సాక్షి, అమరావతి: రాష్ట్ర పోర్టులపై హక్కులను లాక్కునే విధంగా తీసుకొస్తున్న ఇండియన్ పోర్టు బిల్–2020ను ఏపీ మారిటైమ్ బోర్డు తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ బిల్లు అమల్లోకి వస్తే 974 కి.మీ. పొడవున సుదీర్ఘ తీరప్రాంతం కలిగిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, కొత్తగా సుమారు రూ.10,000 కోట్లతో నిర్మించతలపెట్టిన పోర్టుల నిర్మాణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో ఎన్.పి.రామకృష్ణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో కేంద్ర ప్రభుత్వం 13 మేజర్ పోర్టులను నిర్వహిస్తుండగా, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు 160 మైనర్ పోర్టులు కలిగి ఉన్నాయి.
ఇప్పుడు ఈ బిల్లు అమల్లోకి వస్తే 13 మేజర్ పోర్టులకు ఒక్కొక్క రెగ్యులేటరీ వ్యవస్థను ఏర్పాటు చేస్తారని, ఇదే సమయంలో దేశవ్యాప్తంగా మైనర్ పోర్టులన్నింటికీ కలిపి ఒకే ఒక రెగ్యులేటరీ వ్యవస్థను ఏర్పాటు చేయడం రాష్ట్ర పోర్టులపై వివక్ష చూపడమేనని రామకృష్ణారెడ్డి చెప్పారు. ఉమ్మడి జాబితా (కాంకరెంట్ లిస్ట్) ప్రకారం మేజర్ పోర్టులు కేంద్రం పరిధిలో ఉంటే మైనర్ పోర్టుల నిర్వహణ పూర్తిగా రాష్ట్ర పరిధిలోకి వస్తుందని, ఇప్పుడు కొత్త చట్టం ద్వారా మైనర్ పోర్టులపై అధికారాలు కేంద్రం తీసుకోవాలనుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులు ఉండగా, సుమారు రూ.10,000 కోట్లతో మరో మూడు పోర్టులను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే పాత పోర్టుల నిర్వహణకు అనుమతుల మంజూరులో జాప్యం జరగడంతో పాటు కొత్త పోర్టుల నిర్మాణంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
బిల్లును ఉపసంహరించుకోవాలి
దేశవ్యాప్తంగా పోర్టు వాణిజ్య లావాదేవీల్లో మైనర్ పోర్టులు 45 శాతం వాటాను కలిగి ఉండగా, రాష్ట్రంలో మూడు మైనర్ పోర్టుల ద్వారా ఏటా సుమారు 110 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరుగుతోంది. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో ఎప్పటి నుంచో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ మూడు పోర్టులు రెండేళ్లలో కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలని, లేకపోతే వాటి కార్యకలాపాలు నిలిపివేస్తామని చట్టంలో పేర్కొనడాన్ని ఏపీ మారిటైమ్ బోర్డు తీవ్రంగా తప్పుపట్టింది. రాష్ట్ర హక్కులను కాలరాసే ఈ బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలని, లేకపోతే కనీసం ఇప్పటికే ఉన్న పోర్టులను ఈ బిల్లు పరిధి నుంచి తప్పించాలంటూ కేంద్రానికి ఏపీ మారిటైమ్ బోర్డు లేఖ రాసింది.
రాష్ట్ర పోర్టులపై కేంద్ర పెత్తనమా?
Published Sun, Jan 24 2021 4:48 AM | Last Updated on Sun, Jan 24 2021 4:48 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment