seaplane service
-
సీప్లేన్ ఏరోడ్రోమ్ నిబంధనల సడలింపు
కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సీప్లేన్ కార్యకలాపాల కోసం నిబంధనలను సరళీకృతం చేసింది. నాన్-షెడ్యూల్డ్ సంస్థలు సీప్లేన్ సేవలు నిర్వహించేలా అనుమతులను సవరించింది. ఏరోడ్రోన్ సర్టిఫికేట్ ప్రక్రియను సులభతరం చేసింది. ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీ పథకం ఉడాన్ పథకం కింద సీప్లేన్ కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ..‘సీప్లేన్ కార్యకలాపాలు పర్యాటకం అభివృద్ధికి దోహదం చేస్తాయి. గతంలో వీటి నిర్వహణకు ఉన్న నిబంధనలను సవరిస్తున్నాం. సాధారణంగా సీప్లేన్లు సముద్రంలో టేకాఫ్, ల్యాండ్ అవ్వాలంటే ఇప్పటివరకు ఉన్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిబంధనల ప్రకారం వాటర్‌డ్రోమ్ లైసెన్స్ తప్పనిసరి. కానీ ఇకపై ఈ లైసెన్స్ అవసరం లేకపోయినా టేకాఫ్, ల్యాండ్ అవ్వొచ్చు. కమర్షియల్ పైలట్ లైసెన్స్ (సీపీఎల్) కలిగినవారు నేరుగా సీప్లేన్ రేటింగ్లను పొందవచ్చు. దాంతో పైలట్ల కొరత తీరుతుంది. నాన్-షెడ్యూల్డ్ ఆపరేటర్లు సీప్లేన్ కార్యకలాపాలను నిర్వహించవచ్చు’ అన్నారు.ఇదీ చదవండి: ‘లెజెండ్స్’ సర్వీసు నిలిపేత‘గతంలో అండమాన్ & నికోబార్ దీవులతో పాటు గుజరాత్లో సీప్లేన్ కార్యకలాపాలు జరిగేవి. కానీ అవి ఎక్కువ కాలం కొనసాగలేదు. తిరిగి వీటిని ప్రారంభించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 100 మార్గాల్లో ఈ సీప్లేన్లు ఎగరనున్నాయి. ఇప్పటికే వీటికి అనువైన మార్గాలను కనుగొనాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరాం. అండమాన్ & నికోబార్, గుజరాత్, లక్షద్వీప్, గోవా, అస్సాం, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో విస్తరించి ఉన్న 18 ప్రదేశాల్లో వాటర్ సీప్లేన్ ఏరోడ్రోమ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది’ అని మంత్రి పేర్కొన్నారు. -
నీటి విమానాలూ వచ్చేస్తాయ్
విశాఖ క్రూయిజ్ టెర్మినల్‌లో ఎగిరే పడవ (సీ ప్లేన్) ఎక్కి నేరుగా భాగ్యనగరంలోని హుస్సేన్ సాగర్ వద్ద దిగాలనుకుంటున్నారా.. ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా నది జెట్టీ నుంచి బయలుదేరి ట్రాఫిక్ బారిన పడకుండా నేరుగా విశాఖ వెళదామనుకుంటున్నారా.. బహుశా మీ కల త్వరలోనే సాకారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా విశాఖ పోర్ట్ ట్రస్ట్ భారీ ఏర్పాట్లు చేయాలనుకుంటోంది. ఇదే జరిగితే.. విశాఖ–హైదరాబాద్, విజయవాడ–విశాఖ, తిరుపతి–షిర్డీ మధ్య సీ ప్లేన్‌లో రయ్యిన దూసుకు పోయే అవకాశం కలుగుతుంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అటు నీటిలోను.. ఇటు రన్‌వే మీద ల్యాండ్ అయ్యేలా సీప్లేన్ సర్వీసులను ప్రారంభించాలనుకుంటోంది విశాఖ పోర్ట్ ట్రస్ట్ (వీపీటీ). దీని సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తోంది. సీప్లేన్ సర్వీసులు అందుబాటులోకి వస్తే మరింత వేగంగా.. నగరాల నడిబొడ్డున మధ్యలో విమానం ద్వారా దిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇందుకోసం ఇప్పటికే విశాఖలో నిర్మిస్తున్న అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ నుంచి వీటి రాకపోకలకు వీలు కలగనుంది. ఇక ఆయా ప్రాంతాల్లో సీప్లేన్లు ల్యాండ్ అయ్యేందుకు వీలుగా జెట్టీలను నిర్మిస్తే సరిపోతుంది. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు విమానాశ్రయం నుంచి సిటీలోకి ప్రయాణించే సమయం కూడా తగ్గిపోనుంది. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం వాస్తవానికి సీప్లేన్ సర్వీసుల్ని ప్రారంభించాలని రెండేళ్ల నుంచీ వీపీటీ యోచిస్తోంది. తాజాగా, విజయవాడ, రాజమండ్రి, నాగార్జునసాగర్, హుస్సేన్ సాగర్, చిలికా సరస్సు తదితర ప్రాంతాలకు సీప్లేన్ సర్వీసులను నడిపేందుకు అవకాశం ఉందని గుర్తించింది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, మినీరత్న కంపెనీ పవన్‌హాన్స్ సంస్థ సాధ్యాసాధ్యాలను నివేదిక రూపొందిస్తోంది. హుస్సేన్‌సాగర్, విజయవాడలోని ప్రకాశం బ్యారేజి, చిలికా సరస్సుతో పాటు తిరుపతి, షిర్డీ ప్రాంతాలకు కూడా డిమాండ్ ఉంటుందని అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 200 హెక్టార్లలో 6 బెర్తుల్లో విస్తరించిన ఉన్న విశాఖ అవుటర్ హార్బర్ వద్ద రూ.96 కోట్లతో ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ మెరైన్ క్రూయిజ్ టెర్మినల్ (ఐఎంసీటీ)ని వీపీటీ అభివృద్ధి చేస్తోంది. వీటి పనులు ఏప్రిల్ 2023 నాటికి పూర్తి కానున్నాయి. ఇక్కడి నుంచి సీప్లేన్ సర్వీసులను నడిపేందుకు వీలు కలగనుంది. మరోవైపు తిరుపతి, షిర్డీలలోనూ నేరుగా రన్‌వేపై ఇవి ల్యాండ్ కానుండగా.. హుస్సేన్‌సాగర్, ప్రకాశం బ్యారేజి, చిలికా సరస్సు వంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా జెట్టీలు నిర్మిస్తే సరిపోతుందని భావిస్తున్నారు. 9 మంది నుంచి 19 మంది ప్రయాణించే వీలు సాధారణంగా విమానాలు ఆకాశంలో చక్కర్లు కొడుతూ నేలపై ల్యాండ్ అవుతాయి. కానీ.. నేలమీద, నీటిమీద ల్యాండ్ అయ్యేలా తయారు చేసిన విమానాలనే సీ ప్లేన్స్ అని పిలుస్తారు. ఈ విమానాలు భూమిపైన, నీటిపైన కూడా టేకాఫ్ అవుతాయి. నీటిమీద ల్యాండ్ అవ్వడానికి స్కిడ్, నేలపై ల్యాండ్ అవ్వడానికి వీల్స్ ఉంటాయి. వీటి పరిమాణం చిన్నదిగా ఉండటం వలన పెద్ద పెద్ద విమానాలు చేరలేని ప్రాంతాలకు కూడా ఇవి వెళ్లే అవకాశం ఉంటుంది. రెండు రకాల సీ ప్లేన్లు అందుబాటులో ఉండగా.. ట్విన్ ఇంజన్ ట్విన్ సీటర్‌లో విమానయాన సిబ్బందితో కలిపి 19 మంది, సింగిల్ సీటర్‌లో 9 మంది ప్రయాణించవచ్చు. ట్విన్ సీటర్ గంటకు 290 కిలోమీటర్ల వేగంతో, సింగిల్ సీటర్ 200 కి.మీ. వేగంతో నడపవచ్చు. వీటిని ఏరియల్ సర్వే తరహా కార్యక్రమాల కోసం నెమ్మదిగా నడిపితే నిరంతరాయంగా 4 గంటలపాటు, వేగంగా నడిపితే 2 గంటల పాటు నడుస్తాయి. ఈ సర్వీసులను ప్రారంభించేందుకు ఏయే సంస్థలు ముందుకు వచ్చే అవకాశం ఉందన్న అంశంపైనా అధ్యయనం జరుగుతోంది. అయితే, విమాన ప్రయాణ ధరలతో పోలిస్తే ఇందులో ప్రయాణ వ్యయం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ సులభంగా, వేగంగా తనిఖీలతోపాటు నగరం మధ్యలో నేరుగా దిగేందుకు వీలుండటంతో విమానాశ్రయం నుంచి సిటీలోకి వెచ్చించాల్సిన రవాణా భారం తగ్గనుంది. మరోవైపు సమయం కూడా ఆదా కానుంది. ఒకేసారి రన్‌వేపైనే కాకుండా నీటిలో కూడా ప్రయాణించేందుకు అవకాశం ఉండటంతో పర్యాటకంగా కూడా ఈ సీ ప్లేన్ సర్వీసులు ఆదరణ పొందుతాయన్న ఆశాభావాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. త్వరలో కన్సల్టెన్సీ ఏర్పాటు చేస్తాం సీ ప్లేన్ నడపడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాంతీయ అనుసంధాన పథకం (ఉడాన్ స్కీమ్) ద్వారా నిధులు సమీకరించేందుకు ప్రయత్నిస్తున్నాం. దీనివల్ల రాయితీలు వస్తాయి. ఫీజిబులిటీ స్టడీ పూర్తి చేశాం. డీజీసీఏతో పాటు నేవీ, ఎయిర్‌పోర్టుతో పాటు ఇతర అనుమతులు తీసుకునేందుకు త్వరలోనే కన్సల్టెన్సీని ఏర్పాటు చేస్తాం. క్రూయిజ్ టెర్మినల్ భవనం వద్ద ఒకటి, అవుటర్ హార్బర్లోని నీటిలో సీ ప్లేన్ ల్యాండ్ అయ్యేందుకు ఏరోడ్రోమ్‌లు ఏర్పాటు చేయనున్నాం. క్రూయిజ్ టెర్మినల్ సిద్ధమయ్యాక సీ ప్లేన్ సేవల్ని కూడా ఏకకాలంలో మొదలు పెట్టాలని భావిస్తున్నాం. పర్యాటక, వాణిజ్య అవసరాలకు అనుగుణంగా వీటిని నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. – కె.రామ్మోహన్రావు, చైర్మన్, విశాఖ పోర్ట్ ట్రస్ట్ -
వారణాసి నుంచి వచ్చేస్తున్నాయ్..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో స్లీ ప్లేన్ సర్వీసుల ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోని గంగా నది నుంచే శ్రీకారం చుట్టనున్నారు. భారత్‌లో తొలి రెగ్యులర్ సీప్లేన్ సర్వీస్ వారణాసి నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉందని స్పైస్‌జెట్ ఛైర్మన్ అజయ్ సింగ్ చెప్పారు. నీటిలో, భూమిపై ల్యాండ్ కాగల ఈ తరహా విమానాలను వచ్చే ఏడాది నుంచి ప్రవేశపెడతామని లక్నో వంటి ప్రాంతాలకు సీప్లేన్ సర్వీసులు నడుపుతామని అన్నారు. డిసెంబర్ 9న ముంబయి ఎయిర్పోర్ట్ నుంచి గిర్గామ్ చౌపట్టీ వరకూ సీప్లేన్ డెమోను స్పైస్‌జెట్ చేపట్టింది. అయితే మూడు రోజుల అనంతరం అహ్మదాబాద్‌లో ప్రధాని మోదీ సీప్లేన్ ఉపయోగించిన తర్వాత దీనికి ప్రచారం లభించింది. సీప్లేన్ల వాడకంపై పౌరవిమానయాన శాఖ మార్గదర్శకాలు జారీ చేసిన అనంతరం ప్రధాని నియోజకవర్గం నుంచే సీప్లేన్ సర్వీసులు ప్రారంభం కానుండటం గమనార్హం. సీప్లేన్ సర్వీసులను లాభదాయకంగా నిర్వహించడమే కీలకమని ఈ దిశగా తాము కసరత్తు సాగిస్తున్నామని అజయ్ సింగ్ తెలిపారు. ఒక్కో సీప్లేన్‌కు దాదాపు రూ. 3 కోట్లు పైగా వ్యయమవుతుందని, తొలి దశలో 100 విమానాలకు తాము ఆర్డర్ చేశామని చెప్పారు. తమ రాష్ట్రాల్లో ఈ సేవలు అందించాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమను సంప్రదించాయని చెప్పుకొచ్చారు. -
ఫిబ్రవరిలోనే సీ ప్లేన్ సేవలు
సాక్షి, ముంబై: అంతా సవ్యంగా సాగితే ఫిబ్రవరిలో సముద్రమార్గం మీదుగా విమాన (సీ ప్లేన్) సేవలు ప్రారంభమయ్యే అవకాశముంది. బీపీటీ తప్ప మిగతా అన్ని శాఖల నుంచి అనుమతి వచ్చిందని మెహెర్ కంపెనీ ఎండీ సిద్ధార్థ్ వర్మ చెప్పారు. దీని నుంచి కూడా అనుమతి లభిస్తే తొలి విడతలో జుహూ సముద్ర తీరం నుంచి గిర్గావ్ (చర్నిరోడ్) చౌపాటి వరకు ఫిబ్రవరి నుంచి సీ ప్లేన్ సేవలు ప్రారంభిస్తామని తెలిపారు. ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.750 చార్జీ వసూలు చేయాలని ఆలోచనలో ఉన్నామన్నారు. ‘ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోకుండా సమయానికి తమ గమ్యస్థానం చేరుకోవాలంటే ముంబైకర్లకు ఈ సీ ప్లేన్ సర్వీసులు ఎంతో దోహదపడతాయి. ఈ సేవలకి ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తుంద’ని వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలో బెస్ట్ బస్సులు, ట్యాక్సీలు, ఆటోలు, చివరకు లోకల్ రైళ్లు కూడా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కిక్కిరిసి ఉంటున్నాయి. వీటి నుంచి ముంబైకర్లకు విముక్తి కలిగించాలనే ఉద్దేశంతో సీ ప్లేన్ సేవలు ప్రారంభించాలని కొన్ని సంవత్సరాల క్రితం మెహెర్ కంపెనీ భావించింది. దీనికోసం పర్యావరణ, బాంబే పోర్టు ట్రస్టు (బీపీటీ), నావికా దళం, భద్రత తదితర శాఖల అనుమతి కోరింది. ఇందులో బాంబే పోర్టు ట్రస్టు మినహా మిగతా శాఖల నుంచి ఇటీవలే అనుమతి లభించింది. త్వరలో బీపీటీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశాలున్నాయి. దీంతో ఫిబ్రవరిలో ఈ సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. సాధారణంగా రోడ్డు మార్గం మీదుగా జుహూ నుంచి గిర్గావ్ చేరుకోవాలంటే కనీసం గంటన్నరకుపైగా సమయం పడుతుంది. అదే సీ ప్లేన్‌లో వస్తే కేవలం ఏడు నిమిషాల్లోనే చేరుకోవచ్చు. జుహూ నుంచి ట్యాక్సీలో వస్తే (ట్రాఫిక్ జాంలో) కనీసం రూ.300-450 వరకు చార్జీలు అవుతాయి. దీన్నిబట్టి చూస్తే సీ ప్లేన్‌లో రావడంవల్ల వ్యాపారవేత్తలు, ఇతర రంగాల ప్రముఖుల విలువైన సమయం ఆదా కానుంది. చార్జీల్లో కూడా పెద్దగా తేడా లేదు. దీంతో ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చే అవకాశముందని సిద్ధార్థ్ వర్మ అభిప్రాయపడ్డారు. ఈ సేవలకు వచ్చే స్పందనను బట్టి మిగతా కీలక ప్రాంతాలకు కూడా సీ ప్లేన్ సర్వీసులను ప్రారంభిస్తామని తెలిపారు. భవిష్యత్‌లో ఇంధనం ధరలు పెరిగితే దాన్నిబట్టి చార్జీలు పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. ‘ప్రారంభ దశలో ఈ సేవలకు ‘సెస్నా-206’ నాలుగు సీట్ల సామర్థ్యమున్న విమానాలను వినియోగిస్తారు. ఫిబ్రవరి ఆఖరు వరకు సెస్నా-8 తొమ్మిది సీట్ల సామర్థ్యమున్న విమానాలను, ఆ తర్వాత ప్రయాణికుల సంఖ్య పెరిగితే 19 సీట్ల సామర్థ్యమున్న విమానాలను నడిపే యోచనలో ఉన్నామ’ని ఆయన చెప్పారు. జుహూ-గిర్గావ్ తర్వాత నాసిక్, లవాసా, లోనావాలా, అంబివ్యాలీ ప్రాంతాలకు కూడా నడుపుతామని స్పష్టం చేశారు. ఈ విమానాలు నీటిలో, నేలపై ఇలా ఎక్కడైనా ల్యాండింగ్ చేయడానికి వీలుంది. సాంకేతిక లోపంతో క్రాష్ ల్యాండింగ్ అయ్యే ప్రమాదం లేదు. దీంతో ప్రయాణికులకు ఎలాంటి హాని ఉండదని వర్మ ధీమా వ్యక్తం చేశారు.