హ్యాండ్లింగ్.. వెరీ లేట్.!
పోర్టులో రోజుల తరబడి నిలిచిపోతున్న షిప్స్
అస్తవ్యస్తంగా మారిన కార్గో హ్యాండ్లింగ్
బెర్తులు కేటాయింపులో ట్రాఫిక్ సిబ్బంది నిర్లక్ష్యం
వ్యవస్థలో లోపాలే కారణమంటూ కుంటిసాకులు
కొత్త ట్రక్ పార్కింగ్ టెర్మినల్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ట్రేడర్లు
సాక్షి, విశాఖపట్నం: నెల రోజుల క్రితం వరకూ మేజర్ పోర్టులతో పోటీ పడుతూ దూసుకుపోతున్న విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ).. ఇప్పుడు చతికలపడుతోంది. సరకు హ్యాండ్లింగ్‌లో వరుస రికార్డులు సృష్టించిన పోర్టు.. ఇప్పుడు అదే సరకు రవాణా విషయంలో నీలి సముద్రమంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ట్రాఫిక్ విభాగ వైఖరి కారణంగా కార్గో హ్యాండ్లింగ్ కోసం బెర్తుల కేటాయింపుల్లో నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ట్రేడర్లు మొరపెట్టుకుంటున్నా తమకేమీ పట్టనట్లుగా పోర్టు అధికారులు వ్యవహరిస్తుండటంతో హ్యాండ్లింగ్ క్రమంగా కుంటుపడుతోంది.
ఒకే నెలలో అత్యధిక సరకు హ్యాండ్లింగ్.. ఏడాది వ్యవధిలో అత్యధికంగా కోల్ కోక్ దిగుమతి.. భారీగా క్రూడ్ ఆయిల్ నిర్వహణ.. కంటైనర్ల ఎగుమతిలో సరికొత్త రికార్డు.. రెండు మూడు నెలల క్రితం.. పోర్టు ఖాతాలో జమ అయిన రికార్డులివీ. సరకు రవాణా విభాగంలో దేశంలోని మేజర్ పోర్టుల్లో కొన్నింటికి సాధ్యం కాని రికార్డులను సైతం తన ఖాతాలో జమ చేసుకున్న విశాఖపట్నం పోర్టు అథారిటీ ప్రస్తుతం నెమ్మదిస్తోంది. ట్రాఫిక్ సిబ్బంది నిర్లక్ష్యం అధికారుల అలసత్వం కారణంగా హ్యాండ్లింగ్ చాలా ఆలస్యంగా సాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పోర్టుకు చేరుకున్న కార్గో షిప్‌లకు సరైన బెర్తింగ్ ఇవ్వడంలో సంబంధిత విభాగాధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా వచ్చిన షిప్‌లు బెర్తింగ్ కాకపోవడం సరకు గోదాములకు చేరుకోకపోవడం కొత్త షిప్‌లకు బెర్తులు దొరక్కపోవడంతో పోర్టులో గజిబిజి వాతావరణం నెలకొంది.
కొత్త చిక్కులు తెచ్చిన ట్రక్ పార్కింగ్ టెర్మినల్
ఈ ఏడాది సరకు హ్యాండ్లింగ్ 90 మిలియన్ మెట్రిక్ టన్నులు దాటాలంటూ పోర్టు చైర్మన్ లక్ష్యాన్ని నిర్దేశించినా ఆ పరిస్థితులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ముఖ్యంగా పోర్టు ఇటీవల రూ.40 కోట్ల వ్యయంతో అందుబాటులోకి తీసుకొచ్చిన ట్రక్‌పార్కింగ్ టెర్మినల్ కారణంగా ట్రేడర్లు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ టెర్మినల్ పోర్టుకు లాభాలు తీసుకొస్తుందే తప్ప.. సరకు రవాణాకు పెద్దగా ఒరిగిందేమీ కనిపించడం లేదు. పోర్టు ఏరియాకు సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఈ ట్రక్ టెర్మినల్ ఉంది. ఒక ట్రక్‌ని పార్కింగ్ చేయాలంటే రోజుకు రూ.150 వరకూ ట్రేడర్లు చెల్లించాల్సి ఉంటుంది. సరకు ఎగుమతి, దిగుమతి చేసుకోడానికి పోర్టుకు ట్రక్ వెళ్లాలంటే.. కచ్చితంగా టెర్మినల్ నుంచే బయల్దేరాలి. అయితే.. బెర్తింగ్ విషయంలో ట్రాఫిక్ విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం వల్ల.. రెండు మూడు రోజులు టెర్మినల్‌లో ట్రక్‌లు ఉండాల్సి వస్తోంది.
ఫలితంగా.. ఒక్కో ట్రక్‌కు రూ.450 వరకూ చెల్లించడంతో పాటు 16 కిలోమీటర్ల మేర డీజిల్ అదనపు భారంగా మారుతోంది. ఈ కారణంగా.. వచ్చిన లాభాలన్నీ.. పోర్టుకే జమ చేయాల్సి వస్తోందంటూ స్టివడోర్స్ వాపోతున్నారు. మౌలిక సదుపాయాలపైనా కనీస దృష్టి సారించడం లేదని ఈ వ్యవహారాలను డిప్యూటీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా ఆయన పట్టించుకోవడం లేదంటూ ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ట్రాఫిక్ విభాగంపై చైర్మన్ దృష్టిసారిస్తే తప్ప.. పోర్టు బాగుపడదని విమర్శిస్తున్నారు. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే స్టివడోర్స్ అంతా పక్కనే ఉన్న గంగవరం పోర్టు వైపు అడుగులు వేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
రెండు మూడు రోజులైనా..
ఇటీవల కాలంలో రెండు మూడు రోజులైనా సరకుతో వచ్చిన షిప్‌లకు బెర్తులు ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. షిప్ వచ్చిందని హ్యాండ్లింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ట్రేడర్లు అడిగే వరకూ ట్రాఫిక్ విభాగాధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఇటీవల గుజరాత్ నుంచి వచ్చిన ఓ అధికారి ఈ వ్యవహారాలను పూర్తిగా విస్మరించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
స్టివడోర్లకు అందుబాటులోకి రావడం లేదని ఆయన లేకపోవడంతో దిగువ స్థాయి సిబ్బందికి అడుగుతున్నా సరైన స్పందన రావడం లేదంటూ వాపోతున్నారు. ఫలితంగా తీవ్ర నష్టాల్ని చవిచూస్తున్నామంటూ స్టివడోర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ట్రాఫిక్ విభాగంలో ఈ తరహా ఇబ్బందులు ఎప్పుడూ ఎదుర్కోలేదని స్టివడోర్స్ చెబుతున్నారు. ట్రాఫిక్ నిర్వహణ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం కూడా పోర్టు విస్మరించడం విస్మయానికి గురి చేస్తోందని ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment