వాట్సాప్ తరహాలో సొంతంగా సమాచారాన్ని పంచుకునే వేదికను రూపొందించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. మొదట్లో దీనిని ప్రభుత్వ విభాగాలు పరస్పరం సమాచారం పంచుకునేందుకు వాడాలని, కాలక్రమేణ ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆలోచిస్తున్నట్టు ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. చైనాకు చెందిన హువాయి కంపెనీపై అమెరికా నిషేధం విధించడం, అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో సురక్షితమైన సొంత చాటింగ్ ప్లాట్‌ఫారం రూపొందించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని వారు తెలిపారు.
హువాయ్‌ను నిషేధించాల్సిందిగా అమెరికా భారత్‌పై ఒత్తిడి తెస్తోందని, భద్రతా కారణాల రీత్యా ప్రస్తుతమున్న వాట్సాప్ వంటి వాటిపై ఆధారపడటం మంచిది కాదని ప్రభుత్వం భావిస్తోందన్నారు. భవిష్యత్తులో ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఉండటం కోసం సర్కారీ వాట్సాప్ పేరుతో సొంత వేదికను అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. ఈ సర్కారీ వాట్పాప్ ద్వారా పంపే సమాచారం, డేటా చోరికి గురయ్యే అవకాశం ఉండదని, ఈ సమాచారాన్ని నూరు శాతం భారత దేశంలోనే భద్రపరుస్తామని వారు తెలిపారు. ‘హువాయికి, అది తయారు చేసే హానర్ స్మార్ట్ ఫోన్ల పరిస్థితి ఏమయిందో చూడండి.అమెరికా ఆంక్షల వల్ల ఆ కంపెనీకి,ఫోన్లకు అమెరికా కంపెనీలు సాఫ్ట్‌వేర్‌ను సరఫరా చేయడం లేదు. ముందు ముందు ఏ కారణం చేతనయినా మన దేశంలో అమెరికా కంపెనీల నెట్‌వర్క్‌లను ఆపేయమని ఆ ప్రభు
త్వం ఆదేశించవచ్చు.అదే జరిగితే మన దేశంలో చాటింగ్ ప్లాట్‌ఫారాలన్నీ నిలిచిపోతాయి. ఆ ప్రమాదం రాకుండా చూడటానికే సొంత వాట్సాప్‌ను అభివృద్ధి చేయనున్నాం’అని ప్రభుత్వాధికారులు వివరించారు. సర్కారీ వాట్సాప్ వచ్చాక అధికారిక సమాచారాన్ని, డేటాను పంపేందుకు జి–మెయిల్, వాట్సాప్‌లను ఉపయోగించవద్దని అధికారులకు, ప్రభుత్వ సిబ్బందికి సూచించనున్నట్టు వారు తెలిపారు. అమెరికా కేంద్రంగా పని చేస్తున్న ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్‌నకు మన దేశంలో 20 కోట్లకు పైగా వినియోగదారులున్నారు.ఇటీవలి కాలంలో వాట్సాప్‌లో నకిలీ వార్తలు, భావోద్వేగాలను రెచ్చగొట్టే సమాచారం వ్యాప్తి చెందడం, దాంతో దేశంలో మూక హత్యల వంటివి జరగడం తెలిసిందే. దాంతో ప్రభుత్వం వాట్సాప్‌ను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటోంది.మన దేశానికి చెందిన డేటాను మన దేశంలోనే భద్రపరచాలని(డేటా లోకలైజేషన్) పట్టుబడుతోంది. దాన్ని అమెరికా కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సొంత వాట్సాప్ రూప కల్పనకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment