64 విమానాల్లో 15 వేల మంది.. | Indian Government Running Special Air Ways To Bring Back Indians | Sakshi
Sakshi News home page

64 విమానాల్లో 15 వేల మంది..

Published Wed, May 6 2020 1:06 AM | Last Updated on Wed, May 6 2020 4:31 AM

Indian Government Running Special Air Ways To Bring Back Indians - Sakshi

న్యూఢిల్లీ/లండన్‌: అమెరికా, బ్రిటన్, యూఏఈ సహా 12 దేశాల్లో చిక్కుకుపోయిన వారిలో తొలి విడతగా.. సుమారు 15 వేల మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఎయిర్‌ ఇండియా మే 7 నుంచి 13 వరకు 64 ప్రత్యేక విమానాలను నడపనుంది. ప్రైవేటు విమానయాన సంస్థలను ఆ తరువాత అనుమతిస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి మంగళవారం వెల్లడించారు. దశలవారీగా సుమారు 2 లక్షల మందిని భారత్‌కు తీసుకురానున్నామన్నారు. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందన్నారు. విమాన టికెట్‌ ధరలను ప్రయాణికులే భరించాలని పురి స్పష్టం చేశారు. మే 7–13 మధ్య అమెరికా, బ్రిటన్, యూఏఈ, ఖతార్, సౌదీ, సింగపూర్, మలేసియా, ఫిలిప్పైన్స్, బంగ్లాదేశ్, బహ్రెయిన్, కువైట్, ఒమన్‌ల నుంచి 14,800 మంది భారతీయులను తరలించనున్నామన్నారు.

యూఏఈకి 10, అమెరికా, బ్రిటన్, బంగ్లాదేశ్, మలేసియాలకు 7 చొప్పున, సౌదీ అరేబియా, సింగపూర్, కువైట్, ఫిలిప్పైన్స్‌లకు 5 చొప్పున, ఖతార్, ఒమన్, హహ్రెయిన్‌లకు 2 చొప్పున విమానాలను నడుపుతామన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత.. అంతర్జాతీయ విమాన ప్రయాణాలను దశలవారీగా ప్రారంభిస్తామని పురి తెలిపారు. అమెరికాలోని నగరాల నుంచి సుమారు రూ. లక్ష, లండన్‌ నుంచి రూ. 50 వేలు, దుబాయ్‌ నుంచి రూ. 13 వేలు, ఢాకా నుంచి రూ. 12 వేలు టికెట్‌ ధరగా ఉండొచ్చని అధికారులు తెలిపారు. కేరళకు అత్యధికంగా 15, ఢిల్లీ, తమిళనాడులకు 11 చొప్పున, మహారాష్ట్ర, తెలంగాణలకు 7 చొప్పున, గుజరాత్‌కు 5, కర్ణాటక, జమ్మూకశ్మీర్‌లకు 3 చొప్పున ఎయిర్‌ ఇండియా లేదా ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ద్వారా విమానాలు నడపనున్నామని అధికారులు తెలిపారు. భారత్‌కు చేరుకున్న తరువాత ప్రతీ ప్రయాణికుడు ఆరోగ్య సేతు యాప్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి.

వారికే ప్రాధాన్యత.. 
లండన్‌లోని హిత్రూ విమానాశ్రయం నుంచి ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరులకు ఏడు విమానాలను నడపనున్నట్లు బ్రిటన్‌లోని భారతీయ హై కమిషన్‌ ప్రకటించింది. వృద్ధులు, గర్భిణులు, తీవ్రమైన వైద్య సమస్యలు ఉన్నవారు, భారత్‌కు అత్యవసరంగా వెళ్లాల్సినవారు.. తదితరులకు ముందు ప్రాధాన్యత ఇస్తామని, భారత్‌ చేరుకున్న తరువాత 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండేందుకు అంగీకరించినవారినే టికెట్‌ బుకింగ్‌కు అనుమతిస్తామని అధికారులు స్పష్టంచేశారు. కోవిడ్‌–19 లక్షణాలు లేనివారినే ప్రయాణానికి అనుమతిస్తామని ఈ సందర్భంగా చెప్పారు.

కేరళ వారే ఎక్కువ.. 
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) నుంచి భారత్‌ వచ్చేందుకు దాదాపు 2 లక్షల మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. వారిలో కేరళవారే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తొలి రెండు విమానాలను గురువారం అక్కడికే పంపిస్తున్నామని అక్కడి భారతీయ రాయబారి పవన్‌ కపూర్‌ తెలిపారు. రిజిస్టర్‌ చేసుకున్న వారిలో ప్రాధాన్యత క్రమంలో కొందరిని ఎంపిక చేసి.. ఎయిర్‌ ఇండియా వెబ్‌ సైట్‌ ద్వారా టికెట్స్‌ బుక్‌ చేసుకోవల్సిందిగా వారికి ఈ మెయిల్స్‌ పంపించామన్నారు. ఇబ్బందుల్లో ఉన్న కార్మికులు, ఉద్యోగాలు కోల్పోయినవారు, అనారోగ్యంతో ఉన్నవారు, వృద్ధులు, గర్భిణులకు తొలి ప్రాధాన్యమిచ్చామన్నారు. అబుదాబి నుంచి కొచ్చి, దుబాయ్‌ నుంచి కోజికోడ్‌లకు ఈ విమానాలు వెళ్తాయని దుబాయిలోని భారతీయ రాయబార కార్యాలయం ప్రకటించింది. భారతీయులను తీసుకువచ్చేందుకు నౌకాదళానికి చెందిన ‘శార్దూల్‌’నౌకను కూడా దుబాయ్‌కి పంపించినట్లు రక్షణ శాఖ ప్రకటించింది.

యూఎస్‌లోని ఆ నగరాల నుంచి.. 
అమెరికా నుంచి భారతీయులను తీసుకువచ్చేందుకు  విమానాలు శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, వాషింగ్టన్, షికాగోల నుంచి బయల్దేరుతాయని అధికారులు తెలిపారు. అమెరికాలో భారీ సంఖ్యలో భారతీయ విద్యార్థులు, పర్యాటకులు చిక్కుకుపోయిన నేపథ్యంలో రానున్న వారాల్లో మరిన్ని విమానాలను భారత్‌కు నడపనున్నామన్నారు. భారత్‌కు రావాలనుకుంటున్నవారి జాబితాను ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా అమెరికాలోని భారతీయ కాన్సులేట్లు రూపొందిస్తున్నాయన్నారు.

హైదరాబాద్‌కు 2,350 మంది 
ఈ నెల 7 నుంచి 13 వరకు నడుపుతున్న ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్‌కు దాదాపు 2,350 మంది రానున్నారు. ఈ వారం రోజుల్లో వివిధ దేశాల నుంచి హైదరాబాద్‌కు 7 విమానాలు నడపనున్నారు. 7న శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ముంబై మీదుగా నగరానికి వచ్చే తొలి విమానంలో 300 మంది, 8న కువైట్‌ నుంచి వచ్చే విమానంలో 200 మంది, 9న లండన్‌ నుంచి 250 మంది, 10న యూఏఈలోని అబుదాబి నుంచి 200 మంది, వాషింగ్టన్‌ నుంచి ఢిల్లీ మీదుగా వచ్చే విమానంలో 300 మంది, 12న మనీలా నుంచి 250 మంది, న్యూయార్క్‌ నుంచి ఢిల్లీ మీదుగా వచ్చే విమానంలో 300 మంది, 13న షికాగో నుంచి ఢిల్లీ మీదుగా వచ్చే విమానంలో 300 మంది, కౌలాలంపూర్‌ నుంచి వచ్చే విమానంలో 250 మంది ప్రయాణికులను తీసుకువస్తున్నారు. లాక్‌డౌన్‌ను సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు అనుమతి రాగానే విమానాలు నడిపేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జీఎంఆర్‌ విమానాశ్రయం సీఈఓ కిషోర్‌ వెల్లడించారు.

గల్ఫ్‌ దేశాలకు 26 ప్రత్యేక విమానాలు 
లాక్‌డౌన్‌ వల్ల గల్ఫ్‌ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం 26 ప్రత్యేక విమానాలను పంపించడానికి షెడ్యూల్‌ ఖరారు చేసింది. గల్ఫ్‌ దేశాల్లోని పర్యాటక ప్రాంతాల సందర్శన, వ్యాపార కార్యకలాపాల కోసం వెళ్లిన భారతీయులు అనేక మంది లాక్‌డౌన్‌ కారణంగా అక్కడే ఉండిపోయారు. యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, బహ్రెయిన్, కువైట్‌లకు విమానాలను పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక్కో విమానంలో 200 మందిని తరలించడానికి విమానయాన శాఖ చర్యలు తీసుకుంటోంది. గల్ఫ్‌ దేశాల నుంచి హైదరాబాద్, కొచ్చి, కోజికోడ్, చెన్నై, లక్నో, ఢిల్లీ, తిరువనంతపురం, అహ్మదాబాద్, అమృత్‌సర్‌లకు ప్రత్యేక విమానాలు నడపనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement