
ప్రధాని అవడం ఏముంది! ఎవరైనా అవొచ్చు. వాజ్‌పేయి అంతటి మనిషి ప్రధాని అయ్యారని చెప్పి... ఆయనపై గౌరవంతో మోదీజీ ఏమైనా ప్రధాని కాకుండా ఆగిపోయారా? మోదీజీ వంటి ఒక వ్యక్తి భారతావనికి ప్రధానిగా ఉండేవార ని చరిత్ర పుస్తకాలలో ఉన్నా కూడా భావితరాల్లో ఎవరైనా ఆత్మగౌరవంతో ప్రధాని అవకుండా ఆగిపోతారా? ప్రధాని ఎవరైనా అవొచ్చు. ప్రధాని ‘అభ్యర్థి’ అవడమే... ప్రధాని అవడం కన్నా పెద్ద సంగతి. ప్రతి పార్టీలో వాజ్‌పేయిలు, మోదీజీలు ఉంటారు. ‘‘అభ్యర్థి ఎవరైతేనేం, అయ్యేది ప్రధానేగా..’’ అని వాజ్‌పేయిలు అంటారు. ‘‘ప్రధాని ఎవరైతేనేం, ప్రధానం అభ్యర్థేగా’’ అని మోదీజీలు అంటారు. ఇక ఏకాభిప్రాయం ఎలా కుదురుతుంది? ఐతే అందరూ వాజ్‌పేయిలు అవ్వాలి. లేదంటే అందరూ మోదీజీలు అవ్వాలి. అయ్యేపనేనా?!
ఒక పార్టీలోనే అందరూ వాజ్‌పేయిలు, లేదా అందరూ మోదీజీలు కాలేనప్పుడు నాలుగైదు పార్టీలు కలిసి తమలోంచి ఒక వాజ్‌పేయిని, లేదా ఒక మోదీజీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం అన్నది కేసీఆర్ పాట్నా వస్తేనో, కేజ్రీవాల్ గుజరాత్ వెళ్లొస్తేనో ఒకపూటలో జరిగిపోతుందా?! బిహార్‌లో ఒక మోదీజీ ఉన్నారు. సుశీల్ కుమార్ మోదీ ఆయన. బీజేపీలో పెద్ద మనిషి. పదకొండేళ్లు ఉప ముఖ్యమంత్రిగా నాతో ఉన్నారు. ఇప్పుడాయన రాజ్యసభ సభ్యులు. మంచి ఫ్రెండ్ నాకు. రామలక్ష్మణులు అనేవాళ్లు మమ్మల్ని. రామలక్ష్మణులు ఫ్రెండ్స్‌లా ఉన్నారేమో తెలీదు. మేము మాత్రం అన్నదమ్ముల్లా ఉండేవాళ్లం. వయసులో నేను సీనియర్. అనుభవంలో ఆయన సీనియర్. రాష్ట్రంలోని రెండు సభల్లో, కేంద్రంలోని రెండు సభల్లో సభ్యుడైన ఏకైక బిహార్ నేత ఆయన. అంతటి విజ్ఞుడు, అనుభవజ్ఞుడు ఏమంటారంటే... కేసీఆర్ పాట్నా వచ్చి నన్ను అవమానించి వెళ్లారట!! అది ఎలాంటి అవమానం అంటే.. ఆయన నన్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించకుండానే వెళ్లిపోయారట!!
బీజేపీలో కింది నుంచి పైదాకా అంతా మూర్తీభవించిన మోదీజీలే కనిపిస్తున్నారు! కేసీఆర్, నేను ఈ దేశానికి ప్రధానమంత్రి అవాలని ఎవరికి వాళ్లం పగటి కలలు కంటున్నామని సుశీల్ కుమార్ అంటున్నారు. అలాంటప్పుడు కేసీయార్ తన కలను పక్కన పెట్టి, పాట్నాలో నా కలను కనకపోవడం నాకు అవమానం ఎలా అవుతుంది? ‘‘నితీశ్‌జీ! మీరు పగటి కలలు కంటున్నారని సుశీల్‌జీ అంటున్నారు కానీ, నిజానికి అది సుశీల్‌జీ రేయింబవళ్లు కన్న కల. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ మెప్పు కోసం సుశీల్‌జీ మిమ్మల్ని ‘పీఎం మెటీరియల్’ అంటుండేవారు గుర్తుందా..’’ అన్నారు నీరజ్. జేడీ(యు) స్పోక్స్ పర్సన్ ఆయన. నవ్వాన్నేను. పక్కనే రాజీవ్ రంజన్‌సింగ్, ఉమేశ్ కుష్వాహ ఉన్నారు. ‘‘రాజీవ్‌జీ! నాకు తెలీకుండా మీరేమైనా నేను ప్రధాని అభ్యర్థినని సుశీల్‌జీతో అన్నారా?’’ అని అడిగాను. ‘‘లేదు నితీశ్‌జీ’’ అన్నారు రాజీవ్. పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ ఆయన.
‘‘ఉమేశ్‌జీ! మీరేమైనా నేను ప్రధాని అభ్యర్థినని సుశీల్‌జీతో అన్నారా?’’ అని అడిగాను. ‘‘లేదు నితీశ్‌జీ..’’ అన్నారు ఉమేశ్. పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ఆయన.
నేషనల్ లెవల్‌లో ఎవరూ అనకుండా, స్టేట్ లెవల్‌లోనూ ఎవరూ అనకుండా ప్రధాని అవ్వాలని నేను కలగంటున్నట్లు సుశీల్‌జీ అనుకున్నారంటే అది సుశీల్‌జీకో, మోదీజీకో వచ్చిన పీడకల అయి ఉండాలి. వాళ్లకు పీడకల అంటే అది దేశ ప్రజలకు పీడ విరగడయ్యే కల. ప్రధాని అవడం ఏముంది? ఎవరైనా అవొచ్చు. వాజ్‌పేయి వంటి ప్రధాని దగ్గర పనిచేసే భాగ్యమే అందరికీ దక్కదు. అది నాకు దక్కింది. ప్రధాని మోదీజీకి కూడా దక్కనిది నాకు దక్కింది. ప్రధాని అవడం కన్నా, ‘ప్రధాని’ అభ్యర్థి అవడం కన్నా కూడా పెద్ద సంగతి అది!
Comments
Please login to add a commentAdd a comment