సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను విస్మరించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్ర బడ్జెట్‌లో విస్మరించడం తీవ్ర నిరాశపరిచిందని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం, మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల కోసం బడ్జెట్‌లో కనీసం ప్రస్తావించకపోవడం పట్ల ఒక ప్రకటనలో అసంతృప్తి వ్యక్తంచేశారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్నారు. కానీ, రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకపోవడం సమంజసం కాదని అన్నారు.
కరోనా పరిస్థితులు, పరిమిత వనరులు, రుణాలపై ఆంక్షలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నుంచి భారీగా నిధుల కేటాయింపు, రుణ సేకరణకు పరిమితులు పెంచి ఉంటే బాగుండేదని తెలిపారు. రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహద పడేదని అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం, ఎరువులు, ఆహార సబ్సిడీ తదితర వాటిలో రాష్ట్రాలకు కేంద్రం కోత విధించిందన్నారు. జలజీవన్ మిషన్, జాతీయ విద్యా మిషన్, జాతీయ ఆరోగ్య మిషన్ తదితర ప్రాజెక్టులకు నిధులు పెంచినప్పటికీ ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా అవి ఏమాత్రం చాలవన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్‌కు మరిన్ని నిధుల అవసరం ఉందన్నారు.
జాతీయ రహదారులకు నిధులు రెండింతలు చేయడం, రాష్ట్రాలకు ఆర్థిక సహాయం చేసేందుకు పెట్టుబడి నిధులను రూ.లక్ష కోట్లకు పెంచడం హర్షణీయమన్నారు. రోడ్లు, రైల్వేలు, ఎయిర్‌పోర్టులు, పోర్టులు, రవాణా, జలమార్గాలు, లాజిస్టిక్స్–మౌలిక సదుపాయాలు అనే ఏడు రంగాలను చోదక శక్తులు (గ్రోత్ ఇంజన్స్)గా చేసుకొని జాతీయ మాస్టర్ ప్లాన్ రూపొందించడం శుభపరిణామమన్నారు. రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కొరతను అధిగమించేలా తగినన్ని నిధులు కేటాయిస్తేæ జాతి నిర్మాణంలో రాష్ట్రాలు మరింత సమర్ధవంతమైన పాత్ర పోషిస్తాయని చెప్పారు. అత్యవసర పరపతి హామీ పథకాన్ని 2023 మార్చి వరకు పొడిగించడం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణ సహాయం కోసం పరపతి మొత్తాన్ని పెంచడం ఆర్థిక వృద్ధికి తోడ్పాటునిస్తుందన్నారు.
రక్షణ, రక్షణ పరిశోధనకు అవసరమైన వాటిని దేశీయంగా సమకూర్చుకోవాలని నిర్ణయించడం ముదావహమని అన్నారు. రక్షణ రంగానికి గత బడ్జెట్‌లో కేటాయింపులు రూ. 13.89 లక్షల కోట్ల నుంచి రూ.15.23 లక్షల కోట్లకు పెంచడం, రైల్వేలకు కేటాయింపులు రూ. 2.04 లక్షల కోట్ల నుంచి 2.39 లక్షల కోట్లకు పెంచడం సానుకూల పరిణామమని చెప్పారు. కానీ వడ్డీ చెల్లింపుల కోసం కేటాయింపులు రూ. 8.14 లక్షల కోట్ల నుంచి రూ. 9.41 లక్షల కోట్లకు పెరగడం ఆందోళన కల్గిస్తోందని అన్నారు. జీఎస్‌టీ వసూళ్లు గణనీయంగా పెరగడంతో ఈ ఏడాది స్థూల పన్ను రాబడి రూ. 17.65 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. 2020–21లో రూ. 197.46 లక్షల కోట్లుగా ఉన్న జీడీపీ 2021–22లో రూ. 232.18 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. జీడీపీలో ద్రవ్య లోటు 2020–21లో 9.21 శాతం ఉండగా, 2021–22లో 6.85 శాతానికి తగ్గిందని తెలిపారు. రెవెన్యూ లోటు 2020–21లో జీడీపీలో 7.34 శాతం ఉండగా, 2021–22లో 4.,69 శాతానికి తగ్గడం ప్రోత్సాహకరంగా ఉందని చెప్పారు.
ఏపీ ప్రయోజనాలు విస్మరించిన కేంద్రం
Published Wed, Feb 2 2022 2:43 AM | Last Updated on Wed, Feb 2 2022 10:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment