నారా చంద్రబాబు (టీడీపీ) రాయని డైరీ | Chandrababu Naidu Rayani Diary By Madhav Singaraju | Sakshi
Sakshi News home page

నారా చంద్రబాబు (టీడీపీ) రాయని డైరీ

Published Sun, Apr 14 2019 4:21 AM | Last Updated on Sun, Apr 14 2019 4:21 AM

Chandrababu Naidu Rayani Diary By Madhav Singaraju - Sakshi

ఫలితాలకు పెద్దగా టైమ్‌ లేదు. ఇంకో నలభై రోజులే! ఈలోపే ఏదైనా చెయ్యాలి. 
ఎన్నికలకు ముందరి ముప్ఫై రోజుల టైమ్‌ చాలా సుదీర్ఘమైనదిగా అనిపించి, ఫలితాల కోసం ఎదురు చూస్తున్న ఈ నలభై రోజుల టైమ్‌ చాలా షార్ట్‌గా అనిపిస్తోందంటే.. ప్రజాస్వామ్యం ఎక్కడో గాడి తప్పిందనే! 
ప్రజాస్వామ్యాన్ని ఒక ట్రాక్‌లో పెట్టి నడిపించే నాలాంటి విలువలున్న మనిషికి ఈ గాడి తప్పడం ఎంతటి బాధను కలిగించే విషయమో.. కేంద్ర ఎన్నికల సంఘానికి హిందీలో తర్జుమా చేసి చెప్పిస్తే మాత్రం అర్థమౌతుందా?  

బాధను షేర్‌ చేసుకోడానికి దగ్గరలో ఎవరూ లేరు. బాలకృష్ణ ఉన్నాడు కానీ, ‘ప్రజాస్వామ్యం అంటే ఏంటి బావగారూ’ అని అడిగితే, వివరంగా చెప్పే టైమ్‌ నాకు ఉండకపోవచ్చు. అడిగినప్పుడు చెప్పకపోతే అత డెలా రియాక్ట్‌ అవుతాడో ఎంతటివాడైనా ఊహించగలిగిన విషయం కాదు. అడ క్కుండా చెప్పినందుకే సొంత అభిమానిని తరుముకున్నవాడు.. అడిగినా చెప్పనందుకు సొంత బావ అయితే మాత్రం వదిలి పెడతాడా?!

పోలింగ్‌కి ముందు రోజు లోకేశ్‌ ఏదో వీడియో చూసి నవ్వుకుంటుంటే ఏంటని అడిగాను. నాకు ఫార్వర్డ్‌ చేశాడు. బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలోని చిన్న క్లిప్‌ అది. ఆయన వీరాభిమాని ఎవరో.. ‘సార్‌.. యాభై వేల మెజార్టీ గ్యారంటీ’ అంటున్నాడు. ‘యాభై వేల మెజార్జీ రాకపోతే నీ ఇంటికొస్తా.. నీ నట్టింటి కొస్తా’ అని వాడి వెంట పడుతున్నాడు! పోలింగ్‌ రోజు మిడ్‌నైట్‌ టెలికాన్ఫరెన్స్‌కి బాలకృష్ణను పిలవకపోవడం మంచిదైంది. నూటా ముప్ఫై సీట్లు మనవే అన్నాను టెలికాన్ఫరెన్స్‌లో. ఆ మాటను పట్టుకుని నా ఇంటికీ, నా నట్టింటికీ వచ్చేస్తాననేవాడు..  నూటా ముప్ఫై సీట్లు రాకపోతే! సీట్లు రాకపోయాక ఆయన వచ్చేమిటì , రాకపోతే ఏమిటి?! ఆ ఆలోచన రాదు బాలకృష్ణకు. ఊరికే వచ్చేస్తానంటాడు. 

బాధను షేర్‌ చేసుకోడానికి లోకేష్‌ అందుబాటులో ఉన్నాడు కానీ, ఎవరైనా బాధను షేర్‌ చేసుకుంటున్నప్పుడు లోకేష్‌ నవ్వు ఆపుకోలేడు. ప్రజాస్వామ్యం గాడి తప్పిందంటే ఇంకా పెద్దగా నవ్వేస్తాడు.. ‘అలాగా నాన్నగారూ..’ అని. లోకేష్‌లో ఇదొక మంచి విషయం.. చెప్పింది వింటాడు. విని నవ్వుతాడు. ప్రజాస్వామ్యం ఎందుకు గాడి తప్పింది, ఎక్కడ తప్పింది, ఎప్పుడు తప్పింది, ఎలా తప్పింది అని ప్రశ్నలు వేయడు.  ప్రశ్నలు అడగని వాళ్లతో బాధను షేర్‌ చేసుకుని ఉపశమనమేం పొందుతాం?! అయినా నాకిప్పుడు కావలసింది ఉపశమనం కాదు. ఉపాయం. ఈ నలభై రోజుల్లో ఏదైనా చెయ్యాలి. ఏం చెయ్యాలి?!

స్టార్‌ క్యాంపెయినర్‌లు వచ్చి చుట్టూ కూర్చున్నారు. ఏం చేయాలన్నదానిపై ఎవరూ సలహాలు ఇవ్వడం లేదు కానీ ఏదైనా చేస్తే బాగుంటుందని మాత్రం సలహా ఇస్తున్నారు.
‘‘ఆలోచించండి. మనం ఏదైనా చెయ్య గలమా? మీలో రాజ్యాంగం తెలిసినవారు, న్యాయశాస్త్రాన్ని అభ్యసించినవారు ఉన్నారు కదా’’ అన్నాను.

‘‘ఏదైనా చెయ్యడానికి రాజ్యాంగంతో, న్యాయశాస్త్రంతో పనేముంది నాయుడుగారూ. అయినా ఈవీఎంలు స్ట్రాంగ్‌ రూముల్లో ఉన్నాయి. మనమేమీ చెయ్యలేం. పోలీసులు ఉంటారు. పారామిలటరీ వాళ్లు ఉంటారు. సీసీ కెమెరాలు ఉంటాయి. యాభై డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే కానీ, ఈవీఎంల లోపలి డేటా పాడు కాదు. అంత ఉష్ణోగ్రత మే నెలలో కూడా ఉండదు’’ అన్నారు.
వాళ్లకు అంతే అర్థం కావడం నాకు బాధను కలిగించింది. నేను మాట్లాడుతున్నది ప్రజాస్వామ్యాన్ని గాడిలో పెట్టడం గురించి. వాళ్లు అర్థం చేసుకుంటున్నది ఈవీఎంలను గాడి తప్పించడం గురించి! 
ఎవరైనా ఊరికే ఓడిపోతారా?!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement