రాజ్యసభలో మంత్రి మాండవీయ మాట్లాడుతుండగా ప్రదర్శించిన ప్లకార్డు
న్యూఢిల్లీ: పెగసస్ నిఘా వ్యవహారంపై సభలో చర్చించాలని, ప్రభుత్వం సమాధానం చెప్పాలని, వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో ప్రతిపక్షాలు మంగళవారం పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళన కొనసాగించాయి. వెల్‌లోకి దూసుకొచ్చి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ బిగ్గరగా నినాదాలు చేస్తుండడంతో పలుమార్లు సభలను వాయిదా వేయాల్సి వచ్చింది. విపక్షాల నిరసన కొనసాగుతుండగానే లోక్‌సభలో ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ బిల్లు–2021, ట్రిబ్యునల్ రిఫార్మ్స్ బిల్లు–2021ను ఆమోదించారు. సభలో మాట్లాడేందుకు తగినంత సమయం ఇస్తానని, ప్రతిపక్ష సభ్యులు శాంతించాలని, వెనక్కి వెళ్లి సీట్లలో కూర్చోవాలని స్పీకర్ ఓంబిర్లా పదేపదే కోరినప్పటికీ వారు లెక్కచేయలేదు. దీంతో స్పీకర్ సాయంత్రం 4 గంటల సమయాని కల్లా మూడుసార్లు సభను వాయిదా వేశారు. అంతకు ముందు ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి చేరుకున్నారు. నినాదాలు చేయడం మొదలుపెట్టారు. వ్యవసాయం, రైతుల సంక్షేమంపై కేంద్ర వ్యవసాయ మంత్రిని ప్రశ్నలు అడగాలని స్పీకర్ ఓంబిర్లా సూచించినప్పటికీ వారు నినాదాలు ఆపలేదు. దాదాపు 40 నిమిషాల పాటు ప్రశ్నోత్తరాల సమయం కొనసాగింది.
రాజ్యసభ పలుమార్లు వాయిదా
పెగసస్, కొత్త సాగు చట్టాలు తదితర అంశాలపై చర్చ చేపట్టాల్సిందేనని రాజ్యసభలో ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. నినాదాలు చేస్తూ సభా వ్యవహారాలకు అంతరాయం కలిగించాయి. దీంతో సభను చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ పలుమార్లు వాయిదా వేశారు. ప్రతిపక్షాల నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాల సమయం పూర్తయింది. బిల్లుల ఆమోదం విషయంలో ప్రతిపక్ష సభ్యుల అభ్యంతకర వ్యాఖ్యలను మైనార్టీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తప్పుపట్టారు. పార్లమెంట్‌లో బిల్లులను ఆమోదిస్తున్నారా? లేక పాప్డీ చాట్ తయారు చేస్తున్నారా?అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు డెరెక్ ఓ బ్రెయిన్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. సభ సజావుగా సాగాలని రాజ్యసభలో మెజార్టీ సభ్యులు కోరుకుంటున్నారని వెంకయ్య నాయుడు అన్నారు. తాము ఏం చేయాలో, ఏం చేయకూడదో ప్రతిపక్షాలు నిర్దేశించలేవని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment