
ఢిల్లీ: భారత వైమానిక దళం (ఐఏఎఫ్) అధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియాను కేంద్ర ప్రభుత్వం గురువారం నియమించింది. ప్రస్తుతం ఆయన వైమానిక దళానికి వైస్ చీఫ్‌గా సేవలందిస్తున్నారు. ఎయిర్‌ఫోర్స్ చీఫ్ బీఎస్ ధనోవా సెప్టెంబర్ 30న పదివి విరమణ అనంతరం ఆర్‌కేఎస్ భదౌరియా ఈ పదవిని చేపట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఎయిర్ ఫోర్స్ చీఫ్ బీఎస్ ధనోవా విదవీ విరమణ పొందే రోజు భదౌరియా కూడా పదవి విరమణ పొందాల్సి ఉంది. కానీ, తాను ఇప్పుడు వైమానికి దళానికి చీఫ్‌గా ఎన్నికవడంతో.. భదౌరియా 62 ఏళ్లు వచ్చేవరకు మరో రెండేళ్ల పాటు భారత ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా కొనసాగనున్నారు. ఆయన పుణె నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వవిద్యార్థి.. దీంతోపాటు 26 భిన్నమైన విమానాలను 4250 గంటల పాటు నడిపిన అనుభవం ఉంది.
భదౌరియా ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్, సదరన్ ఎయిర్ కమాండ్‌గా మార్చి 2017 నుంచి ఆగస్టు 2018 వరకు పనిచేశారు. తర్వాత శిక్షణా కమాండ్‌గా.. ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా కూడా సేవలందించారు. ప్రస్తుతం వైమానికదళానికి వైస్ చీఫ్‌గా పని చేస్తున్నారు. 36 ఏళ్ల తన సర్వీస్‌లో అతి విశిష్ట సేవ, వాయు సేన, పరమ్ విశిష్ట సేవ పతకాలను అందుకున్నారు. ఆయన ఈ ఏడాది జనవరిలో భారత రాష్ట్రపతికి గౌరవ సహాయకుడు ‘డి కాంపే’గా నియమితులయ్యారు. రాఫెల్ ఫైటర్ జెట్‌ను నడిపిన మొదటి భారత వైమానిక దళానికి నాయకత్వం వహించారు. జెట్ విమానాల కోసం ఫ్రాన్స్‌తో ఒప్పందం చేసుకోవడంలో భదౌరియా కీలకపాత్ర పోషించారు.