విశాఖపట్నం పోర్టుట్రస్ట్ చైర్మన్ కె.రామ్మోహనరావు
సాక్షి, విశాఖపట్నం: సరుకు రవాణాలో విశాఖపట్నం పోర్టుట్రస్ట్ నూతన అధ్యాయం నెలకొల్పిందని పోర్టు చైర్మన్ కె.రామ్మోహనరావు, డిప్యూటీ చైర్మన్ పి.ఎల్.హరనాథ్ తెలిపారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో 72.72 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేసిందని, 86 ఏళ్లలో ఈ స్థాయిలో సరుకు రవాణా చేయడం ఇదే ప్రథమమన్నారు. గత ఏడాది కన్నా ఇది 7.42 మిలియన్ మెట్రిక్ టన్నులు అధికంగా రవాణా చేసి 11.50 శాతం వృద్ధి రేటును సాధించిందని పేర్కొన్నారు. ప్రైవేటు పోర్టుల నుంచి గట్టి పోటీ, ఆర్థిక మాంద్యం, కోవిడ్ 19 విపత్తు వల్ల కలిగిన ఎగుమతి, దిగుమతి ప్రతికూల పరిస్థితులను అధిగమించి రికార్డు స్థాయిలో సరుకు రవాణా జరగడం విశేషమన్నారు.
విశాఖ పోర్టు అవలంబిస్తున్న వ్యూహాత్మక వ్యాపార విధానాల వల్ల నేపాల్ ప్రభుత్వం విశాఖ పోర్టును ప్రధాన పోర్టుగా ఎంపిక చేసుకుందని చెప్పారు. గత ఏడాది నేపాల్ 16,292 కంటెయినర్లు హ్యాండిల్ చేయగా, ఈ ఏడాది 161 శాతం వృద్ధి రేటుతో 42,250 కంటెయినర్లను రవాణా చేసిందని వెల్లడించారు. వినియోగదారులకు రాయితీ కల్పించడం, యాంత్రీకరణ, షిప్ టర్న్‌ఎరౌండ్ సమయాన్ని తగ్గించడం వంటి మౌలిక సదుపాయాల కల్పన వల్ల వినియోగదారుల నిర్వహణ వ్యయాన్ని చాలా వరకూ తగ్గించామన్నారు. ఇంతటి చరిత్రాత్మక విజయాన్ని సాధించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఈ ఫలితాన్ని అంకితమిస్తున్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment