న్యూఢిల్లీ: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లవద్దని భారతీయులకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ మేరకు శుక్రవారం(ఏప్రిల్ 12) ఒక అడ్వైజరీ జారీ చేసింది. రానున్న 48 గంటల్లో ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఏ క్షణాన్నైనా దాడి చేయొచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో భారత్ తన పౌరులను అలర్ట్ చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్‌లో ఇప్పటికే ఉన్న భారతీయలు అక్కడున్న భారత రాయబార కార్యాలయాలను సంప్రదించాలని కోరింది.
రెండు దేశాల్లో ఉన్న భారత పౌరులు తమ భద్రత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతేనే బయట తిరగాలని సూచించింది. డజన్ల కొద్దీ క్రూయిజ్ మిసైళ్లు, వందల కొద్దీ డ్రోన్లతో ఇరాన్, ఇజ్రాయెల్‌పై విరుచుకుపడే అవకాశాలున్నాయని మీడియా కథనాలు వెలువడుతుండటం ప్రపంచవ్యాప్తంగా కలవరం రేపుతోంది.
ఇటీవల సిరియాలోని ఇరాన్ కాన్సులేట్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఆ దేశ ఆర్మీ టాప్ కమాండర్‌తో పాటు మొత్తం ఏడుగురు అధికారులు మృతి చెందారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై దాడి చేయక తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రకటించారు. అనవసర ప్రయాణాలు చేయవద్దని ఇప్పటికే ఇజ్రాయెల్‌లోని అమెరికన్ ఎంబసీ తన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులను కోరింది.
ఇదీ చదవండి.. ఇజ్రాయెల్‌కు టెన్షన్.. ఇరాన్ సంచలన ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment