సాక్షి, హైదరాబాద్: మహమ్మారి వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా మూడు లక్షలకు పైగా కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నా కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవడం లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏం చర్యలు తీసుకోవాలన్నా రాష్ట్రాల ఇష్టమేనని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో స్పష్టం చేశారు. దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంటే కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవడంలో వెనుకడుగు వేస్తోంది. ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించే అవకాశం ఉన్నా అలాంటి ప్రయత్నం చేయడం లేదని సర్వత్రా వినిపిస్తున్న మాట. కేంద్రం కఠిన నిర్ణయం తీసుకోవడానికి నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే అడ్డంకిగా ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకే మే 2వ తేదీ తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటుందని సర్వత్రా చర్చ సాగుతోంది.
వాస్తవానికి కరోనా సెకండ్ వేవ్ ప్రారంభంలోనే అప్రమత్తం కావాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానికంగా ఉన్న ఎన్నికలతో కరోనా కట్టడి చర్యలపై దృష్టి సారించలేదని స్పష్టంగా తెలుస్తోంది. తత్ఫలితం ఇంత పెద్ద స్థాయిలో కరోనా విస్ఫోటనం జరిగిందని విదేశీ మీడియా నొక్కి చెబుతోంది. కరోనా వ్యాప్తికి ఇటీవల జరిగిన ఎన్నికలే కారణమని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు అక్షరసత్యమని మేధావులు చెబుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో పార్టీలు, ప్రభుత్వాలు కరోనాను నిర్లక్ష్యం చేసిందని విమర్శలు చేస్తున్నారు. అందువలనే పెద్ద ఎత్తున కరోనా వ్యాపించిందని చెబుతున్నారు. ఆ క్రమంలోనే తెలంగాణలో ఏకంగా ముఖ్యమంత్రికి కరోనా సోకిందని గుర్తు చేస్తున్నారు. ఎన్నికల సభతోనే సీఎం కేసీఆర్‌కు కరోనా సోకిందని అందరికీ తెలిసిన రహాస్యమేనని పేర్కొంటున్నారు. ఇక పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరిల్లోనూ పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. దేశంలో తగ్గినట్టు తగ్గి ఒక్కసారిగా కేసులు పెరగడంతో అందరినీ ఆందోళనకు గురి చేస్తున్న అంశం.
ఇంత జరుగుతున్నా కేంద్రం ఇప్పుడు కూడా స్పష్టమైన చర్యలు తీసుకోకపోతే ఎలా అని ప్రతిపక్షాలతో పాటు మేధావులు ప్రశ్నిస్తున్నారు. కరోనా కట్టడి చర్యలపై కఠిన నిర్ణయం తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేయడానికి ఎందుకు జంకుతోందని నిలదీస్తున్నారు. అయితే ఎన్నికల ఫలితాల వెల్లడే కారణమని వారే సమాధానం చెబుతున్నారు. ఇంకా పశ్చిమబెంగాల్‌లో మరో దశ పోలింగ్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే అక్కడ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు పడతాయనే యోచనలో కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది.
కేంద్రం తీరుపై సుప్రీంకోర్టుతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా ఖాతరు చేయడం లేదని రాష్ట్రాలు మండిపడుతున్నాయి. అయితే ఎన్నికల ముగింపుతో పాటు ఫలితాలు మే 2వ తేదీన ఫలితాల వెల్లడి తర్వాతనే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని జాతీయ మీడియాతో పాటు విశ్లేషకులు చెబుతున్న మాట. ఇదే సమాచారంతో కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉన్నట్లు గుర్తు చేస్తున్నారు. మే 2వ తేదీన ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోందని పునరుద్ఘాటిస్తున్నారు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. మరి మే 2వ తేదీ తర్వాత ఏం జరుగుతుందో వేచి చూడాలి.
చదవండి:
‘బరాత్’లో పీపీఈ కిట్‌తో చిందేసిన అంబులెన్స్ డ్రైవర్
25 రోజుల్లో 23 లక్షల కరోనా టెస్టులు
Comments
Please login to add a commentAdd a comment