Visakhapatnam Port Trust
-
సరుకు లోడింగ్‌లో విశాఖపట్నం పోర్టు మరో రికార్డు
సాక్షి, విశాఖపట్నం: సరుకు లోడింగ్‌లో విశాఖపట్నం పోర్టు అథారిటీ బుధవారం మరో రికార్డు నమోదు చేసింది. ఒక్క రోజు వ్యవధిలో ఒకేసారి నిర్వహించిన అతి పెద్ద సింగిల్ పార్శిల్ లోడు రికార్డును అధిగమించింది. ఎంవీ జీసీఎల్ గంగా కార్గో షిప్లో ఒకే రోజులో 1,04,496 మెట్రిక్ టన్నుల ఐరన్ ఓర్ పెల్లెట్స్ లోడ్ చేశారు. ఆర్సిలర్ మిట్టల్ నిపాన్ స్టీల్ ఇండియా(ఏఎంఎన్ఎస్)కు సంబంధించిన ఇన్నర్ హార్బర్లోని వెస్ట్ క్యూ–1 బెర్త్‌లో ఈ లోడింగ్ జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీన 1,02,200 మెట్రిక్ టన్నుల లోడింగ్ ఇప్పటి వరకూ రికార్డు సింగిల్ పార్శిల్‌గా ఉండేది. అత్యధిక మొత్తంలో లోడింగ్ నిర్వహించిన సిబ్బందిని పోర్టు చైర్మన్ డాక్టర్ అంగముత్తు అభినందించారు. -
నీటి విమానాలూ వచ్చేస్తాయ్
విశాఖ క్రూయిజ్ టెర్మినల్‌లో ఎగిరే పడవ (సీ ప్లేన్) ఎక్కి నేరుగా భాగ్యనగరంలోని హుస్సేన్ సాగర్ వద్ద దిగాలనుకుంటున్నారా.. ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా నది జెట్టీ నుంచి బయలుదేరి ట్రాఫిక్ బారిన పడకుండా నేరుగా విశాఖ వెళదామనుకుంటున్నారా.. బహుశా మీ కల త్వరలోనే సాకారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా విశాఖ పోర్ట్ ట్రస్ట్ భారీ ఏర్పాట్లు చేయాలనుకుంటోంది. ఇదే జరిగితే.. విశాఖ–హైదరాబాద్, విజయవాడ–విశాఖ, తిరుపతి–షిర్డీ మధ్య సీ ప్లేన్‌లో రయ్యిన దూసుకు పోయే అవకాశం కలుగుతుంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అటు నీటిలోను.. ఇటు రన్‌వే మీద ల్యాండ్ అయ్యేలా సీప్లేన్ సర్వీసులను ప్రారంభించాలనుకుంటోంది విశాఖ పోర్ట్ ట్రస్ట్ (వీపీటీ). దీని సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తోంది. సీప్లేన్ సర్వీసులు అందుబాటులోకి వస్తే మరింత వేగంగా.. నగరాల నడిబొడ్డున మధ్యలో విమానం ద్వారా దిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇందుకోసం ఇప్పటికే విశాఖలో నిర్మిస్తున్న అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ నుంచి వీటి రాకపోకలకు వీలు కలగనుంది. ఇక ఆయా ప్రాంతాల్లో సీప్లేన్లు ల్యాండ్ అయ్యేందుకు వీలుగా జెట్టీలను నిర్మిస్తే సరిపోతుంది. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు విమానాశ్రయం నుంచి సిటీలోకి ప్రయాణించే సమయం కూడా తగ్గిపోనుంది. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం వాస్తవానికి సీప్లేన్ సర్వీసుల్ని ప్రారంభించాలని రెండేళ్ల నుంచీ వీపీటీ యోచిస్తోంది. తాజాగా, విజయవాడ, రాజమండ్రి, నాగార్జునసాగర్, హుస్సేన్ సాగర్, చిలికా సరస్సు తదితర ప్రాంతాలకు సీప్లేన్ సర్వీసులను నడిపేందుకు అవకాశం ఉందని గుర్తించింది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, మినీరత్న కంపెనీ పవన్‌హాన్స్ సంస్థ సాధ్యాసాధ్యాలను నివేదిక రూపొందిస్తోంది. హుస్సేన్‌సాగర్, విజయవాడలోని ప్రకాశం బ్యారేజి, చిలికా సరస్సుతో పాటు తిరుపతి, షిర్డీ ప్రాంతాలకు కూడా డిమాండ్ ఉంటుందని అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 200 హెక్టార్లలో 6 బెర్తుల్లో విస్తరించిన ఉన్న విశాఖ అవుటర్ హార్బర్ వద్ద రూ.96 కోట్లతో ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ మెరైన్ క్రూయిజ్ టెర్మినల్ (ఐఎంసీటీ)ని వీపీటీ అభివృద్ధి చేస్తోంది. వీటి పనులు ఏప్రిల్ 2023 నాటికి పూర్తి కానున్నాయి. ఇక్కడి నుంచి సీప్లేన్ సర్వీసులను నడిపేందుకు వీలు కలగనుంది. మరోవైపు తిరుపతి, షిర్డీలలోనూ నేరుగా రన్‌వేపై ఇవి ల్యాండ్ కానుండగా.. హుస్సేన్‌సాగర్, ప్రకాశం బ్యారేజి, చిలికా సరస్సు వంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా జెట్టీలు నిర్మిస్తే సరిపోతుందని భావిస్తున్నారు. 9 మంది నుంచి 19 మంది ప్రయాణించే వీలు సాధారణంగా విమానాలు ఆకాశంలో చక్కర్లు కొడుతూ నేలపై ల్యాండ్ అవుతాయి. కానీ.. నేలమీద, నీటిమీద ల్యాండ్ అయ్యేలా తయారు చేసిన విమానాలనే సీ ప్లేన్స్ అని పిలుస్తారు. ఈ విమానాలు భూమిపైన, నీటిపైన కూడా టేకాఫ్ అవుతాయి. నీటిమీద ల్యాండ్ అవ్వడానికి స్కిడ్, నేలపై ల్యాండ్ అవ్వడానికి వీల్స్ ఉంటాయి. వీటి పరిమాణం చిన్నదిగా ఉండటం వలన పెద్ద పెద్ద విమానాలు చేరలేని ప్రాంతాలకు కూడా ఇవి వెళ్లే అవకాశం ఉంటుంది. రెండు రకాల సీ ప్లేన్లు అందుబాటులో ఉండగా.. ట్విన్ ఇంజన్ ట్విన్ సీటర్‌లో విమానయాన సిబ్బందితో కలిపి 19 మంది, సింగిల్ సీటర్‌లో 9 మంది ప్రయాణించవచ్చు. ట్విన్ సీటర్ గంటకు 290 కిలోమీటర్ల వేగంతో, సింగిల్ సీటర్ 200 కి.మీ. వేగంతో నడపవచ్చు. వీటిని ఏరియల్ సర్వే తరహా కార్యక్రమాల కోసం నెమ్మదిగా నడిపితే నిరంతరాయంగా 4 గంటలపాటు, వేగంగా నడిపితే 2 గంటల పాటు నడుస్తాయి. ఈ సర్వీసులను ప్రారంభించేందుకు ఏయే సంస్థలు ముందుకు వచ్చే అవకాశం ఉందన్న అంశంపైనా అధ్యయనం జరుగుతోంది. అయితే, విమాన ప్రయాణ ధరలతో పోలిస్తే ఇందులో ప్రయాణ వ్యయం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ సులభంగా, వేగంగా తనిఖీలతోపాటు నగరం మధ్యలో నేరుగా దిగేందుకు వీలుండటంతో విమానాశ్రయం నుంచి సిటీలోకి వెచ్చించాల్సిన రవాణా భారం తగ్గనుంది. మరోవైపు సమయం కూడా ఆదా కానుంది. ఒకేసారి రన్‌వేపైనే కాకుండా నీటిలో కూడా ప్రయాణించేందుకు అవకాశం ఉండటంతో పర్యాటకంగా కూడా ఈ సీ ప్లేన్ సర్వీసులు ఆదరణ పొందుతాయన్న ఆశాభావాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. త్వరలో కన్సల్టెన్సీ ఏర్పాటు చేస్తాం సీ ప్లేన్ నడపడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాంతీయ అనుసంధాన పథకం (ఉడాన్ స్కీమ్) ద్వారా నిధులు సమీకరించేందుకు ప్రయత్నిస్తున్నాం. దీనివల్ల రాయితీలు వస్తాయి. ఫీజిబులిటీ స్టడీ పూర్తి చేశాం. డీజీసీఏతో పాటు నేవీ, ఎయిర్‌పోర్టుతో పాటు ఇతర అనుమతులు తీసుకునేందుకు త్వరలోనే కన్సల్టెన్సీని ఏర్పాటు చేస్తాం. క్రూయిజ్ టెర్మినల్ భవనం వద్ద ఒకటి, అవుటర్ హార్బర్లోని నీటిలో సీ ప్లేన్ ల్యాండ్ అయ్యేందుకు ఏరోడ్రోమ్‌లు ఏర్పాటు చేయనున్నాం. క్రూయిజ్ టెర్మినల్ సిద్ధమయ్యాక సీ ప్లేన్ సేవల్ని కూడా ఏకకాలంలో మొదలు పెట్టాలని భావిస్తున్నాం. పర్యాటక, వాణిజ్య అవసరాలకు అనుగుణంగా వీటిని నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. – కె.రామ్మోహన్రావు, చైర్మన్, విశాఖ పోర్ట్ ట్రస్ట్ -
వైజాగ్ పోర్టులో క్రూయిజ్ టెర్మినల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ప్రపంచస్థాయి క్రూయిజ్ టెర్మినల్ ఏడాదిలో సాకారం కానుంది. ఈ ప్రాజెక్టుకు రూ.96 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సంస్థ డిప్యూటీ చైర్మన్ దుర్గేశ్ దూబే వెల్లడించారు. హైదరాబాద్‌లో గురువారం జరిగిన ట్రేడ్ మీట్ సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో ఆయన మాట్లాడారు. ‘మినిస్ట్రీ ఆఫ్ టూరిజం సహకారంతో క్రూయిజ్ టెర్మినల్ నెలకొల్పుతున్నాం. పర్యాటక రంగ వృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుంది. క్రూయిజ్‌లో 2,000 మందికిపైగా ప్రయాణించే సామ ర్థ్యం ఉంటుంది’ అని వివరించారు. ఆయనింకా ఏమన్నారంటే.. అడ్డంకుల్లేని రవాణా..: రైలు, రోడ్డు మార్గంలో వివిధ ప్రాంతాల నుంచి పోర్టుకు.. అలాగే పోర్టు నుంచి వివిధ రాష్ట్రాలకు సరుకు రవాణాకు ఎటువంటి అడ్డంకులు లేకుండా పెద్ద ఎత్తున మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నాం. తూర్పు ప్రాంతంలో ప్రధాన పోర్టుగా నిలవాలన్నది మా లక్ష్యం. ఇందుకోసం మౌలిక వసతులకు 2–3 ఏళ్ల లో రూ.1,000 కోట్లు వెచ్చిస్తున్నాం. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో వెస్ట్, ఈస్ట్ క్యూ బెర్త్‌ల ఆధునీకరణకు రూ.488 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పోర్టును కంటైనర్ ట్రాన్షిప్మెంట్ హబ్‌గా తీర్చిదిద్దుతాం. హైదరాబాద్ నుంచి..: ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ప్రధానంగా ముంబై పోర్ట్ ద్వారా కార్గో రవాణా జరుగుతోంది. ఏటా 30 లక్షల టన్నుల సరుకు విదేశాలకు ఎగుమతి అవుతోంది. వైజాగ్ పోర్ట్ సమీపంలో ఉన్నప్పటికీ భాగ్యనగర వర్తకులు ముంబై నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారు. అర్హతగల వర్తకులకు చార్జీల్లో భారత్‌లో అత్యధికంగా 80 శాతం తగ్గింపు ఇస్తున్నాం. చార్జీల పరంగా చవకైన పోర్టు ఇదే. హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్తున్న కార్గోలో 10 లక్షల టన్నులు వైజాగ్ పోర్ట్ నుంచి జరిగేలా ప్రణాళికతో ఉన్నాం. ► కోవిడ్ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా నౌకలు, కంటైనర్ల కొరత ఉంది. చార్జీలు అధికమయ్యాయి. పరిశ్రమపై తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. సాధారణ స్థితికి రావడానికి 6–12 నెలలు పట్టొచ్చు. 2020–21 మాదిరిగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ రూ.1,400 కోట్ల ఆదాయం ఆశిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 6.89 కోట్ల టన్నుల సరుకు రవాణా జరిగింది. 2021–22లో 7.1 కోట్ల టన్నులు ఆశిస్తున్నాం. పోర్టు కార్గో రవాణాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాటా 30 శాతముంది. -
దేశంలో మూడో స్వచ్ఛ నౌకాశ్రయంగా విశాఖ పోర్టు
దొండపర్తి (విశాఖ దక్షిణ): విశాఖ పోర్ట్ ట్రస్ట్ మరో ఘనతను సొంతం చేసుకుంది. దేశంలోనే మూడో స్వచ్ఛ నౌకాశ్రయంగా అవార్డును దక్కించుకుంది. స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో భాగంగా 2019 సంవత్సరానికి సంబందించి ఈ అవార్డును కేంద్ర పోర్టులు, షిప్పింగ్, వాటర్‌వేస్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో విశాఖ పోర్ట్ ట్రస్ట్‌లో అన్ని విభాగాలు, శాఖల్లో స్వచ్ఛ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. పోర్టు లోపలే కాకుండా పరిసర ప్రాంతాల్లోను, జ్ఞానాపురంలో కూడా పరిశుభ్రత కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించింది. సాలిగ్రామపురం, జాలారిపేట, బీచ్ రోడ్డులలో పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు, విద్యార్థులకు పరిశుభ్రతపై పోటీలు నిర్వహించింది. దేశవ్యాప్తంగా మేజర్ పోర్టులు నిర్వహించిన ఈ స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో విశాఖ పోర్ట్ ట్రస్ట్‌కు 3వ క్లీనెస్ట్ పోర్ట్‌గా కేంద్ర పోర్టులు, షిప్పింగ్, వాటర్‌వేస్ మంత్రిత్వ శాఖ గుర్తిస్తూ అవార్డును ప్రకటించింది. దీనిపై విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కె.రామమోహనరావు పోర్టు అధికారులు, ఉద్యోగులను అభినందించారు. -
రూ. 4,095 కోట్లతో విశాఖ పోర్టు విస్తరణ
అవసరాలకు అనుగుణంగా విస్తరణ పనులతో విశాఖ పోర్టు ట్రస్ట్ ప్రగతి పథంలో పయనిస్తోంది. వచ్చే మూడేళ్లలో నిర్వహణ సామర్థ్యాన్ని మరింత పెంచుకునేందుకు సొబగులద్దుకుంటోంది. మౌలిక వసతుల కల్పనతో పాటు జెట్టీల విస్తరణ, కంటైనర్ టెర్మినల్ విస్తరణ, రవాణా, అనుసంధాన ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే ప్రపంచ వాణిజ్య కేంద్రానికి చిరునామాగా మారనుంది. రూ.4,095 కోట్లతో పోర్టు ఆధునికీకరణ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కొన్ని పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులన్నీ వీలైనంత త్వరగా పూర్తిచేసి దేశంలోని మేజర్ పోర్టుల్లో విశాఖను నంబర్‌వన్‌గా నిలబెట్టాలని వీపీటీ అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. – సాక్షి, విశాఖపట్నం వచ్చే మూడేళ్లలో విశాఖ పోర్టును విస్తరించేందుకు విశాఖ పోర్టు ట్రస్ట్ (వీపీటీ) అధికారులు ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్నారు. బెర్తుల ఆధునికీకరణ, సామర్థ్య విస్తరణతోపాటు సరికొత్త పనులకు శ్రీకారం చుట్టారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా విశాఖ పోర్టు విస్తరణకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతో పాటు చానల్స్, బెర్తులను మరింత లోతుగా విస్తరించడం ద్వారా అంతర్గత వనరుల నుంచి సైతం ఆదాయం ఆర్జించేలా పోర్ట్ ట్రస్టు మార్గాలను అన్వేషిస్తోంది. మొత్తంగా రూ.4,095 కోట్లతో పనులు చేపట్టారు. వీటిలో 12 పనులకు రూ.3,086 కోట్లు కేటాయించారు. ఈ పనులు డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్‌వోటీ) పద్ధతిలో రూపుదిద్దుకోనున్నాయి. ఫ్లై ఓవర్ల నిర్మాణం మొదలైన రవాణా, అనుసంధానం తదితర తొమ్మిది పనులకు రూ.1,009 కోట్లు కేటాయించారు. ఆధునికీకరణ.. యాంత్రీకరణ పోర్టు జెట్టీల సామర్థ్యం పెరిగేలా ఆధునికీకరించడంతో పాటు యాంత్రీకరించేందుకు రూ.650 కోట్లతో పనులు చేపడుతున్నారు. వెస్ట్‌క్యూ (డబ్ల్యూక్యూ)–7, డబ్ల్యూక్యూ–8 జెట్టీల ద్వారా మాంగనీస్, బొగ్గు, జిప్సం, బాక్సైట్ తదితర ఖనిజాలు, ఇతర ప్రధాన ఉత్పత్తుల రవాణా జరుగుతుంటుంది. భవిష్యత్తులో వీటి రవాణా పెరిగే అవకాశం ఉన్నందున.. ఈ రెండు జెట్టీలను రూ.350 కోట్లతో ఆధునికీకరిస్తున్నారు. ఎరువుల రవాణా ఎక్కువగా జరిగే ఈక్యూ–7 జెట్టీని యాంత్రీకరించే ప్రణాళికను సిద్ధం చేశారు. కార్గోల ద్వారా వచ్చే ఎరువులను ఇక్కడే ప్యాకింగ్ చేసేలా వసతుల కల్పనకు రూపొందించిన ఈ పనులు త్వరలో చేపట్టనున్నారు. 13 లక్షల కంటైనర్లకు అనుగుణంగా.. చమురు రవాణాకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఓఆర్–1, ఓఆర్–2 బెర్తులను రూ.168 కోట్లతో ఆధునికీకరిస్తున్నారు. తద్వారా 80 వేల టన్నుల సామర్థ్యం ఉన్న ఆయిల్ ట్యాంకర్లు నిర్వహించేందుకు వీలవుతుంది. 2022 మార్చి నాటికి ఈ పనులు పూర్తవనున్నాయి. కాలుష్య రహిత ఎగుమతి, దిగుమతులను ప్రోత్సహించేందుకు రూ.633.11 కోట్లతో చేపట్టిన కంటైనర్ టెరి్మనల్ విస్తరణ పనులు వచ్చే మార్చి నాటికి పూర్తికావాల్సి ఉండగా.. కోవిడ్–19 కారణంగా ఆలస్యమవుతున్నాయి. ఇది పూర్తయితే ప్రస్తుతం ఉన్న ఎనిమిది లక్షల కంటైనర్ల హ్యాండిల్ సామర్థ్యం 13.4 లక్షల కంటైనర్లకు చేరుతుంది. కంటైనర్ టెర్మినల్ అభివృద్ధి దిశగా అవుటర్ హార్బర్ అత్యవసర సమయంలో ఎక్కువగా ఉపయోగపడే అవుటర్ హార్బర్‌ను అభివృద్ధి చేసేందుకు రూ.581 కోట్లు కేటాయించారు. దీన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఐరన్ ఓర్ రవాణా సామర్థ్యం పెరుగుతుంది. అవుటర్ హార్బర్లో ఉన్న సాధారణ కార్గో బెర్త్ (జీసీబీ)ను రూ.444.10 కోట్లతో భారీ నౌకల రవాణాకు వీలుగా ఆధునికీకరించనున్నారు. వివిధ దేశాలకు సరకు రవాణా నిర్వహించేందుకు అనుగుణంగా కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్) రూ.372.10 కోట్లతో చేపడుతున్న రెండోదశ పనులు చేపట్టనుంది. 141.64 మిలియన్ టన్నుల సామర్థ్యం లక్ష్యంగా... సరకు రవాణాలో ఏటికేడు వృద్ధి నమోదు చేస్తున్న విశాఖ పోర్టు.. దేశంలోని మేజర్ పోర్టులతో పోటీ పడుతోంది. 2019 ఆర్థిక సంవత్సరంలో సరకు రవాణాలో మూడోస్థానంలో ఉంది. ప్రస్తుతం చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తయితే మొదటి రెండు స్థానాల్లో నిలిచే అవకాశాలున్నాయి. 2019–20 ఆర్థిక సంవత్సరానికి విశాఖ పోర్టు 72.72 మిలియన్ టన్నుల సరకు రవాణా చేసింది. ఇనుప ఖనిజం, పెల్లెట్స్, కుకింగ్ కోల్, పెట్రోలియం ఉత్పత్తులు, కంటైనర్ కార్గో వంటి వాటి ఎగుమతి దిగుమతులు ఇక్కడి నుంచి జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు సరకు రవాణాలో ఆధునిక వ్యూహాల్ని అనుసరిస్తూ.. విశాఖ పోర్టు ట్రస్టు దూసుకెళ్తోంది. ఇన్నర్ హార్బర్లో పనామాక్స్ సామర్థ్యం కలిగిన మూడు బెర్తుల నిర్మాణంతో పాటు ఆయిల్ రిఫైనరీ–3లో అదనపు ఆయిల్ హ్యాండ్లింగ్ సామర్థ్యం పెంచింది. ఆయిల్ రిఫైనరీ 1, ఆయిల్ రిఫైనరీ 2 బెర్తులు అభివృద్ధి చేసింది. దీనికి తోడు వంద టన్నుల సామర్థ్యంగల హార్బర్ మొబైల్ క్రేన్ ఏర్పాటు చేసింది. 2020–21లో అక్టోబర్ వరకు కోవిడ్ కాలంలోనూ 38.81 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసింది. ప్రస్తుతం నౌకాశ్రయ సామర్థ్యం 126.89 మిలియన్ టన్నులు. ప్రస్తుతం చేపట్టిన పనులు పూర్తయితే ఈ సామర్థ్యం 141.64 మిలియన్ టన్నులకు చేరుతుంది. భవిష్యత్తు విశాఖ పోర్టు ట్రస్ట్దే.. విశాఖ పోర్టు ట్రస్ట్ చేపట్టిన పలు పనులు 2021 నుంచి 2023 మార్చి నాటికి పూర్తికానున్నాయి. ఇవన్నీ పూర్తయితే విశాఖ పోర్టు ట్రస్ట్ అంతర్జాతీయ వాణిజ్య కేంద్ర బిందువుగా మారుతుంది. వీటికితోడు రూ.103 కోట్లతో క్రూయిజ్ టెరి్మనల్ నిర్మాణపనులు మొదలయ్యాయి. ఇవి కూడా వచ్చే ఏడాదికి పూర్తవుతాయి. క్రూయిజ్ టెరి్మనల్ పూర్తయితే సముద్ర విహారం విశాఖవాసులకు చేరువవుతుంది. అంతర్జాతీయ పర్యాటకం కూడా అభివృద్ధి చెందుతుంది. సరకు రవాణా, సామర్థ్య నిర్వహణ పరంగా విశాఖ పోర్టు ప్రస్తుతం దేశంలోని మేజర్ పోర్టుల్లో మూడోస్థానంలో ఉంది. ప్రస్తుతం చేపట్టిన వేలకోట్ల రూపాయల పనులు పూర్తయితే.. నంబర్‌వన్‌గా మారుతుంది. ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. – కె.రామ్మోహన్రావు, చైర్మన్, విశాఖ పోర్టు ట్రస్ట్ -
కరోనా విపత్తులోనూ విశాఖ పోర్టు రికార్డు..
సాక్షి, విశాఖపట్నం: కోవిడ్ సమయంలో కూడా పోర్టులో రికార్డు స్థాయిలో ఎగుమతులు, దిగుమతులు జరిగినట్లు విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ రామ్మోహన్ రావు పేర్కొన్నారు. విశాఖ పోర్టు వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాలుష్య నియంత్రణ కోసం మూడు లక్షల మొక్కలు నాటే ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. కరోనా విపత్తు సమయంలో కూడా అన్ని రకాల నిబంధనలు పాటిస్తూ 72.72 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ చేసినట్టు వెల్లడించారు. ముఖ్యంగా విశాఖ మీదగా కొనసాగే అమ్మోనియం నైట్రేట్ వలన ప్రజలకు ఎలాంటి హానీ లేదని చెప్పారు. ఎరువుల తయారీ కోసం ఉపయోగించే ఈ అమ్మోనియం నైట్రేట్ వల్ల ప్రమాదం లేదని రామ్మోహన్ రావు స్పష్టం చేశారు. (చదవండి: ‘కోవిడ్-19 సంక్షోభం సమసిపోలేదు’) -
సరుకు రవాణాలో విశాఖ పోర్టు రికార్డు
సాక్షి, విశాఖపట్నం: సరుకు రవాణాలో విశాఖపట్నం పోర్టుట్రస్ట్ నూతన అధ్యాయం నెలకొల్పిందని పోర్టు చైర్మన్ కె.రామ్మోహనరావు, డిప్యూటీ చైర్మన్ పి.ఎల్.హరనాథ్ తెలిపారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో 72.72 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేసిందని, 86 ఏళ్లలో ఈ స్థాయిలో సరుకు రవాణా చేయడం ఇదే ప్రథమమన్నారు. గత ఏడాది కన్నా ఇది 7.42 మిలియన్ మెట్రిక్ టన్నులు అధికంగా రవాణా చేసి 11.50 శాతం వృద్ధి రేటును సాధించిందని పేర్కొన్నారు. ప్రైవేటు పోర్టుల నుంచి గట్టి పోటీ, ఆర్థిక మాంద్యం, కోవిడ్ 19 విపత్తు వల్ల కలిగిన ఎగుమతి, దిగుమతి ప్రతికూల పరిస్థితులను అధిగమించి రికార్డు స్థాయిలో సరుకు రవాణా జరగడం విశేషమన్నారు. విశాఖ పోర్టు అవలంబిస్తున్న వ్యూహాత్మక వ్యాపార విధానాల వల్ల నేపాల్ ప్రభుత్వం విశాఖ పోర్టును ప్రధాన పోర్టుగా ఎంపిక చేసుకుందని చెప్పారు. గత ఏడాది నేపాల్ 16,292 కంటెయినర్లు హ్యాండిల్ చేయగా, ఈ ఏడాది 161 శాతం వృద్ధి రేటుతో 42,250 కంటెయినర్లను రవాణా చేసిందని వెల్లడించారు. వినియోగదారులకు రాయితీ కల్పించడం, యాంత్రీకరణ, షిప్ టర్న్‌ఎరౌండ్ సమయాన్ని తగ్గించడం వంటి మౌలిక సదుపాయాల కల్పన వల్ల వినియోగదారుల నిర్వహణ వ్యయాన్ని చాలా వరకూ తగ్గించామన్నారు. ఇంతటి చరిత్రాత్మక విజయాన్ని సాధించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఈ ఫలితాన్ని అంకితమిస్తున్నామని పేర్కొన్నారు. -
కార్గో హ్యాండ్లింగ్‌లో విశాఖ పోర్టు వృద్ధి
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం పోర్టు ట్రస్టు (వీపీటీ) కార్గో హ్యాండ్లింగ్‌లో గతేడాదికంటే 4 శాతం వృద్ధి సాధించింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో 61.02 మిలియన్ టన్నుల కార్గోను హ్యాండ్లింగ్ చేయగా ఈ ఏడాది (2017–18లో) 63.54 మిలియన్ టన్నులు చేయగలిగింది. ఇది గత సంవత్సరంకంటే 2.52 మిలియన్ టన్నులు అదనం. అలాగే ర్యాంకింగులోనూ వీపీటీ పురోగతి సాధించింది. అలాగే 2017–18 సంవత్సరంలో రూ.250 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గత సంవత్సరం దేశంలోని పోర్టుల్లో విశాఖ పోర్టు ట్రస్టు 5వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది అది 4వ స్థానంలో నిలిచిందని వీపీటీ చైర్మన్ ఎం.టి.కృష్ణబాబు శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. స్టాకు యార్డులకు ఉక్కు రవాణా.. భారత ప్రభుత్వం కోస్టల్ షిప్పింగ్‌ను అభివృద్ధి చేయడంలో భాగంగా వీపీటీ.. విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉక్కును అహ్మదాబాద్, ముంబై, కొచ్చిల్లోని స్టాకు యార్డులకు రవాణా చేసేందుకు ఒప్పందం కుదిరిందన్నారు. ఇందులో భాగంగా 2.25 లక్షల టన్నుల ఉక్కును షిప్పుల్లో రవాణా జరుగుతుందని చెప్పారు. 2020 నాటికి విశాఖ పోర్టు పూర్తి సామర్థ్యం 133 మిలియన్ టన్నులకు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నామని, దీంతో నిర్వహణ సామర్థ్యం 75 నుంచి 80 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని తెలిపారు. -
మొక్కలు నాటేందుకు బృహత్తర ప్రణాళిక
డాబాగార్డెన్స్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యవేక్షణలో నవంబర్ 10న మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడానికి మైక్రోప్లాన్ రూపొందిస్తున్నట్టు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ తెలిపారు. జీవీఎంసీ పాత కౌన్సిల్ హాల్లో జీవీఎంసీ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్, విశాఖ స్టీల్‌ప్లాంట్, కోరమండల్, రైల్వేలు, నేవీ, పలు సంక్షేమ సంఘాల ప్రతినిధులతో ఆదివారం మొక్క లు నాటే కార్యక్రమంపై ఆయన సమీక్షించారు. వచ్చే నెల 10 నుంచి 30వరకు మొక్కలు నాటడానికి అందరి భాగస్వామ్యం, సహాయ సహకారాలతో ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. విశాఖను అందంగా, హరిత వనంలా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోందన్నారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న మొక్కలే గాక ఇతర రాష్ట్రాల అటవీశాఖ నుంచి సేకరిస్తున్నట్టు తెలిపారు. మొక్కల సేకరణకు ప్రత్యేక ఏర్పాట్లు అటవీశాఖ వద్ద 50 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయని, వాటిలో నాలుగైదేళ్ల వయస్సు కలిగి, ఐదు మీటర్ల ఎత్తు పెరిగిన మొక్కలు వినియోగించనున్నట్టు వివరించారు. కడియం నర్సరీ, సీఎంఆర్ నర్సరీ, చిత్తూరు, కర్నూలు నర్సరీలో మూడు లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నందున వాటిని సేకరించి జీవీఎం సీ పరిధిలో నాటడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. జీవీఎంసీ పరిధిలోని రోడ్లకిరువైపులా, కాలనీ లు, ఇంటర్నల్ రోడ్లలో మొక్కలు నాటడానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఆయా కాలనీలు, సంక్షేమ సంఘాలు స్వయం సహాయ సంఘాల సభ్యులు మొక్కలు నాటే కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని వాటి సంరక్షణకు ముందుకొచ్చి విజయవంతం చేయాలన్నారు. ప్రజలు, కాలనీ వాసులు మొక్కలను దత్తత తీసుకొని అవి పెరగడానికి సహకరించాలని కోరారు. ట్రీగార్డుల ఏర్పాటు నాటిన మొక్కలు ఆరోగ్యవంతంగా పెరగడానికి, పశువుల బారిన పడకుం డా ఉండడానికి ట్రీగార్డుల ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ట్రీగార్డులను తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేయడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నామని, వాటి ఏర్పాటుకు జీవీఎంసీ ప్రధాన ఇంజినీర్ బి.జయరామిరెడ్డి నివేదిక రూపొం దించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవనశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు, కాలుష్యరహిత విశాఖకు మొక్కల పెంపకం చేపడుతున్నట్టు తెలిపారు. సమావేశంలో ఎమ్మె ల్సీ నన్నపనేని రాజకుమారి, సీడీఎంఏ డాక్టర వాణిమోహన్, జీవీఎంసీ కమిషనర్ ఎం.జానకీ, జీవీఎంసీ విభాగధిపతులు, జిల్లా అధికారులు, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ అధికారులు, వుడా, అటవీశాఖ సీసీఎస్ సూర్యనారాయణ, డీఎఫ్ఓ రామ్మోహన్, రెసిడెంట్స్ సంక్షేమ, అపార్టుమెంట్స్ సంక్షే మ సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. రూ.25 లక్షల విలువైన ట్రీగార్డుల విరాళం మంత్రి పిలుపునకు స్పందించి నార్త్ అమెరికా తెలుగు సంఘం, గౌతులచ్చన బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధి వెంకన్న చౌదరి మాస్ ప్లాంటేషన్ కార్యక్రమానికి తన వంతుగా రూ.25 లక్షల విలువ చేసే 400 ట్రీగార్డులను విరాళంగా అందజేశారు. -
బోటుకు చోటేదీ
పాతపోస్టాఫీసు: విశాఖ ఫిషింగ్ హార్బ ర్ సుమారు 24 హెక్టార్ల విస్తీర్ణంలో ఉం ది. రూ.4.26 కోట్లతో 11 జెట్టీలను 1976లో విశాఖపట్నం పోర్టుట్రస్టు నిర్మించింది. 750 మరబోట్లు, 1500 మోటారుబోట్లు,100 మినీ ట్రాలర్లు, భారీ ట్రాలర్లను ఈ 11 జెట్టీల్లోనే కట్టాలి. కానీ పదేళ్ల క్రితం మరమ్మతులకు గురైన 14 ట్రాలర్లను యజమానులు పట్టించుకోకపోవడంతో అవి మునిగిపోయాయి. వాటిని తొలగించాలంటే రూ.లక్షల్లో ఖర్చవుతుందని భావించి అలాగే వదిలేశారు. దీంతో ఇవి 300 మరబోట్లు పట్టే స్థలాన్ని ఆక్రమించాయి. అప్పటి నుంచి జెట్టీల్లో అడుగు చోటు దొరకడమే గగనంగా మారింది. ప్రస్తుతం ఒకబోటు వెనుక మరోబోటును ఇలా నాలుగు వరుసల్లో కట్టుకుంటున్నారు. బోట్లలో డీజిల్, ఐస్, నిత్యావసర వస్తువులు నింపుకునే ందుకు మత్స్యకారులు అవస్థలు పడుతున్నారు. ముందున్న బోట్లను తీస్తే గానీ వెనుకున్న బోట్లు ముందుకు వచ్చి నింపుకోవడం కుదరదు. లేదంటే ముందున్న బోట్లు వేటకెళ్లేంతవరకు ఎదురుచూడాల్సిందే. ఇక బోటు మరమ్మతుకు గురైందంటే.. ఇక అంతే సంగతులు. నీటిలో మునిగిన ట్రాలర్లు పైకి 10 శాతం మాత్రమే కనిపిస్తాయి. మిగిలిన 90 శాతం నీటి అడుగున ఉంటాయి. పదేళ్లుగా అవి నీళ్లలో ఉండడంతో బాగా తుప్పుపట్టి ప్రమాదకరంగా తయారయ్యాయి. మరబోట్లకు చిన్న ఇనుపముక్క తగిలినా నష్టం భారీగా ఉంటుంది. పనుల కోసం మత్స్యకారులు నీళ్లలోకి దిగితే వీటి వల్ల ప్రమాదానికి గురయ్యే అవకాశాలున్నాయి. మునిగిన ట్రాలర్ల వల్ల చాలా కష్టాలు పడుతున్నామని, వాటిని తొలగించాలని చాలా కాలంగా పోర్టు అధికారులను మత్స్యకారులను కోరుతూనే ఉన్నారు. మునిగిన ట్రాలర్లను తొలగించాలి మునిగిన 14 ట్రాలర్లతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. హార్బర్లో 300 మరబోట్లు పట్టేంత స్థలాన్ని ఇవి ఆక్రమించాయి. మరబోట్లు పెట్టుకోవడానికి స్థలం కరువైంది. నాలుగు వరుసల్లో బోట్లను కట్టుకుంటున్నాం. ఒక మరబోటు తయారీకి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఖర్చవుతుంది. మునిగి తుప్పుపట్టిన ట్రాలర్లు మరబోటుకు తగిలితే చాలా నష్టం కలుగుతుంది. నీటి అడుగు భాగా నికి వెళ్లినప్పుడు తుప్పు వ స్తువులు తగిలి మత్స్యకా రు లు ప్రమాదాలకు గురవు తున్నారు. వీటిని వెంటనే తొల గించి మా కష్టాలు తొలగిం చాలి. - బర్రి కొండబాబు, కోస్టల్ మరపడవల సంఘం అధ్యక్షుడు -
విశాఖ పోర్ట్ అభివృద్ధికి మరిన్ని ప్రణాళికలు
విజయనగరం టౌన్, న్యూస్‌లైన్ : విశాఖ పోర్ట్ ట్రస్ట్‌ను మరింతగా అభివృద్ధి చేసేం దుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, పోర్ట్ సేవలు ఆయూ పరిశ్రమల యూజమాన్యాలు వినియోగించుకోవాలని విశాఖ పోర్ట్ ట్రస్ట్ డిప్యూటీ చైర్మన్ జీవీఎల్ సత్యకుమార్ అన్నారు. ఇక్కడ ఓ హోటల్లో ట్రేడ్ మీట్‌ను బుధవా రం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 1933లో ఏడాదికి మూడు లక్షల టన్నుల కెపాసి టీ ఉండే ట్రస్ట్ 2014 నాటికి 800 లక్షల టన్నుల సామర్థ్యం ద్వారా ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయని చెప్పారు. జిల్లాలో ఉన్న పలు పరిశ్రమలు యూజ మాన్యాలతో సంప్రదింపులు జరిపి, విశాఖ పోర్ట్ ట్రస్ట్ సేవలపై పూర్తి స్థారుులో అవగాహన కల్పిస్తున్నట్టు తెలి పారు. ఇతర పోర్టుల కంటే ధీటుగా విశాఖ పోర్టును అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు పోర్టు సమీపంలో సముద్ర తీరం లోతు పెంచి పెద్ద పెద్ద షిప్పులు వచ్చే విధంగా ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లాలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు పోర్టు ట్రస్ట్ అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని సూచించారు. వ్యాపారంలో ప్రగతిని సాధించేందుకు వీలుగా అభివృద్ధి చేశామన్నారు.ప్రస్తుతం రోజుకు లక్ష టన్నుల మేరకు సరుకులను ఎగుమతి చేయగల సామర్థ్యం ఉందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విని యోగించడం ద్వారా కాలుష్యం బారిన పడకుండా చూశామని తెలిపారు. జిల్లాలోని జిందాల్, ఫేకర్, ఎన్సీఎస్ సుగర్స్, మహామాయ, ఆంధ్రా ఫెర్రో ఎల్లారుుస్ వంటి పెద్ద పరిశ్రమలకు అందుబాటులో ఉండే విధం గా పోర్టు తన సేవలను విస్తృతం చేస్తోందన్నారు. మీట్ లో పోర్ట్ అధికారులు కల్యాణ్ చక్రవర్తి, ఎం.సుధీర్, కె.సత్యనారాయణ, సెంథిల్‌కుమార్, సీహెచ్ అవతారంనాయుడు, డాక్టర్ ఎస్వీ భాస్కరరావు పాల్గొన్నారు.