seaplane
-
సీప్లేన్ ఏరోడ్రోమ్ నిబంధనల సడలింపు
కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సీప్లేన్ కార్యకలాపాల కోసం నిబంధనలను సరళీకృతం చేసింది. నాన్-షెడ్యూల్డ్ సంస్థలు సీప్లేన్ సేవలు నిర్వహించేలా అనుమతులను సవరించింది. ఏరోడ్రోన్ సర్టిఫికేట్ ప్రక్రియను సులభతరం చేసింది. ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీ పథకం ఉడాన్ పథకం కింద సీప్లేన్ కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ..‘సీప్లేన్ కార్యకలాపాలు పర్యాటకం అభివృద్ధికి దోహదం చేస్తాయి. గతంలో వీటి నిర్వహణకు ఉన్న నిబంధనలను సవరిస్తున్నాం. సాధారణంగా సీప్లేన్లు సముద్రంలో టేకాఫ్, ల్యాండ్ అవ్వాలంటే ఇప్పటివరకు ఉన్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిబంధనల ప్రకారం వాటర్‌డ్రోమ్ లైసెన్స్ తప్పనిసరి. కానీ ఇకపై ఈ లైసెన్స్ అవసరం లేకపోయినా టేకాఫ్, ల్యాండ్ అవ్వొచ్చు. కమర్షియల్ పైలట్ లైసెన్స్ (సీపీఎల్) కలిగినవారు నేరుగా సీప్లేన్ రేటింగ్లను పొందవచ్చు. దాంతో పైలట్ల కొరత తీరుతుంది. నాన్-షెడ్యూల్డ్ ఆపరేటర్లు సీప్లేన్ కార్యకలాపాలను నిర్వహించవచ్చు’ అన్నారు.ఇదీ చదవండి: ‘లెజెండ్స్’ సర్వీసు నిలిపేత‘గతంలో అండమాన్ & నికోబార్ దీవులతో పాటు గుజరాత్లో సీప్లేన్ కార్యకలాపాలు జరిగేవి. కానీ అవి ఎక్కువ కాలం కొనసాగలేదు. తిరిగి వీటిని ప్రారంభించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 100 మార్గాల్లో ఈ సీప్లేన్లు ఎగరనున్నాయి. ఇప్పటికే వీటికి అనువైన మార్గాలను కనుగొనాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరాం. అండమాన్ & నికోబార్, గుజరాత్, లక్షద్వీప్, గోవా, అస్సాం, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో విస్తరించి ఉన్న 18 ప్రదేశాల్లో వాటర్ సీప్లేన్ ఏరోడ్రోమ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది’ అని మంత్రి పేర్కొన్నారు. -
సమస్యల నుంచి తప్పించుకునేందుకే సీప్లేన్ విహారం
సాక్షి, అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీప్లేన్‌ను ఉపయోగించడంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. ప్రధాని సీప్లేన్‌లో ప్రయాణించాలనుకోవడంలో తప్పులేదని, గుజరాత్ ప్రజలకు 22 ఏళ్ల పాలనలో బీజేపీ ఏం చేసిందనే ప్రశ్నకు దూరంగా ఉండేందుకే ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, గుజరాత్ సీఎం విజయ్ రూపాని కేవలం 5 నుంచి 10 మంది సన్నిహితులకు ఉపయోగపడే అభివృద్ధి నమూనాను చేపట్టారని, సామాన్యుల సంక్షేమాన్ని విస్మరించారని ఆరోపించారు. ప్రధాని తన ర్యాలీల్లో రైతుల సమస్యలు, అవినీతిని ప్రస్తావించడం లేదని గుజరాతీలు గ్రహించారని, ప్రజల్లో పాలక సర్కార్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. బీజేపీ తమను మరింత గట్టిగా ప్రతిఘటిస్తుందనుకున్నామని, అయితే ఆ పార్టీ తీరు తనను విస్మయానికి గురిచేసిందని రాహుల్ అన్నారు. తాను ఎప్పుడు దేవాలయాన్ని సందర్శించినా గుజరాతీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రార్ధనలు చేశానన్నారు. -
తాజ్ మహల్ చూడాలా? ఇక ఈ దారైతే బెటరేమో!
దేశరాజధాని ఢిల్లీ నుంచి ఆగ్రాకు ప్రయాణించే యాత్రికులు కలలో కూడా ఊహించని విధంగా ఆ మార్గం మారనుంది. యమునా నది మీద సీ-ప్లేన్ సర్వీసును తెచ్చి ఇరు ప్రాంతాలను కలిపేందుకు కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. వచ్చే మూడు నెలల్లో ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. సీ-ప్లేన్లను ఈ మార్గంలో ఉపయోగించడానికి ఇప్పటికే ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అనుమతి కోరామని, ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను కూడా ఇవ్వాలని తెలిపినట్లు వివరించారు. మార్చి 11న భారతీయ వాటర్ వేస్ బిల్లును పార్లమెంటులో ఆమోదించిన తర్వాత రవాణా వ్యవస్థను బలపరచడానికి ప్రభుత్వం చేపట్టిన తొలి ప్రాజెక్టు ఇది. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న నీటివనరులపై దాదాపు 106 రవాణా వ్యవస్థలను నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఒక్క యమున మీదే కాకుండా మిగతా నదులపై హోవర్ క్రాఫ్ట్, సీ-బస్ లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఉత్తరప్రదేశ్ లో చేపట్టనున్న ప్రాజెక్టులను ఢిల్లీ డెవలప్ మెంట్ అథారిటీ(డీడీఏ), ఢిల్లీ జల్ బోర్డు, రవాణా శాఖలు చేపడతాయని గడ్కారీ తెలిపారు. కెనడా, రష్యాలకు చెందిన కొన్ని కంపెనీలు ఇప్పటికే సీ-ప్లేన్లను అందించేందుకు ముందుకు వచ్చినట్లు వివరించారు. -
మూడు పుణ్యక్షేత్రాలకు త్వరలో సీ ప్లేన్ సేవలు
ముంబై: షిర్డీవాసులతోపాటు సాయిభక్తులకు శుభవార్త. ఈ నెల 19వ తేదీనుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీకి సమీపంలోని ములా డ్యాంతోపాటు శనిసింగణాపూర్, మెహరాబాద్లకు సీ ప్లేన్ సేవలు ప్రారంభం కానున్నాయి. మహారాష్ట్ర పర్యాటక సంస్థ సహకారంతో మారీటైమ్ ఎనర్జీ హెలీ ఎయిర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఈహెచ్‌ఏఐఆర్) సంస్థ ఈ సేవలను అందించనుంది. ఈ విషయాన్ని ఎంఈహెచ్‌ఏఐఆర్ డెరైక్టర్ సిద్ధార్థ్ వర్మ వెల్లడించారు. అహ్మద్‌నగర్ జిల్లాలోని ములా డ్యాంవరకు ఈ సేవలను అందిస్తామని, అందువల్ల సాయి భక్తులు వీలైనంత తక్కువ సమయంలో షిర్డీకి చేరుకోగలుగుతారన్నారు. గత నెల 25వ తేదీన ముంబై నుంచి లోణావాల మధ్య తాము ప్రారంభించిన సీప్లేన్ సేవలకు విశేష స్పందన లభించిందన్నారు. తాము ములా డ్యాం వరకూ ప్రారంభించనున్న తాజా సేవల వల్ల ఆయా పుణ్యక్షేత్రాలకు భక్తులు అత్యంత తక్కువ సమయంలోనే చేరుకుంటారన్నారు. దీంతోపాటు నాసిక్‌లోని గంగాపూర్ డ్యాం, మహాబలేశ్వర్ సమీపంలోని ధూమ్ డ్యాంలకు కూడా త్వరలోనే సీ ప్లేన్ సేవలను ప్రారంభిస్తామన్నారు.