దేశరాజధాని ఢిల్లీ నుంచి ఆగ్రాకు ప్రయాణించే యాత్రికులు కలలో కూడా ఊహించని విధంగా ఆ మార్గం మారనుంది. యమునా నది మీద సీ-ప్లేన్ సర్వీసును తెచ్చి ఇరు ప్రాంతాలను కలిపేందుకు కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. వచ్చే మూడు నెలల్లో ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. సీ-ప్లేన్లను ఈ మార్గంలో ఉపయోగించడానికి ఇప్పటికే ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అనుమతి కోరామని, ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను కూడా ఇవ్వాలని తెలిపినట్లు వివరించారు.
మార్చి 11న భారతీయ వాటర్ వేస్ బిల్లును పార్లమెంటులో ఆమోదించిన తర్వాత రవాణా వ్యవస్థను బలపరచడానికి ప్రభుత్వం చేపట్టిన తొలి ప్రాజెక్టు ఇది. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న నీటివనరులపై దాదాపు 106 రవాణా వ్యవస్థలను నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఒక్క యమున మీదే కాకుండా మిగతా నదులపై హోవర్ క్రాఫ్ట్, సీ-బస్ లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఉత్తరప్రదేశ్ లో చేపట్టనున్న ప్రాజెక్టులను ఢిల్లీ డెవలప్ మెంట్ అథారిటీ(డీడీఏ), ఢిల్లీ జల్ బోర్డు, రవాణా శాఖలు చేపడతాయని గడ్కారీ తెలిపారు. కెనడా, రష్యాలకు చెందిన కొన్ని కంపెనీలు ఇప్పటికే సీ-ప్లేన్లను అందించేందుకు ముందుకు వచ్చినట్లు వివరించారు.