
విలేకర్లతో మాట్లాడుతున్న ఒంగోలు ఏఎంసీ చైర్మన్ రాంబాబు
ఒంగోలు టూటౌన్: అధికార పార్టీలో తనకు జరుగుతున్న అవమానంపై ఒంగోలు ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు ఒక్కసారిగా తన అసంతృప్తిని వెళ్లగక్కారు. పలుమార్లు అవమానానికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలు ఏఎంసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీలోని సమావేశ మందిరంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరి దామచర్ల జనార్దన్ గెలుపునకు కృషి చేశానన్నారు. అందుకు తనకు మిగిలింది అవమానాలేనని చెప్పుకొచ్చారు. ఏఎంసీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారానికి నోచుకోలేకపోయానన్నారు. రోడ్డు విస్తరణలో ముస్లిం, మైనార్టీల దుకాణాలు తొలగించినా టీడీపీకి, ఎమ్మెల్యేకు మద్దతు తెలిపానన్నారు.
నాడు మంత్రి హోదాలో వెంకయ్యనాయుడు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే ప్రొటోకాల్‌లో తన పేరు లేదంటూ అధికారులు లోనికి వెళ్లనీయలేదని, తనకంటే తక్కువ క్యాడర్ ఉన్నవాళ్లు చాలా మంది ఎమ్మెల్యే ఇంట్లో ఉన్నారన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డు పదవిని ఎవరికైనా ఇవ్వాలని ఎమ్మెల్యేకు సూచించినట్లు తెలిపారు. అయితే ఇటీవల పార్టీ పదవులు ఊరికే రావని.. పార్టీ కోసం పని చేయాలని ఎమ్మెల్యే పేర్కొనడం బాధించిందన్నారు. పుట్టిన రోజు వేడుకకు ఒక రోజు ముందు ఎమ్మెల్యే ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒంగోలు ఏఎంసీ చైర్మన్‌ను మారుస్తున్నట్లు ప్రకటించి బాధపెట్టాడని వాపోయారు. ఆయన అలా ఎందుకు చేశారో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. పార్టీపై, పార్టీ నాయకుడిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూనే.. రానున్న ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యే టిక్కెట్ ఎవరికిస్తే వారి గెలుపునకు కృషి చేస్తానని, పార్టీ వీడనని చెప్పడం చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment