How Govt Evacuate Indians From Ukraine, Details Inside - Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ సుకూన్‌, రాహత్‌ బాటలో మరో సాహసం! వాట్‌ నెక్ట్స్‌ ?

Published Thu, Feb 24 2022 4:56 PM | Last Updated on Wed, Mar 2 2022 6:55 PM

How Govt Evacuate Indians From Ukraine Is It Like to be Operation Raahat or Sukoon - Sakshi

యుద్ధ సమయాల్లో విదేశాల్లో చిక్కుకున్న మన వాళ్లను కాపాడేందుకు భారత ప్రభుత్వం ఆ‍ర్మీ, ఎయిర్‌ఫోర్స్‌, నేవీలతో కలిసి ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించింది. నిమిషనిమిషానికి మారిపోయే పరిస్థితుల నడుమ లిప్త కాలంలో నిర్ణయాలు తీసుకుంటూ ఎందరి ప్రాణాలనో కాపాడింది. మరోసారి అలాంటి అవసరం ఏర్పడింది...


1991లో జరిగిన గల్ఫ్‌ యుద్ధం సమయంలో ఎయిర్‌లిఫ్ట్‌ చేయగా ఆ తర్వాత కాలంలో అనేక ఆపరేషన్లు చేపట్టింది. వీటిలో లెబనాన్‌ కోసం ఆపరేషన్‌ సుకూన్‌ యెమెన్‌లో చిక్కుకున్న వారి కోసం ఆపరేషన్‌ రాహత్‌లు ప్రత్యేకంగా నిలిచాయి. వీటిలో ఆపరేషన్‌ రాహత్‌లో త్రివిధ దళాలు పాల్గొన్నాయి. చాన్నాళ్ల తర్వాత ఉక్రయిన్‌ యుద్ధంతో మరోసారి విదేశాల్లో ఉన్న భారతీయులను కాపాడే అవసరం ఏర్పడింది.

యెమెన్‌లో 5 వేల మంది
గల్ఫ్‌ దేశాల్లో ఉన్న స్థానిక కారణాలతో యెమెన్‌ దేశంపై 2015 మార్చి 27న  సౌదీ అరేబియా దాడికి దిగింది. యెమెన్‌లో ఉన్న షైటే హోతీ రెబల్స్‌, రాయల్‌ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌ల మధ్య భీకర యుద్ధం మొదలైంది. ఈ దాడి మొదలు కాకముందే యెమెన్‌ ప్రెసిడెంట్‌ని రెబల్స్‌ కూలదోశారు. దీంతో ఆ దేశంలో పౌర ప్రభుత్వం నామమాత్రం అయ్యింది. ఇదే సమయంలో అక్కడ 5 వేల మందికి పైగా భారతీయులు చిక్కుకుపోయారు. 

నో ఫ్లైజోన్‌
యెమెన్‌ నో ఫ్లైజోన్‌గా ఉండటంతో అక్కడికి నేరుగా విమానాలు పంపే అవకాశం లేకపోయింది. దీంతో యెమెన్‌లో ఉన్న భారతీయులు ఆ దేశానికి చెందిన తీరప్రాంత నగరం ఎడెన్‌తో పాటు దానికి సమీపంలో ఉ‍న్న ఎయిర్‌బేస్‌ నగరం సనాకు చేరుకోవాలని సూచించింది.

పక్క దేశం నుంచి
యెమెన్‌కి సమీపంలో ఉన్న ఆఫ్రికా ఖండ దేశం జిబోటీలో భారత రాయబార కార్యాలయం వెంటనే అప్రమత్తమైంది. యెమెన్‌ దేశంలో ఉన్న ఇండియన్లు రక్షించేందుకు సాయం చేయాల్సిందిగా జిబోటీ ప్రభుత్వానికి కోరింది. అక్కడ పర్మిషన్‌ రావడంతో ఇండియన్‌ ఆర్మీకి చెందిన సీ 17 గ్లోబ్‌మాస్టర్‌ విమానాలు జిబోటికి చేరుకున్నాయి.

నేవీ ఎంట్రీ
యెమెన్‌లోని అడెన్‌ నగరం నుంచి జిబోటీ వరకు భారతీయులను తరలించడం కష్టంగా మారింది. వీటి మధ్యన అరేబియా సముద్రం ఉంది. దీంతో అడెన్‌ నుంచి జిబోటీ వరకు భారతీయులను తరలించేందుకు ఇండియన్‌ నేవికి చెందిన సుమిత్ర , ఎంబీ కరవత్తి, ఎంబీ కోరల్స్‌ నౌకలను పంపాలని నిర్ణయించారు. వీటిని ముంబై, లక్షద్వీప్‌ నుంచి యెమెన్‌కు వెళ్లాలంటూ ఆదేశించారు. వీటికి రక్షణ కల్పించేందుకు ఐఎన్‌ఎస్‌ ముంబై, ఐఎన్‌ఎస్‌ తార్‌కాష్‌లు తోడుగా వచ్చాయి. మొత్తంగా నాలుగు రోజుల పాటు 2,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఈ నౌకలు ఎడెన్‌ సమీపంలోకి చేరుకున్నాయి.

ఎయిర్‌ఫోర్స్‌ అడ్వెంచర్‌ 
మరోవైపు సనా ఎయిర్‌బేస్‌లో కూడా కొందరు ఇండియన్లు ఉన్నారు. దీంతో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఎంతో సాహసం చేసి.. అత్యంత ప్రతికూల పరిస్థితుల మధ్య రెబల్స్‌ ఆధీనంలో ఉన్న  సనా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడున్న వారిని విమానంలో ఎక్కించుకుంది. అంతే వేగంగా వారిని సురక్షితంగా ఎడెన్‌కు చేర్చింది. దీంతో అక్కడి నుంచి సుమారు ఐదువేల మంది నౌకల ద్వారా జిబోటీ చేరుకున్నారు. వీరి వసతి కోసం జిబోటీలో ఉన్న అన్ని హోటళ్లు, రిసార్టులు బుక్‌ చేసింది భారత ప్రభుత్వం. అక్కడి నుంచి దశల వారీగా విమానాల ద్వారా ఇండియాకు సురక్షితంగా చేరుకున్నారు.

ఒక్క ఇండియన్లనే కాదు
ఈ ఆపరేషన్‌లో 4,640 మంది ఇండియన్లను రక్షించారు. అంతేకాదు భారత స్థాయిలో ఏర్పాటు చేసుకోలేని ఇతర దేశాలకు చెందిన పౌరులను కూడా మన త్రివిధ దళాలు కాపాడాయి. ఇలా 41 దేశాలకు చెందిన 960 మందిని కాపాడారు. ఇందులో బంగ్లా, శ్రీలంక, నేపాల్‌, పాకిస్తాన్‌, ఇండోనేషియా, వంటి ఆసియా ఖండ దేశాలతో పాటు రష్యా, స్వీడన్‌, టర్కీ, ఇటలీ వంటి యూరప్‌ దేశాలు కెన్యా, ఉగాండ వంటి ఆఫ్రికన్‌ పౌరులు కూడా ఉన్నారు. అమెరికన్‌ పౌరులు కూడా ఈ ఆపరేషన్‌లో ప్రాణాలు దక్కించుకున్నారు.

ఉక్రెయిన్‌లో వేల మంది
ప్రస్తుతం ఉక్రెయిన్‌లో కూడా యుద్ధం జరుగుతోంది. ఉక్రెయిన్‌లో 22 వేల మంది భారతీయులు ఉన్నట్టు అంచనా. ఇందులో చాలా మంది అక్కడ ఎంబీబీఎస్‌ చదివేందుకు వెళ్లిన విద్యార్థులు ఉన్నారు. ఉద్రికత్లు మొదలుకాగానే ఇండియా రావాలంటూ సూచించారు. చివరి నిమిషంలో విమానటిక్కెట్టు ధరలు పెరగడం, సరిపడ విమానాలు లేక చాలా మంది చిక్కుకుపోయారు. వీరి కోసం ఎయిరిండియా ఫ్లైట్లను కూడా ప్రభుత్వం పంపింది. ఫస్ట్‌ ఫేస్‌లో మూడు ఫ్లైట్లు అక్కడి నుంచి వచ్చిన తర్వాత.. ఉక్రయిన్‌లో నో ఫ్లై జోన్‌ ప్రకటించారు. దీంతో ఎయిర్‌ లిఫ్ట్‌కి అవకాశం లేకుండా పోయింది. 

రెడీగా ఉండండి
ప్రస్తుతం ఉక్రెయిన్‌లో కనీసం 15 వేల మంది భారతీయులు ఉన్నట్టు అంచనా. నో ఫ్లై జోన్‌గా ప్రకటించడంతో ప్రత్యామ్నయ ఏర్పాటు చేస్తున్నామని విదేశాంగ శాఖ  తెలిపింది. ఏర్పాటు పూర్తి కాగానే నేరుగా, సోషల్‌ మీడియా ద్వారా సమాచారం చేరవేస్తామని భరోసా ఇచ్చింది. ఇందుకు తగ్గట్టుగా పాస్‌పోర్ట్‌, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుని ఉక్రెయిన్‌ పశ్చిమ ప్రాంతాల వైపుకు రావాలంటూ సూచించింది. 

మరో ఆపరేషన్‌ ?
కేంద్ర విదేశాంగ చేసిన తాజా సూచనతో మరోసారి ఆపరేషన్‌ రాహాత్‌, సుకున​ తరహాలో నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల సాయంతో తరలింపు చర్యలు చేపడుతుందా అనే చర్చ నడుస్తోంది. నౌక మార్గం ద్వారా తరలింపు చాలా వ్యయ ప్రయాసలతో కూడిన వ్యవహారంగా ఉంది.

ప్రపంచాన్ని చుట్టి
సముద్ర మార్గంలో ఇండియా నుంచి ఉక్రెయిన్‌ రేవు పట్టణమైన ఒడిసాకి చేరుకోవాలంటే ఆఫ్రికా ఖండాన్ని పూర్తిగా చుట్టేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత గిబ్రాల్టర్‌ జలసంధి గుండా యూరప్‌ సమీపంలోకి చేరుకుని మధ్యదర సముద్రంలోకి వెళ్లాలి. ఆ తర్వాత టర్కీ ఇస్తాంబుల్‌ మీదుగా నల్లసముద్రంలోకి ప్రవేశిస్తే తప్ప ఒడేసా చేరుకోలేము. ఈ నౌకా ప్రయాణానికే నెల రోజుల సమయం పట్టవచ్చు. పైగా దారి మధ్యలో దోపిడి దొంగల భయం.. అనేక దేశాలతో దౌత్యపరమైన చర్చలు చేపట్టాల్సి వస్తుంది. ఈ విధానంలో అనేక చిక్కులు ఉన్నాయి. 

యూరప్‌ దేశాల హెల్ప్‌తో
ఇక ఉక్రెయిన్‌ ప్రస్తుతం యుద్ధ తీవ్రత తక్కువగా ఉందని భావిస్తున్న పశ్చిమ దిక్కున లెవివ్‌, లట్స్‌కే, ఉజోరాడ్‌, ఇజ్మాయిల్‌, చెర్నివిస్టీ వంటి నగరాలు ఉన్నాయి. ఇక్కడ ఎయిర్‌పోర్టులు కూడా ఉన్నాయి. ఈ ఎయిర్‌పోర్టుల వరకు చేరుకున్న ఇండియన్లను.. అప్పటి పరిస్థితులను బట్టి వాయు మార్గంలో ముందుగా యూరప్‌లో ఏదైనా సిటీకి తరలించి అక్కడి నుంచి ఇండియాకు తీసుకురావచ్చు. ఇంకా నో ఫ్లై జోన్‌గా ఉంటే రోడ్డు మార్గం ద్వారా ఉక్రయిన్‌ సరిహద్దులో ఉన్న హంగేరీ, పోలాండ్‌, జర్మనీ తదితర దేశాలకు తీసుకువచ్చి అక్కడి నుంచి ఎయిర్‌లిఫ్ట్‌ చేపట్టే అవకాశం ఉంది. 

సవాల్‌
ఉక్రెయిన్‌ యూరప్‌, ఆసియా దేశాలకు ఇంచుమించు ల్యాండ్‌ లాక్డ్‌ స్టేట్‌గా ఉంది. సముద్ర మార్గం ఉ‍న్నా అనేక చిక్కుముళ్లు ఉన్నాయి. దీంతో ఇప్పటి వరకు చేపట్టిన ఆపరేషన్లతో పోల్చితే ఉక్రయిన్‌ తరలింపు భారత ప్రభుత్వాని పెద్ద సవాల్‌గానే చెప్పుకోవచ్చు. త్రివిధ దళాలను ఉపయోగించడంతో పాటు అనేక దేశాలతో సమన్వయం చేయాల్సి ఉంది. ఈ ఆపరేషన్‌లో ప్రతీ పని కత్తి మీద సాము వంటిదే. తమ వారి కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందనే నమ్మకం గత అనుభవాల దృష్ట్యా కలుగుతోంది.

  - తాండ్ర కృష్ణ గోవింద్‌, సాక్షి వెబ్‌ ప్రత్యేకం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement