సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం పోర్టు ట్రస్టు (వీపీటీ) కార్గో హ్యాండ్లింగ్‌లో గతేడాదికంటే 4 శాతం వృద్ధి సాధించింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో 61.02 మిలియన్ టన్నుల కార్గోను హ్యాండ్లింగ్ చేయగా ఈ ఏడాది (2017–18లో) 63.54 మిలియన్ టన్నులు చేయగలిగింది. ఇది గత సంవత్సరంకంటే 2.52 మిలియన్ టన్నులు అదనం.
అలాగే ర్యాంకింగులోనూ వీపీటీ పురోగతి సాధించింది. అలాగే 2017–18 సంవత్సరంలో రూ.250 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గత సంవత్సరం దేశంలోని పోర్టుల్లో విశాఖ పోర్టు ట్రస్టు 5వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది అది 4వ స్థానంలో నిలిచిందని వీపీటీ చైర్మన్ ఎం.టి.కృష్ణబాబు శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు.
స్టాకు యార్డులకు ఉక్కు రవాణా..
భారత ప్రభుత్వం కోస్టల్ షిప్పింగ్‌ను అభివృద్ధి చేయడంలో భాగంగా వీపీటీ.. విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉక్కును అహ్మదాబాద్, ముంబై, కొచ్చిల్లోని స్టాకు యార్డులకు రవాణా చేసేందుకు ఒప్పందం కుదిరిందన్నారు. ఇందులో భాగంగా 2.25 లక్షల టన్నుల ఉక్కును షిప్పుల్లో రవాణా జరుగుతుందని చెప్పారు. 2020 నాటికి విశాఖ పోర్టు పూర్తి సామర్థ్యం 133 మిలియన్ టన్నులకు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నామని, దీంతో నిర్వహణ సామర్థ్యం 75 నుంచి 80 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment