న్యూఢిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌కు కెనడా పార్లమెంట్ సంతాపం ప్రకటించడంపై భారత ప్రభుత్వం శుక్రవారం(జూన్ 21) స్పందించింది. వేర్పాటువాదం, హింసను సమర్థించే చర్యలను వ్యతిరేకిస్తామని తెలిపింది. గతేడాది జూన్‌లో కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా బయట నిజ్జర్‌ను కొందరు దుండగులు కాల్చి చంపారు.
ఈ ఘటన వెనుక భారత ‘రా’ ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య దౌత్య విభేదాలు ఏర్పడ్డాయి. ట్రూడో ఆరోపణలను అప్పట్లో భారత్ ఖండించింది. హత్యకు గురై ఏడాది పూర్తయిన సందర్భంగా కెనడా ప్రభుత్వం ఆ దేశ పార్లమెంట్‌లో ఇటీవల నిజ్జర్‌కు నివాళులర్పించడం గమనార్హం.
ఓ దేశం ఉగ్రవాదిగా ప్రకటించడమే కాకుండా ఇంటర్‌పోల్ వాంటెడ్ జాబితాలో ఉన్న వ్యక్తి మృతికి దేశ పార్లమెంట్‌లో అంజలి ఘటించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారంటూ సోషల్‌మీడియాలో నెటిజన్లు మండిపడ్డారు. మరోవైపు వాంకోవర్‌లోని భారత రాయబార కార్యాలయం దీనికి తగిన కౌంటర్ కూడా ఇచ్చింది.
ఎయిర్ ఇండియాా కనిష్క విమానాన్ని గాల్లో పేల్చివేసి ఈ జూన్ 23కు 39 సంవత్సరాలు పూర్తవుతుంది. ఖలిస్తానీ తీవ్రవాదులు పెట్టిన బాంబుకు ఆ విమానం ముక్కలు కావడంతో 329 మంది మృతి చెందారు. ఆ రోజున వాంకోవర్‌లో ఉన్న ఎయిర్ ఇండియా మెమోరియల్ వద్ద సంతాప కార్యక్రమం నిర్వహించనున్నట్టు భారత రాయబార కార్యాలయం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment