ముంబై: భారత సరిహద్దులో ‘అణు’ కలకలం రేగింది. చైనా నుంచి కరాచీ(పాకిస్థాన్) వెళ్తున్న ఓ నౌకను ముంబయి పోర్టులో భారత భద్రతా సిబ్బంది అడ్డుకుంది. అణు కార్యక్రమంలో వినియోగించే సరకును అందులో తరలిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారం మేరకే నౌకను నిలిపివేసినట్లు సమాచారం. జనవరిలోనే ఈ ఘటన జరిగినప్పటికీ.. ఈ వివరాలను శనివారం మీడియాకు వెల్లడించారు కస్టమ్స్ అధికారులు.
నౌకను నిలిపివేసిన తర్వాత.. డీఆర్‌డీవో(Defence Research and Development Organisation) క్షుణ్ణంగా పరిశీలించింది. అందులో ఇటలీలో తయారైన కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ మెషిన్(CNC)ని గుర్తించారు. పొరుగుదేశం తన అణు కార్యక్రమంలో దీనిని వినియోగించే అవకాశాలను తోసిపుచ్చలేమని ఈ సందర్భంగా డీఆర్‌డీవో వెల్లడించింది.
సీఎన్‌సీని కంప్యూటర్ ద్వారా నియంత్రించొచ్చు. అది అత్యంత కచ్చితత్వంతో ఫలితాన్ని ఇస్తుంది. దానిని ద్వంద్వ ప్రయోజనాలకు వినియోగిస్తారు అంటూ డీఆర్‌డీవో ప్రకటిచింది. గతంలో ఉత్తర కొరియా కూడా తన అణు కార్యక్రమంలో సీఎన్‌సీని ఉపయోగించిందని ఈ సందర్భంగా అధికారులు గుర్తు చేస్తున్నారు.
ఇక చైనా నుంచి పాక్‌కు రవాణా అవుతున్న ఇలాంటి మిలిటరీ గ్రేడ్ పరికరాలను స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. 2022లోను ఈతరహా సీజ్ చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment