలుగుదేశం నేతలు చూస్తున్న ఆరోపణలు చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు. శివారు కాలనీలకు వెళ్ళి ఎవరిని అడిగితే పేదలకు పట్టాలు ఇచ్చింది ఎవరో, ప్రభుత్వ భూమిని కార్యకర్తలకు, పార్టీ నేతలకు పంచుకున్నది ఎవరో కూడా ప్రజలే చెబుతారన్నారు. పెళ్లూరు చెరువు వద్ద గుడిసెలు వేయించి వాటిని ఆక్రమించుకుంది, పేదలకు పట్టాలు ఇవ్వడానికి భూమి లేదంటున్న మీరు మీ పార్టీ కార్యాలయం కోసం రెండెకరాల భూమిని ఎందుకు స్వాధీనం చేసుకుంటున్నారు, «ధారావారికుంటలో పారిశుధ్య కార్మికులను సైతం మోసం చేయాలని చూస్తోంది ఎవరు, ఊరచెరువు స్థలంపై హైకోర్టుకు వెళ్లిన మాలకొండయ్యకు నాలుగు పట్టాలు ఇచ్చి రాజీ చేసుకోవాలనుకుంటున్నది ఎవరు, రాష్ట్రంలో ఐఏఎస్‌ల కొరత ఉన్నట్లు చిన్న కమిషనర్‌ను నగరపాలక సంస్థకు తీసుకువచ్చింది కోట్లు దండుకోవడానికి కాదా..? అంటూ ప్రశ్నించారు. ఎన్ఎస్పీ స్థలం ఆక్రమణలను అడ్డుకునేందుకు యత్నించిన మహిళలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని లేని పక్షంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కఠారి శంకర్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు ఓబుల్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంటా రామానాయుడు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు దేవరపల్లి అంజిరెడ్డి, జానీ, నాయకులు చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి, మీరావలి తదితరులు పాల్గొన్నారు. -
అడుగడుగునా అవమానిస్తున్నారు
ఒంగోలు టూటౌన్: అధికార పార్టీలో తనకు జరుగుతున్న అవమానంపై ఒంగోలు ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు ఒక్కసారిగా తన అసంతృప్తిని వెళ్లగక్కారు. పలుమార్లు అవమానానికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలు ఏఎంసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీలోని సమావేశ మందిరంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరి దామచర్ల జనార్దన్ గెలుపునకు కృషి చేశానన్నారు. అందుకు తనకు మిగిలింది అవమానాలేనని చెప్పుకొచ్చారు. ఏఎంసీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారానికి నోచుకోలేకపోయానన్నారు. రోడ్డు విస్తరణలో ముస్లిం, మైనార్టీల దుకాణాలు తొలగించినా టీడీపీకి, ఎమ్మెల్యేకు మద్దతు తెలిపానన్నారు. నాడు మంత్రి హోదాలో వెంకయ్యనాయుడు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే ప్రొటోకాల్‌లో తన పేరు లేదంటూ అధికారులు లోనికి వెళ్లనీయలేదని, తనకంటే తక్కువ క్యాడర్ ఉన్నవాళ్లు చాలా మంది ఎమ్మెల్యే ఇంట్లో ఉన్నారన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డు పదవిని ఎవరికైనా ఇవ్వాలని ఎమ్మెల్యేకు సూచించినట్లు తెలిపారు. అయితే ఇటీవల పార్టీ పదవులు ఊరికే రావని.. పార్టీ కోసం పని చేయాలని ఎమ్మెల్యే పేర్కొనడం బాధించిందన్నారు. పుట్టిన రోజు వేడుకకు ఒక రోజు ముందు ఎమ్మెల్యే ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒంగోలు ఏఎంసీ చైర్మన్‌ను మారుస్తున్నట్లు ప్రకటించి బాధపెట్టాడని వాపోయారు. ఆయన అలా ఎందుకు చేశారో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. పార్టీపై, పార్టీ నాయకుడిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూనే.. రానున్న ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యే టిక్కెట్ ఎవరికిస్తే వారి గెలుపునకు కృషి చేస్తానని, పార్టీ వీడనని చెప్పడం చర్చనీయాంశమైంది. -
హత్యకేసులో ఆరుగురు నిందితుల అరెస్ట్
బుట్టాయిగూడెం మండలం మర్లగూడెం అడవుల్లో ఈ నెల 16న(శనివారం) జరిగిన హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకట్రావు తెలిపిన వివరాలు..బుట్టాయిగూడేనికి చెందిన పట్నం సింగరాజు అలియాస్ టైలర్ రాజు ఈ నెల 16న మరో ఆరుగురితో కలిసి మర్లగూడెం అడవుల్లో మద్యం సేవించారు. ఆ సమయంలో తలెత్తిన చిన్నపాటి ఘర్షణ టైలర్ రాజు హత్యకు దారితీసింది. రాజుతో పాటు మద్యం సేవించిన వారు కర్రతో కొట్టి రాజును హత్య చేశారు. అనంతరం తలను వేరు చేసి మర్లగూడెం అడవుల్లో పాతిపెట్టారు. మొండెంను జంగారెడ్డిగూడెం రజిక చెరువులో పడేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి మంగళవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. అరెస్టయిన వారిలో సుంకర పవన్ కుమార్, ముక్క శ్రీను, అంబటి,అజయ్, షేక్ బాషా,తగరం అజయ్‌కుమార్, ఉసిరిక బాలాజీలు ఉన్నారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు.