రాయని డైరీ : రతన్‌ టాటా (గౌరవ చైర్మన్‌) | Madhav Singaraju Rayani Dairy On Ratan Tata | Sakshi
Sakshi News home page

రాయని డైరీ : రతన్‌ టాటా (గౌరవ చైర్మన్‌)

Published Sun, Jan 5 2020 12:28 AM | Last Updated on Sun, Jan 5 2020 12:28 AM

Madhav Singaraju Rayani Dairy On Ratan Tata - Sakshi

కుర్చీకి తగని వ్యక్తిని తెచ్చిపెట్టుకుంటే కుర్చీ ఎంత చిన్నదైనా అది ఆ వ్యక్తికి పెద్దదే అవుతుంది. టాటా కంపెనీలో అసలు చిన్న కుర్చీలే ఉండవు. కుర్చీ ఎత్తుకు ఎదగాలని రోజూ ఆ కుర్చీలో కూర్చుని లేచే వాళ్లకు అనిపించాలి. అప్పుడే వాళ్లూ ఎదుగుతారు. కంపెనీ ఎదుగుతుంది. 

సైరస్‌ మిస్త్రీ అలా అనుకోలేదు! చైర్మన్‌గా కుర్చీలో కూర్చున్న రోజే.. ‘కుర్చీ నాకు చిన్నదైపోయింది రతన్‌జీ..’ అని నా క్యాబిన్‌కి వచ్చి కంప్లయింట్‌ చేశాడు! కంప్లయింట్‌ చేస్తూ.. నేను కూర్చొని ఉన్న కుర్చీ వైపు చూశాడు. 

‘నీ కుర్చీ నీకు చిన్నదైందని నువ్వు అనుకున్నా, నా కుర్చీ నీకేమీ పెద్దదవదు మిస్త్రీ.. ఏం చేద్దాం?’’ అన్నాను. 
‘కూర్చోడానికి కుర్చీ సరిపోనప్పుడు, కనీసం కాళ్లు చాపుకుని కూర్చోడానికి కాళ్ల దగ్గర ఇంకో కుర్చీ వేసుకునే ఏర్పాటైనా ఉండాలి రతన్‌జీ. అయితే నేను కాళ్లు చాపుకుని కూర్చోవాలని అనుకుంటున్న వైపు మీ క్యాబిన్‌ ఉంది. అది మీకు గౌరవం కాదు. పైగా టాటా కంపెనీలో నేను గౌరవించే ఏకైక వ్యక్తి మీరు’ అన్నాడు!
మిస్త్రీ ఏమంటున్నాడో అర్థమైంది. నన్నిక ఆఫీస్‌కి రావద్దంటున్నాడు! పాత చైర్మన్‌ కళ్లముందే కనిపిస్తుంటే.. కొత్త చైర్మన్‌ని ఆఫీస్‌లో ఎవరు చూస్తారు అని హెచ్‌ఆర్‌ మేనేజర్‌ రాజన్‌తో అన్నాడని కూడా తెలిసింది.  

‘‘నేను గౌరవం ఇచ్చే మనిషినే కానీ, తిరిగి గౌరవం కోరుకునే మనిషిని కాదు మిస్త్రీ. మీరు మీ కాళ్లను ఎటువైపు పెట్టుకునైనా కూర్చోడానికి ఒక కుర్చీని తెప్పించుకునే ఏర్పాట్లను మీరు నిరభ్యంతరంగా చేయించుకోవచ్చు’ అని చెప్పాను. 
అతడు వెళ్లిపోయిన కొద్ది సేపటికి హెచ్‌ ఆర్‌ మేనేజర్‌ నా క్యాబిన్‌లోకి వచ్చారు.

‘కూర్చోండి రాజన్‌’ అన్నాను. 
‘మిమ్మల్నో విషయం అడగడానికి వచ్చాను రతన్‌జీ. ఆ విషయాన్ని నేను నిలబడి కూడా అడగ్గలను’ అన్నాడు. 
‘అడగండి రాజన్‌జీ’ అన్నాను.

‘రతన్‌జీ.. సెక్షన్‌ హెడ్‌లంతా కొత్తగా కనిపిస్తున్నారు. వాళ్లెవరూ నేను రిక్రూట్‌ చేసినవాళ్లు కాదు. రోజూ మధ్యాహ్నం క్యాంటీన్‌లో కూడా వాళ్లు కనిపిస్తున్నారు. ‘ఎక్స్‌క్యూజ్‌ మీ.. మీరెవరో నేను తెలుసుకోవచ్చా?’ అని వాళ్లలో ఒక వ్యక్తి దగ్గరకు వెళ్లి ఫ్రెండ్లీగా అడిగాను. ‘మిస్త్రీ ఎవరో మీకు తెలుసా?’ అని ఆ వ్యక్తీ నన్ను ఫ్రెండ్లీగా అడిగాడు’ అన్నారు రాజన్‌.
‘అవునా!’ అన్నాను. 

‘వాళ్లెవరో నాకు మాత్రమే తెలియదా, మీక్కూడా తెలియదా అని అడగడానికే మీ దగ్గరికి వచ్చాను రతన్‌జీ’ అన్నాడు. 
‘ఇద్దరికీ తెలియదంటే.. మిస్త్రీకి తెలిసే ఉంటుంది’ అని నవ్వాను.
వెళ్లిపోయాడు. వెళ్లిన కొద్ది సేపటికే మళ్లీ వచ్చాడు!

‘ఏంటి రాజన్‌!’ అన్నాను. 
‘నా కుర్చీలో పద్మనాభన్‌ అనే వ్యక్తి కూర్చొని ఉన్నాడు రతన్‌జీ. ‘ఎవరు మీరు?’ అని నేను అడిగేలోపే, ‘అడక్కుండా లోపలికి వచ్చేయడమేనా! ఇదేమైనా రతన్‌ టాటా క్యాబిన్‌ అనుకున్నావా? హెచ్‌ ఆర్‌ మేనేజర్‌ క్యాబిన్‌..’ అని, బెల్‌ కొట్టి నన్ను బయటికి పంపించాడు’ అని చెప్పాడు రాజన్‌!

నాలుగేళ్లు కుర్చీలో ఉన్నాడు మిస్త్రీ. ఆ నాలుగేళ్లూ టాటా కంపెనీ అతడి కాళ్ల కింది కుర్చీలానే ఉండిపోయింది. ‘రతన్‌జీ.. అతడిని చైర్మన్‌ని చేసి మీరు పెద్ద తప్పు చేశారు’ అన్నారు కంపెనీ స్టాఫ్‌. అలా అన్న రోజే మిస్త్రీని బయటికి çపంపించాను. ‘పంపడం కుదరదు’ అని కంపెనీ ‘లా’ నుంచి ఆర్డర్స్‌ తెచ్చుకున్నాడు మిస్త్రీ. 

కుర్చీ కన్నా చిన్నవాళ్లే కుర్చీ కోసం పోరాటాలు చేయగలరు. మిస్త్రీ మూడేళ్లు పోరాడాడు. కుర్చీ గౌరవం కాపాడేందుకు టాటా మాత్రం పోరాడకుండా ఉంటుందా? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement