సాక్షి, విశాఖపట్నం: పెట్టుబడుల ప్రవాహం.. పెరుగుతున్న సామర్థ్యానికి అనుగుణంగా విస్తరణ పనులతో విశాఖ పోర్టు ట్రస్టు రాబోయే మూడేళ్ల కాలంలో సరికొత్త సొబగులు అద్దుకోనుందని ట్రస్టు చైర్మన్ రామ్మోహన్‌రావు వెల్లడించారు. మౌలిక వసతుల కల్పనతో పాటు జెట్టీలు, కంటైనర్ టెర్మినల్ విస్తరణ, రవాణా, అనుసంధాన ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతుండటంతో విశాఖ పోర్టు ప్రపంచ వాణిజ్య కేంద్రానికి చిరునామాగా మారనుందన్నారు. పనులన్నీ వీలైనంత త్వరగా పూర్తిచేసి.. దేశంలోని మేజర్ పోర్టుల్లో విశాఖ నంబర్‌వన్‌గా తీర్చిదిద్దేందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ఆయన తెలిపారు. పోర్టు ట్రస్ట్ సమావేశ మందిరంలో శనివారం రామ్మోహన్‌రావు మీడియాతో మాట్లాడారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో పోర్టు ప్రగతి, భవిష్యత్తు ప్రణాళికల్ని వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
► 2020–21లో కరోనాతో సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ 30.08 మి.టన్నుల దిగుమతులు, 38.73 మి.టన్నుల ఎగుమతులతో, 1.03 ట్రాన్షిప్‌తో మొత్తం 69.84 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేశాం. దేశంలోని మేజర్ పోర్టుల్లో వరుసగా రెండో ఏడాది మూడో స్థానంలో నిలిచాం. మొత్తం రూ.606 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. అదేవిధంగా పోర్టు చరిత్రలో తొలిసారిగా ల్యాండ్ రెంట్స్ మార్చి నాటికల్లా ఖజానాకు చేరాయి. సుమారు 4 వేల ఎకరాలకు గాను రూ.435 కోట్ల అద్దెలు వసూలయ్యాయి.
► చైనాకు ఎగుమతి చేసిన ఐరన్ ఓర్, ఫినిష్డ్ స్టీల్‌తో పాటు గుజరాత్‌కు ఐరెన్ పెల్లెట్స్ ఎగుమతుల్లో వృద్ధి సాధించగా, స్టీమ్‌కోల్డ్, కుకింగ్ కోల్ రవాణా గణనీయంగా తగ్గాయి. 2019–20లో 2,099 నౌకలు పోర్టుకు రాగా 2020–21లో 2,040 నౌకలు వచ్చాయి.
► రైల్వే ద్వారా చేసిన కార్గో సరుకు రవాణాలో ఈ ఏడాది ఒక శాతం వృద్ధి సాధించాం. గతేడాది 32.13 మి.టన్నుల సరుకు (9,174 ర్యాక్స్) హ్యాండిల్ చేయగా ఈ ఏడాది అత్యధికంగా 32.35 మి.టన్నులు (9,635 ర్యాక్స్) హ్యాండిల్ చేశాం.
► పోర్టు జెట్టీల సామర్థ్యం పెరిగేలా ఆధునికీకరించడంతో పాటు జెట్టీల యాంత్రీకరణకు రూ.650 కోట్లతో పనులు చేపడుతున్నాం. వెస్ట్‌క్యూ (డబ్ల్యూ.క్యూ)–7, డబ్ల్యూ.క్యూ–8 జెట్టీల సామర్థ్యాన్ని రూ.300 కోట్లతోనూ, రూ.150 కోట్లతో ఈక్యూ–7 జెట్టీ యాంత్రీకరణ పనులు నిర్వహిస్తున్నాం.
► చమురు రవాణాకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఓఆర్–1, ఓఆర్–2 బెర్తుల అభివృద్ధి పనులు కూడా రూ.168కోట్లతో చురుగ్గా సాగుతున్నాయి.
► కాలుష్య రహిత ఎగుమతి, దిగుమతుల్ని ప్రోత్సహించేందుకు రూ.633.11 కోట్లతో కంటైనర్ టెర్మినల్ విస్తరణ పనులు డిసెంబర్ 2021 నాటికి పూర్తవుతాయి. ఇది పూర్తయితే.. 5.4 లక్షల కంటైనర్లు హ్యాండిల్ చేయవచ్చు.
► రూ.103 కోట్లతో క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణం చేపట్టనున్నాం. అనుమతులు వచ్చిన ఏడాదిలోపే టెర్మినల్ పనులు పూర్తిచేసి క్రూయిజ్ టూరిజం కార్యకలాపాలు ప్రారంభిస్తాం. దీంతో సముద్ర విహారం విశాఖ వాసులకు చేరువవ్వడమే కాక అంతర్జాతీయ పర్యాటకం కూడా అభివృద్ధి చెందుతుంది.
► ఏడాది కాలంగా అదానీకి కేటాయించిన టెర్మినల్‌లో కార్యకలాపాలు జరగకపోవడంతో పోర్టు ఆదాయం కోల్పోతోంది. ఇది ప్రస్తుతం ఆర్బిట్రేషన్‌లో ఉంది. విచారణ పూర్తయ్యాక ఆ టెర్మినల్‌ను పోర్టు ఆధీనంలోకి తీసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తాం.
ప్రపంచ వాణిజ్యానికి కేరాఫ్‌గా విశాఖ పోర్టు
Published Sun, Apr 4 2021 3:42 AM | Last Updated on Sun, Apr 4 2021 8:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment