గతంలో సంజీవరెడ్డి, పీవీ, ఎన్టీఆర్ జాతీయ రాజకీయాలను శాసించారు
జైపాల్‌రెడ్డి, వెంకయ్య నాయుడు కొంత నిలబెట్టారు
ఇప్పుడు తెలుగువారి అంశాల గురించి ఢిల్లీలో మాట్లాడేందుకు ఎవరూ కనిపించని స్థితి
గవర్నర్‌పేట్ టు గవర్నర్స్ హౌస్ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కాలక్రమంగా తగ్గుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘గతంలో సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు.
వారి తరువాత జైపాల్‌రెడ్డి, వెంకయ్య నాయుడు ఆ స్థాయిని కొంతవరకు నిలబెట్టారు. కానీ ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కనిపించడం లేదు. ఫుల్‌టైం బిజినెస్‌లు చేసేవాళ్లు రాజకీయాల్లోకి పార్ట్‌టైంగా రావడమే ఇందుకు కారణం కావొచ్చు. ఇది మన మనుగడకు, గుర్తింపునకు మంచి పరిణామం కాదు’అని సీఎం పేర్కొన్నారు.
మాజీ డీజీపీ, తమిళనాడు మాజీ గవర్నర్ పీఎస్ రామ్మోహన్‌రావు రచించిన ‘గవర్నర్‌పేట్ టు గవర్నర్స్ హౌస్’పుస్తకావిష్కరణ ఆదివారం సాయంత్రం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఢిల్లీలో తెలుగువారి అంశాల గురించి పార్లమెంటరీ వ్యవస్థలో మాట్లాడేందుకు, విజ్ఞప్తి చేసేందుకు ఎవరూ కనపించని పరిస్థితి నెలకొందన్నారు.
దేశ పరిపాలనలో మన పాత్ర ఉండాలి..
‘జాతీయ స్థాయిలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు. జాతీయ స్థాయిలో మన భాష రెండో స్థానంలో ఉన్నట్లుగానే దేశ పరిపాలనలో, నిర్ణయాల్లో మన పాత్ర ఉండాలి. గతంలో ప్రధాని పదవి ఉత్తరాది వారికి ఇస్తే రాష్ట్రపతి దక్షిణాది నుంచి అయ్యేవారు. ఇక్కడి వారు ప్రధాని అయితే ఉత్తరాది నేతకు రాష్ట్రపతి అవకాశం దక్కింది. అలాగే కేంద్ర కేబినేట్‌లోనూ గతంలో కనీసం ముగ్గురు కీలక మంత్రులు దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉండేవారు.
కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. కేంద్ర కేబినెట్‌లో మనవాళ్లను వెతికి చూసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. దీనికి కారణాలు విశ్లేషించి ఏం చర్యలు తీసుకోవాలన్నది అనుభవజు్ఞలైన రిటైర్డ్ అధికారులు రాజకీయాలకు అతీతంగా ఆలోచించి సూచించాలి. విలువైన సలహాలు, సూచనలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
జాతీయ స్థాయిలో మన ప్రాభవం చాటేలా మళ్లీ మనమంతా కలిసి ప్రయాణం మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది’అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కీలక అంశాలతో మాజీ గవర్నర్ రామ్మోహన్‌రావు రాసిన పుస్తకం పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా మారుతుందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
కీలక పరిణామాలను పుస్తకంలో ప్రస్తావించా: రామ్మోహన్‌రావు
తాను రచించిన పుస్తకం ఎన్నో వెలుగులోకి రాని చారిత్రక అంశాలకు వేదికగా నిలుస్తుందని తమిళనాడు మాజీ గవర్నర్ రామ్మెహన్‌రావు అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన కీలక పరిణామాలను ప్రస్తావించినట్లు పేర్కొన్నారు.
కేంద్ర మాజీ మంత్రి రంగయ్య నాయుడు ఐపీఎస్ అధికారిగా, రాజకీయనాయకుడిగా తన అనుభవాలు, నాటి పరిస్థితులను పంచుకున్నారు. కార్యక్రమంలో డీజీపీ రవిగుప్తా, ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ డీజీ శశాంక్ గోయల్, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లు, సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment