సాక్షి, హైదరాబాద్: గ్రామీణ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం చల్లని కబురు పంపింది. పంచాయతీరాజ్ సంస్థలకు మూడంచెల్లో నిధులు సర్దుబాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇన్నాళ్లూ 100 శాతం ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీలకే విడుదల చేసిన కేంద్ర సర్కారు.. ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధుల్లో కొంత మేర వాటాను మండల, జిల్లా పరిషత్‌లకు కూడా కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ స్థానిక సంస్థలకు వాటాల వారీగా నిర్దేశించుకోవాలని సూచించింది.
పంచాయతీలకు 70 నుంచి 85 శాతం, మండల పరిషత్‌లకు 10 నుంచి 25 శాతం, జిల్లా పరిషత్‌లకు 5 నుంచి 15 శాతం మధ్యన ఖరారు చేసుకునే వెసులుబాటు ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు గ్రామ పంచాయతీలకు 85%, మండల పరిషత్‌లకు 10%, జిల్లా పరిషత్‌లకు 5% నిష్పత్తిలో వాటా ఖరారు చేస్తూ ఉత్తర్వులు (జీవో నం.215) జారీ చేసింది. ఈ ఏడాది నుంచి మనుగడలోకి వచ్చే 15వ ఆర్థిక సంఘం జనాభా ప్రాతిపదికన మన రాష్ట్రంలోని పంచాయతీరాజ్ సంస్థలకు రూ.1,847 కోట్లు కేటాయించింది. దీంట్లో గ్రామ పంచాయతీలకు రూ.1,569.95 కోట్లు, మండల పరిషత్‌లకు రూ.184.7 కోట్లు, జిల్లా పరిషత్‌లకు రూ.92.35 కోట్ల నిధులు రానున్నాయి.
స్థానిక సంస్థలకు ఊరట..
గత ఆర్థిక సంవత్సరం వరకు అమల్లో ఉన్న 14వ ఆర్థిక సంఘం మొత్తం నిధులను నేరుగా పంచాయతీలకే బదలాయించేది. దీంతో ఇతర వనరుల్లేక, ఆర్థిక సంఘం నిధులు కూడా రాక అభివృద్ధి పనులు చేయలేక మండల, జిల్లా పరిషత్‌లు చతికిలపడ్డాయి. అయితే, తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ఈ సంస్థలకు ఊరటనిచ్చింది. 13వ ఆర్థిక సంఘం వరకు మూడంచెల వ్యవస్థలైన పంచాయతీ, మండల, జెడ్పీలకు నిర్దేశిత నిష్పత్తిలో నిధులను కేంద్రం విడుదల చేసింది. కేంద్రం లో మోదీ సర్కారు అధికారంలోకి రాగానే ఈ విధానానికి స్వస్తి పలికింది.
ఆర్థిక సంఘం నిధుల నుంచి మండల, జిల్లా పరిషత్‌లకు కోత విధించి మొత్తం నిధులను పంచాయతీలకే బదలాయించింది. కాగా, 15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదిక ఆధారంగా 2020–21 ఆర్థిక సంవత్స రానికి దేశంలోని 28 రాష్ట్రాలకు రూ.60,750 కోట్లు మంజూరు చేసిన కేంద్రం.. తెలంగాణకు రూ.1,847 కోట్లు నిర్దేశించింది. ఈ నిధులకు సమానంగా మ్యాచింగ్ గ్రాంటు రూపేణా రాష్ట్ర సర్కారు సర్దుబాటు చేయనుంది. 15వ ఆర్థిక సంఘం నిధుల్లో 50 శాతం (టైడ్ గ్రాంట్) నిధులను ప్రజల మౌలిక అవసరాలకు ఖర్చు చేయాలని, మిగతా నిధుల (బేసిక్ గ్రాంట్)ను శాశ్వత పనులకు వెచ్చించాలని స్పష్టం చేసింది. ఈ నిధులను రెండు విడతల్లో విడుదల చేయనున్నట్లు కేంద్రం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment