ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ: మహమ్మారి కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో శానిటైజర్లు, మాస్కులను అధిక ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. సాధారణ మాస్కును ఎనిమిది రూపాయల ధరకు మించి అమ్మకూడదని పేర్కొంది. అదే విధంగా 200 మిల్లీ లీటర్ల శానిటైజర్ ధర వంద రూపాయలకు మించి అమ్మవద్దని.. అంతకు తక్కువ పరిమాణం ఉన్న బాటిల్‌ను సైతం అదే నిష్పత్తిలో అమ్మాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 12 నాటికి ఉన్న ధర మించకూడదని ఆదేశించింది. ఈ మేరకు భారత ప్రభుత్వం శనివారం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీచేసింది.(ఆ రాష్ట్రం దాదాపు 40శాతం మూతపడినట్లే!)
ఐక్యంగా ఉన్నామని చాటేందుకే..
ప్రజల కోసమే ఆదివారం జనతా కర్ఫ్యూ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. మనమంతా ఐక్యంగా ఉన్నామని చాటడానికి ఇది ఉపయోగపడుతుందని.. అంతా కలిసి మహమ్మారి కరోనాను ఎదుర్కొందామని పిలుపునిచ్చింది. కరోనా ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్రాల ఆరోగ్యశాఖల కార్యదర్శులకు సూచనలు చేసినట్లు వెల్లడించింది. అయితే ప్రజలు కూడా సామాజిక దూరం పాటించి.. తమను తాము కాపాడుకోవాలని కోరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 111 ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయన్న ఆరోగ్యశాఖ... ప్రైవేట్ రంగంలోని ల్యాబ్‌లకు అనుమతిపై సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. రాష్ట్రాల అవసరాల మేరకు ల్యాబ్‌ల పెంపుపై పరిశీలిస్తున్నట్లు తెలిపింది. (కరోనా: 2 కోట్ల సబ్బులు ఉచితం, ధరల కోత)
అదే విధంగా కరోనా వ్యాప్తి గురించి వదంతులు నమ్మి భయాందోళనకు గురికావద్దని కేంద్ర ఆర్థికశాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఎలాంటి పరిస్ధితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొంది. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని.. అయితే అందరూ మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఎన్ 95 మాస్కులు ఆస్పత్రుల్లోనే ఉపయోగిస్తారని.. మాస్క్‌లకు సంబంధించి మార్గదర్శకాలను పాటించాలని ఆదేశించింది. సాధారణ మాస్కులు ఇంట్లోనూ తయారు చేసుకోవచ్చని పేర్కొంది. ఇక కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా... విపత్తు నిర్వహణ నిధుల వినియోగంపై రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించింది. జాతీయ ఆరోగ్య మిషన్ నిధులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. (కరోనా అలర్ట్: ఆ రాష్ట్రంలో 65 కేసులు)
Comments
Please login to add a commentAdd a comment