కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సీప్లేన్ కార్యకలాపాల కోసం నిబంధనలను సరళీకృతం చేసింది. నాన్-షెడ్యూల్డ్ సంస్థలు సీప్లేన్ సేవలు నిర్వహించేలా అనుమతులను సవరించింది. ఏరోడ్రోన్ సర్టిఫికేట్ ప్రక్రియను సులభతరం చేసింది. ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీ పథకం ఉడాన్ పథకం కింద సీప్లేన్ కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ..‘సీప్లేన్ కార్యకలాపాలు పర్యాటకం అభివృద్ధికి దోహదం చేస్తాయి. గతంలో వీటి నిర్వహణకు ఉన్న నిబంధనలను సవరిస్తున్నాం. సాధారణంగా సీప్లేన్‌లు సముద్రంలో టేకాఫ్, ల్యాండ్ అవ్వాలంటే ఇప్పటివరకు ఉన్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిబంధనల ప్రకారం వాటర్‌డ్రోమ్ లైసెన్స్ తప్పనిసరి. కానీ ఇకపై ఈ లైసెన్స్ అవసరం లేకపోయినా టేకాఫ్, ల్యాండ్ అవ్వొచ్చు. కమర్షియల్ పైలట్ లైసెన్స్ (సీపీఎల్) కలిగినవారు నేరుగా సీప్లేన్ రేటింగ్‌లను పొందవచ్చు. దాంతో పైలట్ల కొరత తీరుతుంది. నాన్-షెడ్యూల్డ్ ఆపరేటర్లు సీప్లేన్ కార్యకలాపాలను నిర్వహించవచ్చు’ అన్నారు.
ఇదీ చదవండి: ‘లెజెండ్స్’ సర్వీసు నిలిపేత
‘గతంలో అండమాన్ & నికోబార్ దీవులతో పాటు గుజరాత్‌లో సీప్లేన్ కార్యకలాపాలు జరిగేవి. కానీ అవి ఎక్కువ కాలం కొనసాగలేదు. తిరిగి వీటిని ప్రారంభించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 100 మార్గాల్లో ఈ సీప్లేన్‌లు ఎగరనున్నాయి. ఇప్పటికే వీటికి అనువైన మార్గాలను కనుగొనాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరాం. అండమాన్ & నికోబార్, గుజరాత్, లక్షద్వీప్, గోవా, అస్సాం, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో విస్తరించి ఉన్న 18 ప్రదేశాల్లో వాటర్ సీప్లేన్ ఏరోడ్రోమ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది’ అని మంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment