మాట్లాడే భాష వినబుద్ధి అవదు. మాట్లాడలేని భాషను వదలబుద్ధి కాదు. భాషల్లోని వైరుధ్యమా లేక ఇది మనుషుల్లోని వైపరీత్యమా!
పార్లమెంటు ప్రాంగణంలో తటాలున కొందరు ఎదురుపడి ‘నమస్కారమండీ వెంకయ్యనాయుడు గారూ.. బాగున్నారా’ అని పలకరిస్తుంటారు. మందంగా నవ్వుతాను. ‘బాగున్నాను’ అని చెప్పడం అది. దేవుడు మనిషికి మందస్మితం పెట్టడం మంచిదైంది. మాట్లాడే ఓపిక లేనపుడు, మాట్లాడే ఆసక్తి లేనప్పుడు యూజ్‌ఫుల్‌గా ఉంటుంది.
‘హాయ్.. వెంకీ, హవ్యూ’ అని వెళ్లిపోతుంటారు కొందరు. అది నాకు సుఖంగా, సౌఖ్యంగా ఉంటుంది. పొడవాటి కుశలపు పలకరింపు షార్ట్ కట్‌లోకి అనువాదం అవడం వల్ల లభ్యమైన సుఖసౌఖ్యాలు కావచ్చవి. లేదా, నేను బదులు చెప్పే భారాన్ని వాళ్లు నాపై పెట్టి నేను ఆ బరువును వాళ్ల కళ్లెదుటే దించుకునే వరకు అక్కడే ఎదురుచూడకుండా వాళ్ల మానాన వాళ్లు వెళ్లిపోవడం వల్ల కావచ్చు.
రాని భాష రాహుల్‌గాంధీని కూడా మంచి వక్తను చేస్తుంది! టీవీ మ్యూట్‌లో ఉండగా చూశాను. మలప్పురంలో ఏదో మాట్లాడుతున్నాడు. ఇక్కడ పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే అక్కడ కేరళలో ఏం పని! రాహుల్ ఒక్కో మాటకు జనం హర్షధ్వానాలు చేస్తున్నారు! అంతగా ఏం మాట్లాడుతున్నాడా అని మ్యూట్‌ని తీసి చూశాను. రాహుల్ వేదికను అలంకరించి ఇంగ్లిష్‌లో మాట్లాడుతుంటే పక్కనే ఒక విద్యార్థిని నిలబడి ట్రాన్స్‌లేట్ చేసి చెప్తోంది. ‘నౌ’ అని రాహుల్ అంటే.. ‘ఇప్పో’ అని ఆ అమ్మాయి, ‘ఫస్ట్ ఆఫ్ ఆల్’ అని రాహుల్ అంటే.. ‘ఒన్నామటై’ అని ఆ అమ్మాయి. ఏదో స్కూల్ కార్యక్రమం. చీఫ్‌గెస్ట్‌గా వెళ్లినట్లున్నాడు. అ అమ్మాయి కారణంగా ఇంగ్లిష్ వినసొంపుగా మలయాళంలోకి తర్జుమా అయి అక్కడ ఉన్నవాళ్లందరి చేతా చప్పట్లు కొట్టిస్తోంది.
శుక్రవారం రాజ్యసభలో సరోజినీ హేంబ్రమ్ తన సొంత సంతాలీ భాషలో మాట్లాడినప్పుడు కూడా.. ఆ స్కూల్ అమ్మాయి మలయాళం మాట్లాడుతున్నట్లే ఉంది వినబుద్ధయ్యేలా. సభలో అంతా చప్పట్లు. రాజ్యసభలో మునుపెవరూ వినని భాష! రఘునాథ్ ముర్ము అనే ఆయన ఆ భాషకు లిపిని కనిపెట్టారని, ఆయనకు భారతరత్న ఇవ్వాలని సరోజినీ హేంబ్రమ్ డిమాండ్. జేఎన్‌యూలో పీహెచ్‌డీ చేస్తున్న అమ్మాయిని రాజ్యసభలో రెడీగా కూర్చోబెట్టి సంతాలీని అక్కడికక్కడ హిందీలోకి ట్రాన్స్‌లేట్ చేయించుకుంటే ఇవన్నీ తెలిశాయి.
‘‘ప్రతి సమావేశంలోనూ ఇవన్నీ చెప్పడానికి ట్రైచేస్తున్నాను నాయుడూజీ’’ అన్నారు సరోజిని.. జీరో అవర్ ముగిశాక.
‘‘అవును ఒకసారి సభ ఎడ్జార్న్ అయింది. ఒకసారి డిస్కషన్‌కి టైమ్ తక్కువైంది కదా’’ అన్నాను.
‘‘ఈ సమావేశాలు కాదు నాయుడూజీ. నేను రాజ్యసభ సభ్యురాలిని అయినప్పటి నుంచీ ట్రై చేస్తున్నాను. ఇంకో ఏడాదికి నా టెర్మ్ అయిపోతుంది. నా భాషలో నేనిక ఎప్పటికీ మాట్లాడలేనేమో అనుకున్నాను. మీరు మాట్లాడనిచ్చారు’’ అన్నారు సరోజిని నాకు ధన్యవాదాలు తెలుపుతూ.
‘‘నేను మాట్లాడనిచ్చేదేముందీ సరోజినీజీ. మీ భాషను మీరు మాట్లాడకుండా మిమ్మల్ని ఎవరు ఆపగలరు.. రాజ్యసభలోనైనా, లోక్‌సభలోనైనా, ఒరిస్సాలోనైనా, ఓవర్సీస్‌లోనైనా..’’ అన్నాను.
‘‘మాట్లాడేవాళ్లు లేకపోతే కాదు నాయుడూజీ, వినేవాళ్లు లేకపోతే ఏ భాషైనా చచ్చిపోతుంది’’ అన్నారు సరోజినీ.
కరెక్ట్ అనిపించింది.
‘‘బాగా చెప్పారు అనే మాటను మీ సంతాలీ భాషలో ఏమంటారు సరోజినీజీ’’ అని అడిగాను.
- మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment