రూ. 4,095 కోట్లతో విశాఖ పోర్టు విస్తరణ | Expansion Of Visakhapatnam Port With Rs 4095 Crore | Sakshi
Sakshi News home page

రూ. 4,095 కోట్లతో విశాఖ పోర్టు విస్తరణ

Published Mon, Nov 16 2020 3:19 AM | Last Updated on Mon, Nov 16 2020 4:34 AM

Expansion Of Visakhapatnam Port With Rs 4095 Crore - Sakshi

విశాఖపట్నం పోర్టు ట్రస్టు

అవసరాలకు అనుగుణంగా విస్తరణ పనులతో విశాఖ పోర్టు ట్రస్ట్‌ ప్రగతి పథంలో పయనిస్తోంది. వచ్చే మూడేళ్లలో నిర్వహణ సామర్థ్యాన్ని మరింత పెంచుకునేందుకు సొబగులద్దుకుంటోంది. మౌలిక వసతుల కల్పనతో పాటు జెట్టీల విస్తరణ, కంటైనర్‌ టెర్మినల్‌ విస్తరణ, రవాణా, అనుసంధాన ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే ప్రపంచ వాణిజ్య కేంద్రానికి చిరునామాగా మారనుంది. రూ.4,095 కోట్లతో పోర్టు ఆధునికీకరణ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కొన్ని పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులన్నీ వీలైనంత త్వరగా పూర్తిచేసి దేశంలోని మేజర్‌ పోర్టుల్లో విశాఖను నంబర్‌వన్‌గా నిలబెట్టాలని వీపీటీ అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. 
– సాక్షి, విశాఖపట్నం 

వచ్చే మూడేళ్లలో విశాఖ పోర్టును విస్తరించేందుకు విశాఖ పోర్టు ట్రస్ట్‌ (వీపీటీ) అధికారులు ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్నారు. బెర్తుల ఆధునికీకరణ, సామర్థ్య విస్తరణతోపాటు సరికొత్త పనులకు శ్రీకారం చుట్టారు. ఇటీవల జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్ర మంత్రి మన్సుఖ్‌ మాండవీయ కూడా విశాఖ పోర్టు విస్తరణకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతో పాటు చానల్స్, బెర్తులను మరింత లోతుగా విస్తరించడం ద్వారా అంతర్గత వనరుల నుంచి సైతం ఆదాయం ఆర్జించేలా పోర్ట్‌ ట్రస్టు మార్గాలను అన్వేషిస్తోంది. మొత్తంగా రూ.4,095 కోట్లతో పనులు చేపట్టారు. వీటిలో 12 పనులకు రూ.3,086 కోట్లు కేటాయించారు. ఈ పనులు డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్‌ (డీబీఎఫ్‌వోటీ) పద్ధతిలో రూపుదిద్దుకోనున్నాయి. ఫ్లై ఓవర్ల నిర్మాణం మొదలైన రవాణా, అనుసంధానం తదితర తొమ్మిది పనులకు రూ.1,009 కోట్లు కేటాయించారు. 

ఆధునికీకరణ.. యాంత్రీకరణ 
పోర్టు జెట్టీల సామర్థ్యం పెరిగేలా ఆధునికీకరించడంతో పాటు యాంత్రీకరించేందుకు రూ.650 కోట్లతో పనులు చేపడుతున్నారు. వెస్ట్‌క్యూ (డబ్ల్యూక్యూ)–7, డబ్ల్యూక్యూ–8 జెట్టీల ద్వారా మాంగనీస్, బొగ్గు, జిప్సం, బాక్సైట్‌ తదితర ఖనిజాలు, ఇతర ప్రధాన ఉత్పత్తుల రవాణా జరుగుతుంటుంది. భవిష్యత్తులో వీటి రవాణా పెరిగే అవకాశం ఉన్నందున.. ఈ రెండు జెట్టీలను రూ.350 కోట్లతో ఆధునికీకరిస్తున్నారు. ఎరువుల రవాణా ఎక్కువగా జరిగే ఈక్యూ–7 జెట్టీని యాంత్రీకరించే ప్రణాళికను సిద్ధం చేశారు. కార్గోల ద్వారా వచ్చే ఎరువులను ఇక్కడే ప్యాకింగ్‌ చేసేలా వసతుల కల్పనకు రూపొందించిన ఈ పనులు త్వరలో చేపట్టనున్నారు. 

13 లక్షల కంటైనర్లకు అనుగుణంగా.. 
చమురు రవాణాకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఓఆర్‌–1, ఓఆర్‌–2 బెర్తులను రూ.168 కోట్లతో ఆధునికీకరిస్తున్నారు. తద్వారా 80 వేల టన్నుల సామర్థ్యం ఉన్న ఆయిల్‌ ట్యాంకర్లు నిర్వహించేందుకు వీలవుతుంది. 2022 మార్చి నాటికి ఈ పనులు పూర్తవనున్నాయి. కాలుష్య రహిత ఎగుమతి, దిగుమతులను ప్రోత్సహించేందుకు రూ.633.11 కోట్లతో చేపట్టిన కంటైనర్‌ టెరి్మనల్‌ విస్తరణ పనులు వచ్చే మార్చి నాటికి పూర్తికావాల్సి ఉండగా.. కోవిడ్‌–19 కారణంగా ఆలస్యమవుతున్నాయి. ఇది పూర్తయితే ప్రస్తుతం ఉన్న ఎనిమిది లక్షల కంటైనర్ల హ్యాండిల్‌ సామర్థ్యం 13.4 లక్షల కంటైనర్లకు చేరుతుంది. 
కంటైనర్‌ టెర్మినల్‌  

అభివృద్ధి దిశగా అవుటర్‌ హార్బర్‌ 
అత్యవసర సమయంలో ఎక్కువగా ఉపయోగపడే అవుటర్‌ హార్బర్‌ను అభివృద్ధి చేసేందుకు రూ.581 కోట్లు కేటాయించారు. దీన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఐరన్‌ ఓర్‌ రవాణా సామర్థ్యం పెరుగుతుంది. అవుటర్‌ హార్బర్‌లో ఉన్న సాధారణ కార్గో బెర్త్‌ (జీసీబీ)ను రూ.444.10 కోట్లతో భారీ నౌకల రవాణాకు వీలుగా ఆధునికీకరించనున్నారు. వివిధ దేశాలకు సరకు రవాణా నిర్వహించేందుకు అనుగుణంగా కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (కాంకర్‌) రూ.372.10 కోట్లతో చేపడుతున్న రెండోదశ పనులు చేపట్టనుంది.  

141.64 మిలియన్‌ టన్నుల సామర్థ్యం లక్ష్యంగా... 
సరకు రవాణాలో ఏటికేడు వృద్ధి నమోదు చేస్తున్న విశాఖ పోర్టు.. దేశంలోని మేజర్‌ పోర్టులతో పోటీ పడుతోంది. 2019 ఆర్థిక సంవత్సరంలో సరకు రవాణాలో మూడోస్థానంలో ఉంది. ప్రస్తుతం చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తయితే మొదటి రెండు స్థానాల్లో నిలిచే అవకాశాలున్నాయి. 2019–20 ఆర్థిక సంవత్సరానికి విశాఖ పోర్టు 72.72 మిలియన్‌ టన్నుల సరకు రవాణా చేసింది. ఇనుప ఖనిజం, పెల్లెట్స్, కుకింగ్‌ కోల్, పెట్రోలియం ఉత్పత్తులు, కంటైనర్‌ కార్గో వంటి వాటి ఎగుమతి దిగుమతులు ఇక్కడి నుంచి జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు సరకు రవాణాలో ఆధునిక వ్యూహాల్ని అనుసరిస్తూ.. విశాఖ పోర్టు ట్రస్టు దూసుకెళ్తోంది. ఇన్నర్‌ హార్బర్‌లో పనామాక్స్‌ సామర్థ్యం కలిగిన మూడు బెర్తుల నిర్మాణంతో పాటు ఆయిల్‌ రిఫైనరీ–3లో అదనపు ఆయిల్‌ హ్యాండ్లింగ్‌ సామర్థ్యం పెంచింది. ఆయిల్‌ రిఫైనరీ 1, ఆయిల్‌ రిఫైనరీ 2 బెర్తులు అభివృద్ధి చేసింది. దీనికి తోడు వంద టన్నుల సామర్థ్యంగల హార్బర్‌ మొబైల్‌ క్రేన్‌ ఏర్పాటు చేసింది. 2020–21లో అక్టోబర్‌ వరకు కోవిడ్‌ కాలంలోనూ 38.81 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా చేసింది. ప్రస్తుతం నౌకాశ్రయ సామర్థ్యం 126.89 మిలియన్‌ టన్నులు. ప్రస్తుతం చేపట్టిన పనులు పూర్తయితే ఈ సామర్థ్యం 141.64 మిలియన్‌ టన్నులకు చేరుతుంది. 

భవిష్యత్తు విశాఖ పోర్టు ట్రస్ట్‌దే.. 
విశాఖ పోర్టు ట్రస్ట్‌ చేపట్టిన పలు పనులు 2021 నుంచి 2023 మార్చి నాటికి పూర్తికానున్నాయి. ఇవన్నీ పూర్తయితే విశాఖ పోర్టు ట్రస్ట్‌ అంతర్జాతీయ వాణిజ్య కేంద్ర బిందువుగా మారుతుంది. వీటికితోడు రూ.103 కోట్లతో క్రూయిజ్‌ టెరి్మనల్‌ నిర్మాణపనులు మొదలయ్యాయి. ఇవి కూడా వచ్చే ఏడాదికి పూర్తవుతాయి. క్రూయిజ్‌ టెరి్మనల్‌ పూర్తయితే సముద్ర విహారం విశాఖవాసులకు చేరువవుతుంది. అంతర్జాతీయ పర్యాటకం కూడా అభివృద్ధి చెందుతుంది. సరకు రవాణా, సామర్థ్య నిర్వహణ పరంగా విశాఖ పోర్టు ప్రస్తుతం దేశంలోని మేజర్‌ పోర్టుల్లో మూడోస్థానంలో ఉంది. ప్రస్తుతం చేపట్టిన వేలకోట్ల రూపాయల పనులు పూర్తయితే.. నంబర్‌వన్‌గా మారుతుంది. ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. 
– కె.రామ్మోహన్‌రావు, చైర్మన్, విశాఖ పోర్టు ట్రస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement