విశాఖ క్రూయిజ్ టెర్మినల్‌లో ఎగిరే పడవ (సీ ప్లేన్) ఎక్కి నేరుగా భాగ్యనగరంలోని హుస్సేన్ సాగర్ వద్ద దిగాలనుకుంటున్నారా.. ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా నది జెట్టీ నుంచి బయలుదేరి ట్రాఫిక్ బారిన పడకుండా నేరుగా విశాఖ వెళదామనుకుంటున్నారా.. బహుశా మీ కల త్వరలోనే సాకారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా విశాఖ పోర్ట్ ట్రస్ట్ భారీ ఏర్పాట్లు చేయాలనుకుంటోంది. ఇదే జరిగితే.. విశాఖ–హైదరాబాద్, విజయవాడ–విశాఖ, తిరుపతి–షిర్డీ మధ్య సీ ప్లేన్‌లో రయ్యిన దూసుకు పోయే అవకాశం కలుగుతుంది.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అటు నీటిలోను.. ఇటు రన్‌వే మీద ల్యాండ్ అయ్యేలా సీప్లేన్ సర్వీసులను ప్రారంభించాలనుకుంటోంది విశాఖ పోర్ట్ ట్రస్ట్ (వీపీటీ). దీని సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తోంది. సీప్లేన్ సర్వీసులు అందుబాటులోకి వస్తే మరింత వేగంగా.. నగరాల నడిబొడ్డున మధ్యలో విమానం ద్వారా దిగేందుకు అవకాశం ఏర్పడుతుంది.
ఇందుకోసం ఇప్పటికే విశాఖలో నిర్మిస్తున్న అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ నుంచి వీటి రాకపోకలకు వీలు కలగనుంది. ఇక ఆయా ప్రాంతాల్లో సీప్లేన్‌లు ల్యాండ్ అయ్యేందుకు వీలుగా జెట్టీలను నిర్మిస్తే సరిపోతుంది. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు విమానాశ్రయం నుంచి సిటీలోకి ప్రయాణించే సమయం కూడా తగ్గిపోనుంది.
సాధ్యాసాధ్యాలపై అధ్యయనం
వాస్తవానికి సీప్లేన్ సర్వీసుల్ని ప్రారంభించాలని రెండేళ్ల నుంచీ వీపీటీ యోచిస్తోంది. తాజాగా, విజయవాడ, రాజమండ్రి, నాగార్జునసాగర్, హుస్సేన్ సాగర్, చిలికా సరస్సు తదితర ప్రాంతాలకు సీప్లేన్ సర్వీసులను నడిపేందుకు అవకాశం ఉందని గుర్తించింది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, మినీరత్న కంపెనీ పవన్‌హాన్స్ సంస్థ సాధ్యాసాధ్యాలను నివేదిక రూపొందిస్తోంది. హుస్సేన్‌సాగర్, విజయవాడలోని ప్రకాశం బ్యారేజి, చిలికా సరస్సుతో పాటు తిరుపతి, షిర్డీ ప్రాంతాలకు కూడా డిమాండ్ ఉంటుందని అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే 200 హెక్టార్లలో 6 బెర్తుల్లో విస్తరించిన ఉన్న విశాఖ అవుటర్ హార్బర్ వద్ద రూ.96 కోట్లతో ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ మెరైన్ క్రూయిజ్ టెర్మినల్ (ఐఎంసీటీ)ని వీపీటీ అభివృద్ధి చేస్తోంది. వీటి పనులు ఏప్రిల్ 2023 నాటికి పూర్తి కానున్నాయి. ఇక్కడి నుంచి సీప్లేన్ సర్వీసులను నడిపేందుకు వీలు కలగనుంది. మరోవైపు తిరుపతి, షిర్డీలలోనూ నేరుగా రన్‌వేపై ఇవి ల్యాండ్ కానుండగా.. హుస్సేన్‌సాగర్, ప్రకాశం బ్యారేజి, చిలికా సరస్సు వంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా జెట్టీలు నిర్మిస్తే సరిపోతుందని భావిస్తున్నారు.
9 మంది నుంచి 19 మంది ప్రయాణించే వీలు
సాధారణంగా విమానాలు ఆకాశంలో చక్కర్లు కొడుతూ నేలపై ల్యాండ్ అవుతాయి. కానీ.. నేలమీద, నీటిమీద ల్యాండ్ అయ్యేలా తయారు చేసిన విమానాలనే సీ ప్లేన్స్ అని పిలుస్తారు. ఈ విమానాలు భూమిపైన, నీటిపైన కూడా టేకాఫ్ అవుతాయి. నీటిమీద ల్యాండ్ అవ్వడానికి స్కిడ్, నేలపై ల్యాండ్ అవ్వడానికి వీల్స్ ఉంటాయి. వీటి పరిమాణం చిన్నదిగా ఉండటం వలన పెద్ద పెద్ద విమానాలు చేరలేని ప్రాంతాలకు కూడా ఇవి వెళ్లే అవకాశం ఉంటుంది.
రెండు రకాల సీ ప్లేన్‌లు అందుబాటులో ఉండగా.. ట్విన్ ఇంజన్ ట్విన్ సీటర్‌లో విమానయాన సిబ్బందితో కలిపి 19 మంది, సింగిల్ సీటర్‌లో 9 మంది ప్రయాణించవచ్చు. ట్విన్ సీటర్ గంటకు 290 కిలోమీటర్ల వేగంతో, సింగిల్ సీటర్ 200 కి.మీ. వేగంతో నడపవచ్చు. వీటిని ఏరియల్ సర్వే తరహా కార్యక్రమాల కోసం నెమ్మదిగా నడిపితే నిరంతరాయంగా 4 గంటలపాటు, వేగంగా నడిపితే 2 గంటల పాటు నడుస్తాయి.
ఈ సర్వీసులను ప్రారంభించేందుకు ఏయే సంస్థలు ముందుకు వచ్చే అవకాశం ఉందన్న అంశంపైనా అధ్యయనం జరుగుతోంది. అయితే, విమాన ప్రయాణ ధరలతో పోలిస్తే ఇందులో ప్రయాణ వ్యయం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ సులభంగా, వేగంగా తనిఖీలతోపాటు నగరం మధ్యలో నేరుగా దిగేందుకు వీలుండటంతో విమానాశ్రయం నుంచి సిటీలోకి వెచ్చించాల్సిన రవాణా భారం తగ్గనుంది.
మరోవైపు సమయం కూడా ఆదా కానుంది. ఒకేసారి రన్‌వేపైనే కాకుండా నీటిలో కూడా ప్రయాణించేందుకు అవకాశం ఉండటంతో పర్యాటకంగా కూడా ఈ సీ ప్లేన్ సర్వీసులు ఆదరణ పొందుతాయన్న ఆశాభావాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
త్వరలో కన్సల్టెన్సీ ఏర్పాటు చేస్తాం
సీ ప్లేన్ నడపడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాంతీయ అనుసంధాన పథకం (ఉడాన్ స్కీమ్) ద్వారా నిధులు సమీకరించేందుకు ప్రయత్నిస్తున్నాం. దీనివల్ల రాయితీలు వస్తాయి. ఫీజిబులిటీ స్టడీ పూర్తి చేశాం. డీజీసీఏతో పాటు నేవీ, ఎయిర్‌పోర్టుతో పాటు ఇతర అనుమతులు తీసుకునేందుకు త్వరలోనే కన్సల్టెన్సీని ఏర్పాటు చేస్తాం.
క్రూయిజ్ టెర్మినల్ భవనం వద్ద ఒకటి, అవుటర్ హార్బర్‌లోని నీటిలో సీ ప్లేన్ ల్యాండ్ అయ్యేందుకు ఏరోడ్రోమ్‌లు ఏర్పాటు చేయనున్నాం. క్రూయిజ్ టెర్మినల్ సిద్ధమయ్యాక సీ ప్లేన్ సేవల్ని కూడా ఏకకాలంలో మొదలు పెట్టాలని భావిస్తున్నాం. పర్యాటక, వాణిజ్య అవసరాలకు అనుగుణంగా వీటిని నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
– కె.రామ్మోహన్‌రావు, చైర్మన్, విశాఖ పోర్ట్ ట్రస్ట్
Comments
Please login to add a commentAdd a comment