అరుణ్ జైట్లీ (కేంద్ర మంత్రి) రాయని డైరీ
మోదీజీ రిలాక్స్‌డ్‌గా ఉన్నారు. మధ్య మధ్యలో మా వైపు చూస్తున్నారు. చూస్తున్నారే కానీ మాట్లాడ్డం లేదు. అది ఆయన స్టైలు. ఆ స్టైలు.. చూడ్డానికి బాగుంటుంది. భరించడానికి కష్టంగా ఉంటుంది.
నేను, వెంకయ్య నాయుడు, రాజ్‌నాథ్ సింగ్, అమిత్‌షా.. నలుగురం మోదీజీ నివాస గృహంలో కూర్చొని ఉన్నాం. మోదీజీలానే నేనూ రిలాక్స్‌డ్‌గానే ఉన్నాను కానీ, రిలాక్స్ అవుతున్నట్లు మోదీజీకి కనిపించడం ఆయన మనోభావాలకు భంగం కలిగించవచ్చుననే అనుమానంతో కాళ్లు దగ్గరగా పెట్టుకుని కూర్చున్నాను.
మిగతా ముగ్గురు కూడా రిలాక్స్‌డ్‌గానే ఉన్నారు కానీ ఆ రిలాక్సేషన్‌ని ఎలా దాచాలో తెలియక చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. నాకున్నట్లే వాళ్లలోనూ మోదీజీ మనోభావాల పట్ల గౌరవ భావనలు ఉండడంలో తప్పేముంది? మొదట మనుషులం. ఆ తర్వాతే కదా ఒక పార్టీవాళ్లం.
వెంకయ్య నాయుడు ఒక్కరే మాలో కాస్త డిఫరెంట్. మొదట ఆయన పార్టీ మనిషి. ఆ తర్వాతే మనిషి.
‘‘ప్రజలకు ఏమైనా చేయాలని ఉంది అరుణ్’’ అన్నారు మోదీజీ సడెన్‌గా! అదిరిపడ్డాను.
‘‘నిన్న రాత్రే కదా మోదీజీ.. చేశాం’’ అన్నాను. జి.ఎస్.టి. నొప్పులు నాకింకా తగ్గలేదు.
మోదీజీ ఊ.. అనలేదు. ఆ.. అనలేదు. ‘అలాగా’ అన్నట్లు నా ముఖంలోకి చూశారు!
‘అప్పుడే రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిపోయావా అరుణ్’ అని అడిగినట్లుగా అనిపించింది నాకు.. మోదీజీ నన్ను అలా చూడగానే!
ఏక వచనంలో అరుణ్ అనడం, బహు వచనంలో జైట్లీ అనడం మోదీజీ అలవాటు. ఆయన ఏ వచనంలోనూ అనకపోయినా ఆయన చూపును బట్టి ఏక వచనాన్నో, బహు వచనాన్నో నాకు నేను అప్లై చేసుకోవడం అలవాటైపోయింది నాకు.
వెంకయ్య నాయుడు మధ్యలోకి వచ్చేశాడు.
‘‘ప్రజలకు ఏమైనా చేయాలి అని మోదీజీ అంటుంటే.. ప్రజలకు ఆల్రెడీ చేశామని అనుకుం టున్న దాని గురించి మీరు మాట్లాడుతున్నారు జైట్లీజీ’’ అన్నారు.
ఆయన ఏం మాట్లాడారో అర్థం కాలేదు!
‘‘జి.ఎస్.టి. గురించే కదా జైట్లీజీ మీరు అంటున్నది. కానీ అది ప్రజలకు చెయ్యడం కాదు. ప్రజలే మనకు చెయ్యడం’’ అన్నాడు వెంకయ్య నాయుడు.
నాయుడి వైపు మెచ్చుకోలుగా చూసి, ‘‘ప్రజల కోసం మనం ఏదైనా చేయాలి అరుణ్’’ అంటూ మళ్లీ నావైపు తిరిగారు మోదీజీ.
నోట్ల రద్దు అయిపోయింది. జి.ఎస్.టి. అయిపోయింది. ఇంకా నా చేత ఏం చేయించాలని ఆయన అనుకుంటున్నట్లు?!
‘‘అరుణ్.. నువ్విప్పుడు డిఫెన్స్ మినిస్టర్‌వి కూడా కదా’’ అన్నారు మోదీజీ!
అర్థమైంది! ప్రజల కోసం మోదీజీ ఈసారి నాకు చేతకాని పనేదో చేయించబోతున్నారు!!
మాధవ్ శింగరాజు