సాక్షి, అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీప్లేన్‌ను ఉపయోగించడంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. ప్రధాని సీప్లేన్‌లో ప్రయాణించాలనుకోవడంలో తప్పులేదని, గుజరాత్ ప్రజలకు 22 ఏళ్ల పాలనలో బీజేపీ ఏం చేసిందనే ప్రశ్నకు దూరంగా ఉండేందుకే ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ, గుజరాత్ సీఎం విజయ్ రూపాని కేవలం 5 నుంచి 10 మంది సన్నిహితులకు ఉపయోగపడే అభివృద్ధి నమూనాను చేపట్టారని, సామాన్యుల సంక్షేమాన్ని విస్మరించారని ఆరోపించారు. ప్రధాని తన ర్యాలీల్లో రైతుల సమస్యలు, అవినీతిని ప్రస్తావించడం లేదని గుజరాతీలు గ్రహించారని, ప్రజల్లో పాలక సర్కార్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందన్నారు.
బీజేపీ తమను మరింత గట్టిగా ప్రతిఘటిస్తుందనుకున్నామని, అయితే ఆ పార్టీ తీరు తనను విస్మయానికి గురిచేసిందని రాహుల్ అన్నారు. తాను ఎప్పుడు దేవాలయాన్ని సందర్శించినా గుజరాతీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రార్ధనలు చేశానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment