దేశ పౌరులు రాత్రి పూట హాయిగా నిద్రపోతున్నారంటే దేశ ప్రధాని మెలకువగా ఉన్నట్టు. దేశ పౌరులంతా నిద్రకు తూలుతూ కూడా నిద్రను ఆపుకుంటూ కూర్చుంటున్నారంటే దేశ ప్రధాని పగటి పూట కూడా నిద్రపోతున్నట్టు.
మోదీకి నిద్రెలా పడుతోందో కొద్ది రోజులుగా నాకు అంతుచిక్కడం లేదు. ఇంకొక అంతుచిక్కని ప్రశ్న కూడా ఈ వయసులో నన్ను అమితంగా వేధిస్తోంది. మోదీ ఛాతీని ఎవరు కొలిచి ఉంటారు! ఆయనకై ఆయనే కొలుచుకుని తన ఛాతీ యాభై ఆరు అంగుళాలు ఉందని తెలుసుకుని ఉంటారా, లేక అమిత్‌షా ఆయన దగ్గరికి వచ్చి, ఛాతీ చుట్టూ టేప్ పెట్టి కొలిచి, ‘అరవైకి కేవలం కొన్ని అంగుళాలే తక్కువ మోదీజీ’ అని గొప్ప పరవశంతో చెప్పి ఉంటారా?
అరవై కన్నా తక్కువ అనడంలో తనని తను తగ్గించుకుని ఎక్కువ చేసుకోవడం ఉంటుంది. ఎక్కువా తక్కువా కాకుండా కచ్చితంగా ఒక మెజర్‌మెంట్.. యాభై అయిదనో, యాభై ఆరు అనో చెప్పడంలో.. తన ఛాతీ ఇంకా పెరిగేందుకు స్కోప్ ఉందనే హెచ్చరికను పంపడానికి అవకాశం ఉంటుంది.
మోదీ ఛాతీ ఏ క్షణానైనా మరికొన్ని అంగుళాలు పెరిగే ప్రమాదం ఉందంటే ప్రతిపక్షాలకు ఉండే భయం వేరు, మోదీ ఛాతీ మరికొన్ని అంగుళాలు పెరగడానికి ఇంకా సమయం ఉందని ప్రతిపక్షాలు అనుకుంటే వారికి వచ్చే ధైర్యం వేరు అని మోదీ తనకు తాను అనుకుని ఉండాలి. ప్రతిపక్షాలను నిరంతరం భయ కంపనంలో ఉంచదలచుకుని.. ‘నా ఛాతీ అరవైకి నాలుగు అంగుళాలే తక్కువ’ అని కాకుండా, ‘నా ఛాతీ యాభై ఆరు అంగుళాల వద్ద కేంద్రీకృతమై ఉంది’ అని ఆయన చెప్పదలచుకున్నారని నాకు అర్థమౌతోంది.
పెరగవలసిన సమయంలో ఒక్క అంగుళమైనా పెరగకుండా ఛాతీ యాభై ఆరుంటేనేం, అరవై ఆరుంటేనేం? కశ్మీర్‌లో నలభై మంది జవాన్లు చనిపోయినా కూడా మోదీ ఛాతీ యాభై ఆరు దగ్గరే ఉండిపోయింది! ప్రతిపక్షాలకు చూపించుకోడానికేనా ఆ ఛాతీ! పాకిస్తాన్‌కి చూపించడానికి కాదా!
సౌదీ నుంచి క్రౌన్ ప్రిన్స్ వచ్చారు. ‘టెర్రర్ ఎటాక్ తర్వాత ఎలా ఉన్నారు?’ అని ఆయన అడగలేదు. ‘టెర్రర్ ఎటాక్ తర్వాత ఎలా ఉంటాం?’ అని ఈయనా అనలేదు. ప్రిన్స్ గారిని రాష్ట్రపతి భవన్‌కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్ హౌస్‌కి వెంటబెట్టుకొచ్చారు. ‘వియ్ ఆర్ ఫ్రెండ్స్’ అన్నారు ప్రిన్స్‌గారు. ‘అవునవును వియ్ ఆర్ ఓల్డ్ ఫ్రెండ్స్’ అన్నారు పీఎం గారు. ‘ఎస్.. ఎస్.. సెంచరీస్ ఓల్డ్ ఫ్రెండ్‌షిప్’ అన్నారు ప్రిన్స్‌గారు.
‘మీ కంట్రీ మా కంట్రీ ఒకేలా ఉంటాయి. మీ కల్చర్, మా కల్చర్ ఒకేలా ఉంటాయి. కొన్నాళ్ల క్రితం మేం మీ దేశానికి వచ్చాం. ఇన్నాళ్లకు మీరు మా దేశానికి వచ్చారు’ అన్నారు పీఎం గారు.
జాయింట్ స్టేట్‌మెంట్ రాసుకున్నారు. స్టేట్‌మెంట్‌లో ఉగ్రవాదం అనే మాట ఉంది. ఇండియా–పాకిస్తాన్ కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి అనే వాక్యం ఉంది. పుల్వామా అనే మాట లేదు. జైషే అనే పేరు లేదు!
ఇండియా, పాకిస్తాన్ కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని ప్రిన్స్‌గారు, పీఎం గారు సంతకాలు పెట్టారు కానీ.. ఇండియా, పాకిస్తాన్ ఎందుకు కలిసి కూర్చొని మాట్లాడుకోవాలో స్టేట్‌మెంట్‌లో రాసుకోలేదు!
ఇండియాలోని ఉగ్రవాదులు పాకిస్తాన్ మీద టెర్రర్ ఎటాక్ చేయకుండా ఇండియా పాకిస్తాన్ కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని సౌదీ ప్రిన్స్ వచ్చి మోదీకి చెప్పి వెళ్లినట్లు ప్రచారం చెయ్యడానికి చైనా లాంటి దేశాలకు ఆ స్టేట్‌మెంట్ కాపీ ఒకటి చాలదా!
Comments
Please login to add a commentAdd a comment