stranded
-
కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న భక్తులు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ఉత్తరాఖండ్‌లో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. బాధితులను రక్షించేందుకు వైమానిక దళానికి చెందిన చినూక్, ఎంఐ 17 హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. కేదార్నాథ్ మార్గంలో చిక్కుకుపోయిన 6,980 మందికి పైగా యాత్రికులకు రక్షించారు. ఇంకా 1,500 మందికి పైగా భక్తులు, స్థానికులు ఇప్పటికీ పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. వీరిలో 150 మంది తమ కుటుంబాలను సంప్రదించలేని స్థితిలో ఉన్నారు.సోన్‌ప్రయాగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ విశాఖ అశోక్ భదానే మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు ఒక యాత్రికుడు మృతిచెందారు. కేదార్నాథ్ మార్గంలో చిక్కుకున్న 150 మందికి పైగా కుటుంబ సభ్యులు ఈ ప్రాంతంలో మొబైల్ కనెక్టివిటీ లేకపోవడంతో తమ కుటుంబసభ్యులను సంప్రదించలేకపోతున్నారని ఆయన తెలిపారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ధామితో టెలిఫోన్లో మాట్లాడారు. విపత్తు అనంతరం జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలకు అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ల సాయంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం 599 మందిని విమానంలో, 2,380 మందిని కాలినడకన సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. -
విరిగిన కేబుల్ కారు.. గాల్లో ఆరుగురి చిన్నారుల ప్రాణాలు..
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో కేబుల్ కారు అకస్మాత్తుగా చిక్కుకుపోయింది. ఈ ప్రమాద ఘటనలో ఆరుగురు పిల్లలతో సహా మొత్తం ఎనిమిది మంది దాదాపు 1200 అడుగుల ఎత్తులో కేబుల్ కారులోనే ఉండిపోయారు. లోయలను దాటే క్రమంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా ఆ ప్రాంతంలో లోయలను కేబుల్ కారు ద్వారానే దాటుతారు. రోజూవారిలాగే నేడు కేబుల్ కారులో 6గురు పాఠశాల పిల్లలతో కలిసి ఎనిమిది మంది ప్రయాణం ప్రారంభించారు. మధ్యకు వెళ్లగానే కేబుల్ కారు ఆగిపోయింది. దీంతో ఏం చేయాలో తెలియక బాధితులు అరుపులు మొదలు పెట్టారు. అందులో ఓ వ్యక్తి వద్ద ఫొన్ ఉండగా.. స్థానిక మీడియాకు సమాచారం అందించారు. BREAKING: 6 Children, 2 Adults Trapped in Cable Car 1,000+ Feet in air - 8 people have been trapped in a cable car in the town of Battagram in Pakistan for the last 8 hours. - The 6 children were taking the cable car to school with 2 adults when the wires attached to the car… pic.twitter.com/D0tnuI0eNZ — Brian Krassenstein (@krassenstein) August 22, 2023 సమాచారం అందుకున్న ప్రభుత్వ అధికారులు ఘటనాస్థలానికి వచ్చారు. హెలికాఫ్టర్ లేకుండా కేబుల్ కారులో చిక్కుకున్న వారిని రక్షించడం సాధ్యం కాదని భావించి, ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. హెలికాఫ్టర్ రంగంలోకి దిగి వారిని సురక్షితంగా రక్షించారు. సాంకేతిక కారణాలతోనే కేబుల్ కారు ఆగిపోయినట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదీ చదవండి: గడ్డం తీయాలని వరుడు తండ్రి.. తీయొద్దని వధువు! -
కంటైనర్‌లో రూ.1000 కోట్ల నగదు.. భారీ భద్రత, హఠాత్తుగా ఆగిపోయిన వాహనం
సాక్షి, చెన్నై: రిజర్వ్ బ్యాంక్ నుంచి విల్లుపురం వైపుగా రూ. 1000 కోట్ల నగదుతో వెళ్తున్న కంటైనర్ మార్గం మధ్యలో మరమ్మతులకు గురైంది. దీంతో ఆ వాహనానికి కట్టుదిట్టమైన భద్రతను కలి్పంచారు. వివరాలు.. చెన్నై రిజర్వు బ్యాంక్ నుంచి విల్లుపురం వైపుగా ఓ బ్యాంక్‌కు రూ. వెయ్యికోట్ల నగదును తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఈ నగదు తో రెండు కంటైనర్లు భారీ భద్రత నడుమ బుధవారం చెన్నై నుంచి బయలుదేరాయి. అయితే తాంబరం శానిటోరియం వద్ద ఓ వాహనం మరమ్మతుకు గురైంది. రోడ్డు మీద ఈ వాహనం హఠాత్తుగా ఆగడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ముందుగా వెళ్తు న్న మరో కంటైనర్‌ను కూడా ఆపివేశారు. కంటైన ర్ మరమ్మతుకు చాలా సమయం పట్టే అవకాశం ఉండడంతో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సిద్ధ వైద్య కళాశాలలోకి ఆ వాహనాలను తీసుకెళ్లారు. తాంబరం పోలీసులు వాటికి భద్రత కల్పిస్తున్నారు. -
ఒమెన్‌లో చిక్కుకున్న సిక్కోలు యువకులు.. మంచి జీతాలు వస్తాయని నమ్మించడంతో
వజ్రపుకొత్తూరు రూరల్/కంచిలి/సంతబొమ్మాళి: దేశం కాని దేశంలో సిక్కోలు యువకులు దీనస్థితిలో బిక్కుబిక్కుమంటున్నారు. జిల్లాలో సంతబొమ్మాళి, కంచిలి, సోంపేట, వజ్రపుకొత్తూరు, మందస మండలాలకు చెందిన 8 మంది యువకులు ఒమెన్ దేశంలో చిక్కుకుపోయారు. ఈ మేరకు ఇక్కడి వారితో సంప్రదించి తమ బాధలు చెప్పుకున్నారు. వీరు ఈ ఏడాది మేలో విశాఖపట్నంలోని కార్తికేయ కన్సల్టెంట్ కంపెనీ ద్వారా ఒమెన్ దేశం వెళ్లారు. రెండేళ్ల పాటు వెల్డింగ్ పనులు ఉంటాయని చెప్పారని, మంచి జీతాలు వస్తాయని నమ్మించడంతో ఒక్కొక్కరం రూ. 90 వేలు నుంచి రూ.లక్ష వరకు చెల్లించామని తెలిపారు. తీరా చూస్తే దళారులు చెప్పిన కంపెనీ ఆ దేశంలోనే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు ఒంటెలకు కాపలా కాస్తూ రోజులు గడుపుతున్నామని, మూడు నెలలుగా ఉపాధి లేక కడుపు నిండా తినేందుకు తిండి లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తమ వద్ద ఉన్న పాస్‌పోర్డు, వీసాలు నకిలీవని పోలీసులు తీసుకెళ్లారని, భారత రాయబారి కార్యాలయానికి సంప్రదించేందుకు అవకాశం లేకుండా పోయిందని అవేదన వ్యక్తం చేశారు. ఒమెన్‌లో చిక్కుకున్న వారిలో వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన తామాడ కృష్ణారావు(తోటపల్లి), కీలు మాణిక్యరావు(తేరపల్లి), కర్ని లోకనాథం (గోపీనాథపురం), కంచిలి మండలానికి చెందిన పి.రవికుమార్ (పెద్దపాలేరు), గున్నా గోపాల్(పెద్దపాలేరు), సోంపేట మండలానికి చెందిన సీల వాసుదేవరావు (బి.రామచంద్రపురం), సంతబొమ్మాళి మండలానికి చెందిన కల్గి నాయుడు (గోవిందపురం), మందస మండలానికి చెందిన తలగాన నీలకంఠం (బాలాజీపురం)లు ఉన్నారు. -
అయ్యో మనీషా! కానరాని దేశంలో అవస్థలు.. చార్జీల కోసం వాట్సాప్ వీడియో
తెర్లాం (విజయనగరం): విదేశాల్లో ఉద్యోగం, లక్షల్లో జీతం వస్తుందని ఓ ఏజెంట్ చెప్పిన మాయమాటలను నమ్మి మోసపోయిన ఓ వివాహిత ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. దేశం కాని దేశంలో ఉద్యోగం లేక, తినడానికి తిండిలేక అవస్థలు పడుతోంది. విజిటింగ్ వీసా గడువు కూడా ఈ ఆదివారంతో ముగియనుండడంతో ఏమి చేయాలో తెలియక దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించింది. దుబాయ్ నుంచి వచ్చేందుకు విమాన చార్జీలు ఎవరైనా దాతలు పంపిస్తే తాను ఇండియాకు వస్తానని, తనను ఆదుకోవాలని దుబాయ్ నుంచి వాట్సాప్ వీడియోను శనివారం ఆమె పోస్ట్ చేసింది. వివరాలిలా ఉన్నాయి.. విజయనగరం జిల్లా, తెర్లాం గ్రామానికి చెందిన మనీషా ఉద్యోగం కోసమని కొన్నిరోజుల క్రితం దుబాయ్ వెళ్లింది. విశాఖపట్నానికి చెందిన ఓ ఏజెంట్ ఆమెతో రూ.80 వేలు కట్టించుకుని, దుబాయ్‌లో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. దీంతో ఆమె తన దగ్గరున్న సొమ్మునంతా ఆ ఏజెంట్‌కు ఇచ్చి, అతడి విజిటింగ్ వీసాతో ఆమె దుబాయ్ వెళ్లింది. ఇలా దుబాయ్‌కు వెళ్లిన కొద్దిరోజుల్లోనే చిన్న చిన్న ఉద్యోగాలు చూపించాడు. ఆ ఉద్యోగాలు నచ్చకపోవడంతో మంచి ఉద్యోగం చూపిస్తానని నమ్మబలికాడు. ఆ తర్వాత అతడు కొన్నాళ్లకు పరారయ్యాడు. దీంతో ఆ మహిళకు ఏమి చేయాలో, ఎక్కడకు వెళ్లాలో తెలియలేదు. ఆఖరికి దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించింది. తాను మోసపోయిన విషయం వివరించింది. ఆమె వద్ద ఉన్న వీసాను రాయబార కార్యాలయ అధికారులు పరిశీలించగా, అది విజిటర్స్ వీసా అని, ఆదివారంతో గడువు ముగుస్తుందని తెలిపారు. ఇండియాకు వెళ్లేందుకు తన వద్ద ఒక్క రూపాయి కూడా లేదని, కొన్ని రోజులుగా తిండి కూడా తినలేదని, దాతలెవరైనా తనను ఇండియా తీసుకువచ్చేందుకు ఆర్థిక సాయం చేయాలని ఆమెతో ఓ వీడియో చిత్రీకరించి, దానిని వాట్పాప్‌లో పోస్ట్ చేసింది. ఈ విషయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. మనీషా వివరాలపై అధికారుల ఆరా.. మనీషా వివరాలపై విజయనగరం ఎస్బీ(స్పెషల్ బ్రాంచ్) అధికారులు శనివారం ఆరా తీశారు. దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎస్బీ అధికారులు తెర్లాం గ్రామం, మండలంలోని పలువురికి ఫోన్ చేసి, ఆమె వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
ఆ దేశాలతో చర్చలు.. ఉక్రెయిన్ నుంచి మన వాళ్లను రప్పించేందుకు ప్రత్యేక ప్లాన్
ఉక్రెయిన్‌లో యుద్ధరంగంలో చిక్కుకుపోయిన 16 వేల మంది భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చే పనుల్లో నిమగ్నమైంది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు రష్యా, ఉక్రెయిన్లతో పాటు రోమేనియా ప్రభుత్వాలతో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చర్చలు ప్రారంభించారు. ఉక్రెయిల్‌లో ప్రస్తుతం రష్యా కొనసాగిస్తున్న దాడుల్లో ఎక్కువగా తూర్పు ప్రాంతంలోనే సాగుతున్నాయి. యూరప్ దేశాలపైవు ఉన్న పశ్చిమ ప్రాంతంలో దాడులు తక్కువగా ఉన్నాయి. దీంతో పశ్చిమ ప్రాంతాలకు పాస్‌పోర్ట్ ఇతర డాక్యుమెంట్లతో రావాలంటూ ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులకు కేంద్రం సూచించింది. ఇందుకు అనుగుణంగా ఉక్రెయిన్ పశ్చిమ సరిహద్దులో ఉన్న హంగరీ, రోమేనియా, స్లోవేకియా, పోలాండ్లతో చర్చలు ప్రారంభించింది. సహరిస్తాం ఉక్రెయిన్ నంచి భారతీయుల తరలింపుకు సంబంధించి ఆ దేశ మంత్రి ఇవాన్ కుర్కోవ్తో జైశంకర్ మాట్లాడారు. తమ దేశం నుంచి భారతీయులను తరలించేందుకు పూర్తి సహయసహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు. అయితే నో ఫ్లై జోన్ ఉన్నందున దేశ సరిహద్దుల నుంచి తరలింపును ఇండియా చూసుకోవాల్సి ఉంది. డెబ్రికెన్ కీలకం ఉక్రెయిన్ సరిహద్దుల వరకు వచ్చిన ఇండియన్లను తరలించే విషయంలో హంగరీ ప్రభుత్వ సాయం కోరారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి పీటర్ షిజార్టో చర్చలు జరపగా ఆ దేశంలోని డెబ్రికెన్ ప్రాంతం నుంచి భారతీయుల తరలింపుకు పూర్తి సహకారం అందిస్తామంటూ హమీ పొందారు. హంగరీ రాజధాని బుడాపెస్ట్ తర్వాత ఆ దేశంలో రెండో పెద్ద నగరం డెబ్రికెన్. చర్చలు పూర్తి స్థాయిలో ఫలించి ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు మొదలైతే ఈ నగరం కీలకం కానుంది. Reached out to my friend FM Péter Szijjártó of Hungary on the Ukraine evacuation. He has promised full cooperation to facilitate evacuation from Debrecen. Thank him for his understanding. — Dr. S. Jaishankar (@DrSJaishankar) February 24, 2022 మేమున్నాం భారతీయుల తరలింపు విషయంలో ఉక్రెయిన్ సరిహద్దు దేశాలతో చర్చలు జరుపుతూనే మరోవైపు యూరోపియన్ యూనియన్‌తో కూడా మన దేశ మంత్రులు, అధికారులు మాట్లాడుతున్నారు. తమ దేశం మీదుగా ఇండియన్ల తరలింపుకు అడ్డు చెప్పబోమని స్లోవేకియా హామీ ఇచ్చింది. కాగా సాధ్యమైనంత త్వరగా సుళువుగా చేపట్టాల్సిన తరలింపు ప్రక్రియపై ఈయూతో మన అధికారులు చర్చిస్తున్నారు. కొలిక్కి రావాలి ఉక్రెయిన్ విస్త్రీర్ణం విశాలంగా ఉండటంతో అనేక దేశాలతో సరిహద్దులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారతీయులు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. అక్కడి నుంచి పశ్చిమ దిశగా ఉన్న ఇతర దేశాలకు దగ్గరగా ఉన్నవి ఎన్ని ? ఇందులో ఎయిర్లిఫ్ట్కి అనుకూలంగా ఉన్న ప్రాంతాలు ఏవీ అనే అంశాలపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఈ అంశాలు ఓ కొలిక్కి రావాల్సి ఉంది. Received a call from EU HRVP @JosepBorrellF. Discussed the grave situation in Ukraine and how India could contribute to de-escalation efforts. — Dr. S. Jaishankar (@DrSJaishankar) February 24, 2022 ఎంత కాలం తరలింపకు సంబంధించి ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులు ఎక్కడి ఎలా రావాలనే సూచనలు చేయడంతో పాటు.. వచ్చిన వారిని వెంటనే తీసుకువచ్చేలా లాజిస్టిక్స్ సమకూర్చాల్సి ఉంటుంది. ఈ మేరకు అనేక దేశాలతో చర్చలు జరిపి వ్యూహం రూపొందించాల్సి ఉంటుంది. ఈ విషయాల్లో స్పష్టత వచ్చాకా తరలింపు ప్రక్రియ ముందుకు వెళ్లనుంది. చదవండి: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 16 వేల మంది భారతీయులు ?హెల్ప్ లైన్ నంబర్లు -
ఆపరేషన్ సుకూన్, రాహత్ బాటలో మరో సాహసం! వాట్ నెక్ట్స్ ?
యుద్ధ సమయాల్లో విదేశాల్లో చిక్కుకున్న మన వాళ్లను కాపాడేందుకు భారత ప్రభుత్వం ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీలతో కలిసి ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించింది. నిమిషనిమిషానికి మారిపోయే పరిస్థితుల నడుమ లిప్త కాలంలో నిర్ణయాలు తీసుకుంటూ ఎందరి ప్రాణాలనో కాపాడింది. మరోసారి అలాంటి అవసరం ఏర్పడింది... 1991లో జరిగిన గల్ఫ్ యుద్ధం సమయంలో ఎయిర్‌లిఫ్ట్ చేయగా ఆ తర్వాత కాలంలో అనేక ఆపరేషన్లు చేపట్టింది. వీటిలో లెబనాన్ కోసం ఆపరేషన్ సుకూన్ యెమెన్‌లో చిక్కుకున్న వారి కోసం ఆపరేషన్ రాహత్లు ప్రత్యేకంగా నిలిచాయి. వీటిలో ఆపరేషన్ రాహత్‌లో త్రివిధ దళాలు పాల్గొన్నాయి. చాన్నాళ్ల తర్వాత ఉక్రయిన్ యుద్ధంతో మరోసారి విదేశాల్లో ఉన్న భారతీయులను కాపాడే అవసరం ఏర్పడింది. యెమెన్‌లో 5 వేల మంది గల్ఫ్ దేశాల్లో ఉన్న స్థానిక కారణాలతో యెమెన్ దేశంపై 2015 మార్చి 27న సౌదీ అరేబియా దాడికి దిగింది. యెమెన్‌లో ఉన్న షైటే హోతీ రెబల్స్, రాయల్ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌ల మధ్య భీకర యుద్ధం మొదలైంది. ఈ దాడి మొదలు కాకముందే యెమెన్ ప్రెసిడెంట్‌ని రెబల్స్ కూలదోశారు. దీంతో ఆ దేశంలో పౌర ప్రభుత్వం నామమాత్రం అయ్యింది. ఇదే సమయంలో అక్కడ 5 వేల మందికి పైగా భారతీయులు చిక్కుకుపోయారు. నో ఫ్లైజోన్ యెమెన్ నో ఫ్లైజోన్‌గా ఉండటంతో అక్కడికి నేరుగా విమానాలు పంపే అవకాశం లేకపోయింది. దీంతో యెమెన్‌లో ఉన్న భారతీయులు ఆ దేశానికి చెందిన తీరప్రాంత నగరం ఎడెన్‌తో పాటు దానికి సమీపంలో ఉన్న ఎయిర్‌బేస్ నగరం సనాకు చేరుకోవాలని సూచించింది. పక్క దేశం నుంచి యెమెన్‌కి సమీపంలో ఉన్న ఆఫ్రికా ఖండ దేశం జిబోటీలో భారత రాయబార కార్యాలయం వెంటనే అప్రమత్తమైంది. యెమెన్ దేశంలో ఉన్న ఇండియన్లు రక్షించేందుకు సాయం చేయాల్సిందిగా జిబోటీ ప్రభుత్వానికి కోరింది. అక్కడ పర్మిషన్ రావడంతో ఇండియన్ ఆర్మీకి చెందిన సీ 17 గ్లోబ్‌మాస్టర్ విమానాలు జిబోటికి చేరుకున్నాయి. నేవీ ఎంట్రీ యెమెన్‌లోని అడెన్ నగరం నుంచి జిబోటీ వరకు భారతీయులను తరలించడం కష్టంగా మారింది. వీటి మధ్యన అరేబియా సముద్రం ఉంది. దీంతో అడెన్ నుంచి జిబోటీ వరకు భారతీయులను తరలించేందుకు ఇండియన్ నేవికి చెందిన సుమిత్ర , ఎంబీ కరవత్తి, ఎంబీ కోరల్స్ నౌకలను పంపాలని నిర్ణయించారు. వీటిని ముంబై, లక్షద్వీప్ నుంచి యెమెన్‌కు వెళ్లాలంటూ ఆదేశించారు. వీటికి రక్షణ కల్పించేందుకు ఐఎన్ఎస్ ముంబై, ఐఎన్ఎస్ తార్కాష్లు తోడుగా వచ్చాయి. మొత్తంగా నాలుగు రోజుల పాటు 2,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఈ నౌకలు ఎడెన్ సమీపంలోకి చేరుకున్నాయి. ఎయిర్‌ఫోర్స్ అడ్వెంచర్ మరోవైపు సనా ఎయిర్‌బేస్‌లో కూడా కొందరు ఇండియన్లు ఉన్నారు. దీంతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎంతో సాహసం చేసి.. అత్యంత ప్రతికూల పరిస్థితుల మధ్య రెబల్స్ ఆధీనంలో ఉన్న సనా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడున్న వారిని విమానంలో ఎక్కించుకుంది. అంతే వేగంగా వారిని సురక్షితంగా ఎడెన్‌కు చేర్చింది. దీంతో అక్కడి నుంచి సుమారు ఐదువేల మంది నౌకల ద్వారా జిబోటీ చేరుకున్నారు. వీరి వసతి కోసం జిబోటీలో ఉన్న అన్ని హోటళ్లు, రిసార్టులు బుక్ చేసింది భారత ప్రభుత్వం. అక్కడి నుంచి దశల వారీగా విమానాల ద్వారా ఇండియాకు సురక్షితంగా చేరుకున్నారు. ఒక్క ఇండియన్లనే కాదు ఈ ఆపరేషన్‌లో 4,640 మంది ఇండియన్లను రక్షించారు. అంతేకాదు భారత స్థాయిలో ఏర్పాటు చేసుకోలేని ఇతర దేశాలకు చెందిన పౌరులను కూడా మన త్రివిధ దళాలు కాపాడాయి. ఇలా 41 దేశాలకు చెందిన 960 మందిని కాపాడారు. ఇందులో బంగ్లా, శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్, ఇండోనేషియా, వంటి ఆసియా ఖండ దేశాలతో పాటు రష్యా, స్వీడన్, టర్కీ, ఇటలీ వంటి యూరప్ దేశాలు కెన్యా, ఉగాండ వంటి ఆఫ్రికన్ పౌరులు కూడా ఉన్నారు. అమెరికన్ పౌరులు కూడా ఈ ఆపరేషన్‌లో ప్రాణాలు దక్కించుకున్నారు. ఉక్రెయిన్‌లో వేల మంది ప్రస్తుతం ఉక్రెయిన్‌లో కూడా యుద్ధం జరుగుతోంది. ఉక్రెయిన్‌లో 22 వేల మంది భారతీయులు ఉన్నట్టు అంచనా. ఇందులో చాలా మంది అక్కడ ఎంబీబీఎస్ చదివేందుకు వెళ్లిన విద్యార్థులు ఉన్నారు. ఉద్రికత్లు మొదలుకాగానే ఇండియా రావాలంటూ సూచించారు. చివరి నిమిషంలో విమానటిక్కెట్టు ధరలు పెరగడం, సరిపడ విమానాలు లేక చాలా మంది చిక్కుకుపోయారు. వీరి కోసం ఎయిరిండియా ఫ్లైట్లను కూడా ప్రభుత్వం పంపింది. ఫస్ట్ ఫేస్‌లో మూడు ఫ్లైట్లు అక్కడి నుంచి వచ్చిన తర్వాత.. ఉక్రయిన్‌లో నో ఫ్లై జోన్ ప్రకటించారు. దీంతో ఎయిర్ లిఫ్ట్‌కి అవకాశం లేకుండా పోయింది. రెడీగా ఉండండి ప్రస్తుతం ఉక్రెయిన్‌లో కనీసం 15 వేల మంది భారతీయులు ఉన్నట్టు అంచనా. నో ఫ్లై జోన్‌గా ప్రకటించడంతో ప్రత్యామ్నయ ఏర్పాటు చేస్తున్నామని విదేశాంగ శాఖ తెలిపింది. ఏర్పాటు పూర్తి కాగానే నేరుగా, సోషల్ మీడియా ద్వారా సమాచారం చేరవేస్తామని భరోసా ఇచ్చింది. ఇందుకు తగ్గట్టుగా పాస్‌పోర్ట్, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుని ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతాల వైపుకు రావాలంటూ సూచించింది. మరో ఆపరేషన్ ? కేంద్ర విదేశాంగ చేసిన తాజా సూచనతో మరోసారి ఆపరేషన్ రాహాత్, సుకున తరహాలో నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల సాయంతో తరలింపు చర్యలు చేపడుతుందా అనే చర్చ నడుస్తోంది. నౌక మార్గం ద్వారా తరలింపు చాలా వ్యయ ప్రయాసలతో కూడిన వ్యవహారంగా ఉంది. ప్రపంచాన్ని చుట్టి సముద్ర మార్గంలో ఇండియా నుంచి ఉక్రెయిన్ రేవు పట్టణమైన ఒడిసాకి చేరుకోవాలంటే ఆఫ్రికా ఖండాన్ని పూర్తిగా చుట్టేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత గిబ్రాల్టర్ జలసంధి గుండా యూరప్ సమీపంలోకి చేరుకుని మధ్యదర సముద్రంలోకి వెళ్లాలి. ఆ తర్వాత టర్కీ ఇస్తాంబుల్ మీదుగా నల్లసముద్రంలోకి ప్రవేశిస్తే తప్ప ఒడేసా చేరుకోలేము. ఈ నౌకా ప్రయాణానికే నెల రోజుల సమయం పట్టవచ్చు. పైగా దారి మధ్యలో దోపిడి దొంగల భయం.. అనేక దేశాలతో దౌత్యపరమైన చర్చలు చేపట్టాల్సి వస్తుంది. ఈ విధానంలో అనేక చిక్కులు ఉన్నాయి. యూరప్ దేశాల హెల్ప్‌తో ఇక ఉక్రెయిన్ ప్రస్తుతం యుద్ధ తీవ్రత తక్కువగా ఉందని భావిస్తున్న పశ్చిమ దిక్కున లెవివ్, లట్స్కే, ఉజోరాడ్, ఇజ్మాయిల్, చెర్నివిస్టీ వంటి నగరాలు ఉన్నాయి. ఇక్కడ ఎయిర్‌పోర్టులు కూడా ఉన్నాయి. ఈ ఎయిర్‌పోర్టుల వరకు చేరుకున్న ఇండియన్లను.. అప్పటి పరిస్థితులను బట్టి వాయు మార్గంలో ముందుగా యూరప్‌లో ఏదైనా సిటీకి తరలించి అక్కడి నుంచి ఇండియాకు తీసుకురావచ్చు. ఇంకా నో ఫ్లై జోన్‌గా ఉంటే రోడ్డు మార్గం ద్వారా ఉక్రయిన్ సరిహద్దులో ఉన్న హంగేరీ, పోలాండ్, జర్మనీ తదితర దేశాలకు తీసుకువచ్చి అక్కడి నుంచి ఎయిర్‌లిఫ్ట్ చేపట్టే అవకాశం ఉంది. సవాల్ ఉక్రెయిన్ యూరప్, ఆసియా దేశాలకు ఇంచుమించు ల్యాండ్ లాక్డ్ స్టేట్‌గా ఉంది. సముద్ర మార్గం ఉన్నా అనేక చిక్కుముళ్లు ఉన్నాయి. దీంతో ఇప్పటి వరకు చేపట్టిన ఆపరేషన్లతో పోల్చితే ఉక్రయిన్ తరలింపు భారత ప్రభుత్వాని పెద్ద సవాల్‌గానే చెప్పుకోవచ్చు. త్రివిధ దళాలను ఉపయోగించడంతో పాటు అనేక దేశాలతో సమన్వయం చేయాల్సి ఉంది. ఈ ఆపరేషన్‌లో ప్రతీ పని కత్తి మీద సాము వంటిదే. తమ వారి కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందనే నమ్మకం గత అనుభవాల దృష్ట్యా కలుగుతోంది. - తాండ్ర కృష్ణ గోవింద్, సాక్షి వెబ్ ప్రత్యేకం -
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 18 వేల మంది భారతీయులు ?హెల్ప్ లైన్ నంబర్లు
ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలైన నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్‌లో ఉన్న ఇండియన్లను ఎక్కడివార్కడే ఆగిపోవాలంటూ తెలిపింది. సురక్షిత ప్రాంతాలకు చేరుకుని ఆ దేశంలో పరిస్థితులు చక్కబడే వరకు వేచి ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతాల నుంచి ఆ దేశ రాజధాని కీవ్ వచ్చేందుకు ప్రయత్నిస్తున్న భారతీయులంతా తిరిగి తమ తమ ప్రదేశాలకు వెళ్లిపోవాలని కోరింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ సూచనలే పాటించాలని కోరింది. ఉక్రెయిన్ క్రైసిస్ నేపథ్యంలో విదేశాంగ శాఖ ఇప్పటికే హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించింది. In view of the prevailing situation in Ukraine, a Control Room has been set up at @MEAIndia to provide information and assistance: 📞Phone: 1800118797 (Toll free) +91-11-23012113 +91-11-23014104 +91-11-23017905 📠Fax: +91-11-23088124 📧Email: situationroom@mea.gov.in — Arindam Bagchi (@MEAIndia) February 16, 2022 ఇంకా 18 వేల మంది.. ఉక్రెయిన్ వివాదం తెరపైకి రాకముందు ఆ దేశంలో 22 వేల మంది భారతీయులు ఉన్నట్టుగా అధికార వర్గాలు అంచనా వేశాయి. ఇందులో సుమారు వెయ్యి మంది వరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. ఉద్రిక్తలు ప్రారంభం కాగానే చాలా మంది స్వదేశం బాట పట్టారు. మరికొందరు తాము చదువుతున్న యూనివర్సిటీల నుంచి సెలవు/ఆన్లైన్ క్లాసులకు సంబంధించి అధికారిక సమాచారం రాకపోవడంతో అక్కడే ఉండిపోయారు. . ప్రభుత్వ వర్గాల అంచనా ప్రకారం ఉక్రెయిన్‌లో ఇంకా 18 వేల మంది వరకు ఇండియన్లు ఉండవచ్చని అంచనా. IMPORTANT ADVISORY TO ALL INDIAN NATIONALS IN UKRAINE AS ON 24 FEBRUARY 2022.@MEAINDIA @PIB @DDNEWS pic.twitter.com/e1i1lMuZ1J — India in Ukraine (@IndiainUkraine) February 24, 2022 ఉక్రెయిన్ లో తెలుగు విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ నంబర్లు ఏపిఎన్ఆర్టీసిఈఓ దినేష్ 9848460046 నోడల్ ఆఫీసర్ రవిశంకర్ 9871999055 గీతేష్ శర్మ, స్పెషల్ ఆఫీసర్ 7531904820 ఎయిర్ స్పేస్ క్లోజ్ పరిస్థితి విషమించడంతో ఫిబ్రవరి 21 నుంచి ఉక్రెయిన్ నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమనాలు పంపారు. ప్రతీ విమానంలో రెండు వందల మంది వంతున ప్రయాణికులు ఇండియాకు గత రెండు రోజుల్లో చేరుకున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 27న మూడు విమానాలు కీవ్ నుంచి న్యూఢిల్లి రావాల్సి ఉంది. కానీ యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో ఎయిర్ స్పేస్ మూసేయడంతో విమాన సర్వీసులు రద్దయినట్టే లెక్క. వెస్ట్ సేఫ్ స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఉక్రెయిన్‌లోని వేర్వేరు ప్రాంతాల నుంచి కీవ్ ఎయిర్‌పోర్ట్‌కి వచ్చే వారిని ఎక్కడి వారు అక్కడే ఉండి పోవాలంటూ భారత ప్రభుత్వం కోరింది. ముఖ్యంగా ఉక్రెయిన్‌లో కొంత మేరకు సేఫ్‌గా ఉన్న పశ్చిమ ప్రాంతాల వారిని తిరిగి అదే ప్రదేశాలకు వెళ్లాలని సూచించింది. ఉక్రెయిన్ ఎంబసీ వద్ద భారతీయుల పడి గాపులు రష్యా యుద్ధం ప్రకటించడంతో ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులపై ఇండియాలో ఉన్న వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. తమ వారిని క్షేమంగా స్వదేశానికి తిరిగి తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్మీ విమానాలు పంపాలి ఉద్రిక్తలు మొదలవగానే ఇండియా వచ్చేందుకు మా తమ్ముడు ప్రయత్నించాడని కానీ విమాన ఛార్జీలు లక్షల్లో వసూలు చేస్తుండటంతో అక్కడే ఉండి పోయాడని డాక్టర్ పూజా అన్నారు. ప్రస్తుతం పౌర విమానాలకు రాకపోకలు నిషేధించిన నేపథ్యంలో మిలిటరీ విమానాలు పంపి భారతీయులను తీసుకురావాలని డిమాండ్ చేశారు. -
yaas cyclone: బురదలో చిక్కుకున్న వందమంది
కోల్‌కతా:యాస్ తుపానులో చిక్కకుని విలవిలాడుతున్న పశ్చిమబెంగాల్, ఒడిషాలలో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా తుపాను దాటికి బెంగాల్‌లోని సుందర్బన్ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. ఒక్కసారిగా సముద్రం ఉప్పొంగి ఊళ్లకు ఊళ్లనే చుట్టేసింది. దీంతో బంకమట్టి నేలలు అధికంగా ఉండే సుందర్బన్లో అనేక మంది బురదలో కూరుకుపోయారు. నాయచార గ్రామంలో వంద మంది ప్రజలు బురదలో చిక్కుకున్నట్టు సమాచారం రావడంతో ఇండియన్ కోస్ట్‌గార్డ్ స్పందించింది. హుటాహుటిన ఆ గ్రామానికి వెళ్లి ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించింది. సహాయ చర్యలు తుపాను తీవ్రతకు పశ్చిమ బెంగాల్లో నాలుగు జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. దాదాపు కోటి ఇళ్లు ధ్వంసమైనట్టు బెంగాల్ సీఎం ప్రకటించారు. వరదలో చిక్కుకుపోయిన వారికి సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇటు ఒడిషాలోనూ పలు గ్రామాలను చుట్టుముట్టిన సముద్రపు నీరు నెమ్మదిగా వెనక్కి మళ్లుతోంది West Bengal | Indian Coast Guard response team rescues about 100 stranded people through air cushion vehicle in Nayachara village. Rescue operation also underway at Contai (Video Source: Indian Coast Guard)#CycloneYass pic.twitter.com/P6s7wLqGT8 — ANI (@ANI) May 26, 2021 -
హమ్మయ్య.. శ్రీనివాస్ క్షేమంగా వచ్చేశాడు!
పెగడపల్లి(ధర్మపురి): లెబనాన్ నుంచి ఇంటికి తిరిగి వస్తూ షార్జాలో జైలు పాలయిన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మ్యాక వెంకయ్యపల్లికి చెందిన శ్రీనివాస్ ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నాడు. శ్రీనివాస్ గల్ఫ్‌లో బందీ అయిన విషయంపై ‘సాక్షి’లో ‘జైలు నుంచి విడిపించరూ..’ శీర్షికన ప్రచురితమైన కథనానికి గల్ఫ్‌కార్మిక రక్షణ సమితి సభ్యులు స్పందించారు. షార్జా జైలు నుంచి ఇంటికొచ్చిన శ్రీనివాస్‌ను బుధవారం ‘సాక్షి’పలకరించింది. శ్రీనివాస్ 2013లో దుబాయ్‌కి వెళ్లగా జీతం తక్కువగా ఉండటంతో అక్కడే కల్లివెల్లి కార్మికుడిగా మారాడు. ఓ గదిలో పదిమందితో కలిసి ఉండేవాడు. ఈ క్రమంలో 2015లో గదిలో ఎవరో నల్లుల మందు పెట్టగా.. అది విషంగా మారి పక్క గదిలో ఉన్న ఒకరు చనిపోయారు. ఆ కేసులో సీఐడీ పోలీసులు శ్రీనివాస్‌ను జైలులో పెట్టి 20 రోజుల తర్వాత విడుదల చేయగా స్వగ్రామానికి వచ్చేశాడు. తర్వాత 2018లో లెబనాన్ వెళ్లిన శ్రీనివాస్ ఈ ఏడాది మార్చి 24న షార్జా నుంచి స్వదేశానికి తిరిగి వస్తుండగా శ్రీనివాస్‌పై కేసు ఉందని, రెండు నెలలు జైలుతోపాటు రూ.45 లక్షలు జరిమానా చెల్లించాలని చెప్పారు. ఆయన స్నేహితుడు ఈ విషయాన్ని గల్ఫ్‌కార్మిక రక్షణ సమితి అధ్యక్షుడు గుండెల్లి నరసింహకు తెలపగా, ఆయన చొరవతో ఎలాంటి జైలుశిక్ష, జరిమానా లేకుండానే విడుదలై, స్వగ్రామం చేరుకున్నాడు. గల్ఫ్‌లో కార్మికుల గోస.. ఆదుకోవాలని వేడుకోలు -
గల్ఫ్‌లో కార్మికుల గోస.. ఆదుకోవాలని వేడుకోలు
సాక్షి, జగిత్యాల: స్వగ్రామంలో ఉపాధి కరువై దుబాయ్ వెళ్లిన గల్ఫ్ కార్మికులకు వేతన కష్టాలు మొదలయ్యాయి. మూడు నెలలుగా వేతనాలు లేక, తిండికి కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో రాష్ట్రానికి చెందిన 17 మంది కార్మికులు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒకరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుబాయ్‌లోని ఇన్వెస్టర్ టెక్నికల్ కంపెనీలో పనిచేసేందుకు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఏడుగురు, నిర్మల్‌కు చెందిన ఆరుగురు, జగిత్యాలకు చెందిన ఒకరు, రాజన్న సిరిసిల్లకు చెందిన ఒకరు, కామారెడ్డికి చెందిన ఇద్దరు, ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒకరు ఆరేళ్ల క్రితం వెళ్లారు. మూడు నెలలుగా కంపెనీలో పని లేకపోవడంతో వేతనాలు ఇవ్వడం నిలిపివేశారు. దీంతో కార్మికులు తిండికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని కంపెనీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇక్కడ చదవండి: తెలంగాణలో లాక్డౌన్ ఆలోచన లేదు: మంత్రి ఈటల Vemulawada: కక్కుర్తిపడ్డ ఉద్యోగి.. భోళా శంకరునికే బురిడీ.. -
ఒమన్ నుంచి ముగ్గురు మహిళలు రాక
గన్నవరం: ఏజెంట్ల మాయమాటలు నమ్మి ఒమన్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన మరో ముగ్గురు మహిళలను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీఎస్) గురువారం స్వరాష్ట్రానికి తీసుకొచ్చింది. ఒమన్ రాజధాని మస్కట్ నుంచి ఎయిరిండియా విమానంలో ఈ ముగ్గురు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరిలో ఇద్దరు పశ్చిమ గోదావరి జిల్లావారు కాగా, మరొకరు కడపకు చెందినవారు. వీరి విమాన టిక్కెట్ ఖర్చులను ఏపీ ప్రభుత్వమే భరించింది. అంతేకాకుండా వారిలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరికి, కడపకు చెందిన ఒకరికి ప్రయాణం, భోజనం ఖర్చులను కూడా అందించింది. గన్నవరం విమానాశ్రయంలో వీరికి ఏపీఎన్ఆర్టీఎస్ సిబ్బంది స్వాగతం పలికారు. ఒమన్ వెళ్లి చిక్కుకుపోయిన వలస కార్మికులకు ఆ దేశం క్షమాభిక్ష ప్రకటించడంతో తొలి విడత ఈ నెల 14న ఎనిమిది మందిని రాష్ట్రానికి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మహిళలు కృతజ్ఞతలు తెలియజేశారు. చదవండి: పనిమనిషిపై పైశాచికం.. శరీరంపై 31 గాయాలు ఆస్ట్రేలియా నుంచి రప్పించి మరీ ఎన్నారై అరెస్టు -
మే 7 నుంచి దశలవారీగా..
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 లాక్డౌన్లతో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను మే 7 నుంచి దేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వీరందరినీ దశలవారీగా విమానాలు, నౌకల ద్వారా స్వదేశానికి రప్పిస్తామని ప్రభుత్వం పేర్కొంది. దీనికోసం నిర్థిష్ట విధివిధానాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆయా దేశాల భారత రాయబార కార్యాలయాలు దేశానికి తిరిగివచ్చే భారత పౌరుల జాబితాలను సిద్ధం చేస్తాయి. స్వదేశానికి వచ్చేందుకు అయ్యే చార్జీలను ప్రయాణీకులే భరించాల్సి ఉంటుంది. ఇక కరోనా లక్షణాలు లేని వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారని హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ వెల్లడించింది. ఇక స్వదేశానికి తిరిగివచ్చిన తర్వాత ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ప్రయాణీకులు పాటించాల్సి ఉంటుంది. భారత్‌కు చేరుకున్న తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి రెండు వారాలు క్వారంటైన్లో ఉంచిన అనంతరం మార్గదర్శకాలకు అనుగుణంగా తదుపరి చర్యలు చేపడతారు. చదవండి : సీఎం సహాయనిధికి విరాళాలు -
కరోనా సంక్షోభం : కేరళకు లక్షల్లో రిజిస్ట్రేషన్లు
సాక్షి, తిరువనంతపురం: కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో విదేశాల్లో వుంటున్నలక్షలాదిమంది కేరళీయులు తిరిగి కేరళ రాష్ట్రానికి రావాలని భావిస్తున్నారట. కరోనా వైరస్ వ్యాప్తి భయాలకు తోడు, ఉద్యోగాలపై నెలకొన్న అభద్రత కారణంగా వారంతా సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి చేరుకోవాలని భావిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో దాదాపు 2 లక్షల మంది ప్రవాస కేరళీయులు తమ అభ్యర్థనను నమోదు చేసుకున్నారని నాన్-రెసిడెంట్ కేరలైట్ వ్యవహారాల విభాగం (నార్కా) వైస్ చైర్మన్ కె వరదరాజన్ తెలిపారు. భారతదేశంలో విమానాశ్రయాలు కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ఇంటికి రావాలనుకునేవారి కోసం ప్రారంభించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)నుండి 70వేలమంది, 30వేల సౌదీ అరేబియా నుండి నమోదు చేసుకున్నారని తెలిపారు. 40 శాతానికి పైగా యుఎఇ నుంచి రాగా, మిగిలినవి సౌదీఅరేబియా, బహ్రెయిన్, ఇతర పెర్షియన్ గల్ఫ్ దేశాలనుంచి వచ్చాయన్నారు. అమెరికా, బ్రిటన్ నుండి కూడా ఇలాంటి అభ్యర్థనలున్నట్టు చెప్పారు. వీరిని దశల వారీగా తిరిగి తీసుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందన్నారు. (తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం) కరోనా వైరస్ భయాలు, లాక్డౌన్ కారణంగా ఆయా దేశాలలో ఉద్యోగాలు కోల్పోనున్నామన్నఆందోళనతో 160 దేశాల్లోని కేరళీయులు తొలి విమానాల ద్వారా తమ సొంత రాష్ట్రానికి చేరుకోవడానికి ఆతృతగా ఉన్నారని వరద రాజన్ వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రధామంత్రి నరేంద్ర మోదీ దృష్టికి కూడా తీసుకు వెళ్లినట్టు తెలిపారు. అంతేకాదు ఈ సంఖ్య ఐదు లక్షలకు చేరవచ్చని భావిస్తున్నామన్నారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న ప్రజల భద్రత తమ ప్రాధాన్యత అని, వారిని తిరిగి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. గర్భిణీ స్త్రీలు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నవ్యక్తులు, వీసా గడువు ముగిసి అక్కడ చిక్కుకుపోయిన విద్యార్థులను తీసుకురావడానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలను తిరిగి తీసుకురావడానికి చార్టర్డ్ విమానాలు అవసరమని వరద రాజన్ పేర్కొన్నారు. కాగా రాష్ట్రానికి తిరిగి వచ్చిన ప్రవాసీయుల కోసం రాష్ట్రంలోని నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో పరీక్షలు,క్వారంటైన్ లాంటి ఏర్పాట్లను ప్రభుత్వం చేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే, ఈ ప్రజలను తిరిగి తీసుకు రావడానికి సిద్దంగా ఉన్నామన్నారు. అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభమైన ఒక నెలలోనే 5 లక్షల మంది తిరిగి వస్తారని కేరళ అంచనావేస్తోంది. కేరళ 33 మిలియన్ల జనాభాలో 10 శాతం విదేశాల్లో నివసిస్తున్నారు. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న నాన్-రెసిడెంట్ కేరళీయుల ఆదాయం 80,000 కోట్ల రూపాయలు. కరోనా ప్రభావంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో తమ వారిని ఆహ్వానించేందుకు కేరళ సన్నద్ధంగా వుండటం విశేషం. -
కుప్పకూలిన దిగ్గజం, 22 వేల ఉద్యోగాలు ప్రమాదంలో
బ్రిటిష్ పర్యాటక సంస్థ థామస్‌కుక్ కుప్పకూలింది. 178 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కంపెనీ దివాలా ప్రకటించడంతో వేలాదిమంది ఉద్యోగుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. చివరి నిమిషంలో జరిపిన చర్చలు విఫలమైన నేపథ్యంలో థామస్‌కుక్ దివాలా తీసింది. ప్రపంచవ్యాప్తంగా థామస్‌కుక్ తన విమాన సేవలను నిలిపివేసినట్టుగా బ్రిటిష్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకటించింది. థామస్కుక్కు చెందిన విమాన, హాలిడే బుకింగ్స్‌లను రద్దు చేసినట్టు ప్రకటించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 22వేల ఉద్యోగాలు ప్రమాదంలో పడిపోయాయి. వీరిలో 9వేల మంది బ్రిటన్ వారున్నారు. అంతేకాదు వేలాదిమంది ప్రయాణీకులు ఇబ్బందుల్లో చిక్కుకుపోయారు. సంస్థ పతనం తీవ్ర విచారం కలిగించే విషయమని థామస్ కుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీటర్ ఫాంక్‌హౌజర్ ఆదివారం రాత్రి పేర్కొన్నారు. దీర్ఘకాలిక చరిత్ర ఉన్నసంస్థ దివాలా ప్రకటించడం సంస్థలకు, లక్షలాది కస్టమర్లకు, ఉద్యోగులకు చాలా బాధ కలిగిస్తుందని, ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని చెప్పారు. తప్పనిసరి లిక్విడేషన్లోకి ప్రవేశించిందంటూ కస్టమర్లు, వేలాదిమంది ఉద్యోగులకు అయన క్షమాపణలు చెప్పారు. మరోవైపు ఇది చాలా విచారకరమైన వార్త అని బ్రిటన్ రవాణా కార్యదర్శి గ్రాంట్ షాప్స్ చెప్పారు. అలాగే పర్యాటకులను, కస్టమర్లను వారివారి గమ్యస్థానాలకుచేర్చేందుకు ఉచితంగా 40కి పైగా చార్టర్ విమానాలను సీఏఏ అద్దెకు తీసుకుందని తెలిపారు. కాగా ప్రపంచంలోని ప్రసిద్ధ హాలిడే బ్రాండ్లలో ఒకటైన థామస్ కుక్‌ను 1841లో లీసెస్టర్స్ షైర్లో క్యాబినెట్-మేకర్ థామస్ కుక్ స్థాపించారు. ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో నష్టాలు భారీగా పెరగనున్నాయని ఈ ఏడాది మేలోనే థామస్ కుక్ వెల్లడించింది. బ్రెగ్జిట్ అనిశ్చితి కారణంగా సమ్మర్ హాలిడే బుకింగ్స్ ఆలస్యం కావడంతో సంక్షోభం మరింత ముదిరింది. థామస్ కుక్ సీఈవో పీటర్ ఫాంక్‌హౌజర్ అయితే థామస్ కుక్ ఇండియా మాత్రం ఆర్థికంగా, నిర్వహరణ పరంగా చాలా పటిష్టంగా ఉంది. 2012 నుంచి స్వతంత్ర సంస్థగా కొనసాగుతున్న ఈ కంపెనీలో మేజర్ వాటా ఫెయిర్‌ఫాక్స్ గ్రూపు సొంతం. Lots of red cancelled markers for Thomas Cook flights due out from Manchester Airport today. Live on @bbc5live throughout the morning. pic.twitter.com/UuiTk9sjRU — Justin Bones (@justinbones) September 23, 2019 అయితే థామస్ కుక్ ఇండియా ఆర్థికంగా, నిర్వహరణ పరంగా చాలా పటిష్టంగా ఉంది. 2012 నుంచి స్వతంత్ర సంస్థగా కొనసాగుతున ఈ కంపెనీలో మేజర్ వాటా ఫెయిర్‌ఫాక్స్ గ్రూపు సొంతం. -
నేపాల్‌లో చిక్కుకున్న తమిళుల కోసం హెలికాప్టర్...!
2.10లక్షల కేటాయింపు చెన్నై: నేపాల్‌లో చిక్కుకున్న పది మంది తమిళుల్ని సురక్షితంగా ఢిల్లీకి చేర్చేందుకు ప్రత్యేక హెలికాప్టర్‌ను ఏర్పాటు చేయాలని జయలలిత ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం రూ. 2.10 లక్షలు కేటాయించింది. కాంచీపురం జిల్లా వాసులు పది మంది ఇటీవల ముక్తినాథ్ను సందర్శించేందుకు నేపాల్ వెళ్లారు. అయితే అక్కడ భారీ వర్షాలు, మంచు చరియలు విరిగి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సదరు తమిళవాసులు నేపాల్‌లో చిక్కుకుపోయారు. దాంతో వారు నేపాల్‌లోని భారత దౌత్య కార్యాలయ అధికారులను సంప్రదించారు. సదరు అధికారులు వెంటనే జయలలిత ప్రభుత్వాన్నికి సమాచారం అందించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆమె ఆదేశించారు. ఢిల్లీలోని తమిళనాడు రాష్ట్రప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో ఈ ప్రయత్నాలు మొదలెట్టారు. ఆ పది మందిని సురక్షితంగా న్యూఢిల్లీకి తరలించి, అక్కడి నుంచి చెన్నైకు తీసుకొచ్చేందుకు తగ్గిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
సిమ్ కోట్ లో చిక్కుకున్నభారతీయులు!
న్యూఢిల్లీః కైలాశ్ మానస సరోవరం యాత్రకు వెళ్ళిన 500 మంది భారతీయ యాత్రికులు వాతావరణం అనుకూలించక పోవడంతో నేపాల్ లో చిక్కుకుపోయారు. నేపాల్ పర్వత ప్రాంతంలోని హిల్సా, సిమికోట్ ప్రాంతాల్లో యాత్రికులు చిక్కుకున్నారని, వారికి సహాయక చర్యలు అందించేందుకు సైతం అనేక ఇబ్బందులు ఎదురౌతున్నట్లు అధికారులు వెల్లడించారు. మానస సరోవర్ యాత్రికులకు సహాయక చర్యలను అందించేందుకు నేపాల్ విదేశాంగ శాఖ కార్యదర్శితో కాట్మాండులోని భారత దౌత్య కార్యాలయ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ వెల్లడించారు. భారతీయ యాత్రికులందరినీ కాపాడేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల నేపాల్ లో చిక్కుకుపోయిన వారందరినీ రక్షించేందుకు హోం శాఖ కార్యదర్శి, ఆర్మీ స్టాఫ్ చీఫ్, మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ సహా ఇతర పోలీసు బలగాలు, అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా మానస సరోవరం యాత్రకు వెళ్ళిన దాదాపు 50 మందిని ఇప్పటి దాకా హిల్సానుంచి సిమ్ కోట్ కు తరలించినట్లు, దాదాపు వంద మందిని సిమికోట్ నుంచి నేపాల్ గంజ్ కు తెచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. హెలికాప్లర్ల ద్వారా వారిని తరలిస్తున్నామని, ఇంకా సిమికోట్ లో 250 మంది వరకూ యాత్రికులు ఉన్నట్లు నేపాల్ పోలీసులు చెప్తున్నారు. వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా నేపాలీ అధికారులు అన్నివిధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు స్వరూప్ వెల్లడించారు. -
విశాఖ పోర్టులో నిలిచిన నౌక
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నుంచి పోర్టుబ్లెయిర్ బయల్దేరాల్సిన ప్యాసింజర్ నౌక విశాఖ పోర్టులో చిక్కుకుపోయింది. ఈ నౌకలో ప్రయాణిస్తున్న సుమారు 1149 మంది అన్నపానియాల్లేక రెండ్రోజులుగా అల్లాడిపోతున్నారు. ఈ నౌక బుధవారం సాయంత్రం బయల్దేరాల్సి ఉంది. రోను తుపాన్‌తో వాతావరణ శాఖ క్లియరెన్స్ ఇవ్వలేదు. విషయం తెలుసుకున్న మంత్రి అయ్యన్నపాత్రుడు కలెక్టర్ యువరాజ్ దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు భోజన ఏర్పాట్లు చేశారు. -
వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా రైళ్ల పునరుద్ధరణ
రాజంపేట: భారీ వర్షాలతో రాయలసీమలోని పలు జంక్షన్ లలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌లను అధికారులు పునరుద్ధరించారు. నందలూరు-ఒంటిమిట్ల మధ్యలో దెబ్బతిన్న రైల్వేట్రాక్‌కు మరమ్మతులు పూర్తి కావడంతో వివిధ స్టేషన్లలో ఆగిపోయిన రైళ్లు బయలు దేరాయి. మంగళవారం ఉదయం మంటపం పల్లి వద్ద గౌహతి- చెన్నై ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన విషయం విదితమే. ఫలితంగా ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్లను అధికారులు ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఐదు గంటల అనంతరం కోరమాండల్, హరిప్రియ, ఎగ్మూర్ ఎక్స్ ప్రెస్ రైళ్లు బయలుదేరాయి. తిరుపతి - గుంతకల్లు మార్గంలోని సిగ్నల్ వ్యవస్థలో సాంకేతిక లోపం ఏర్పడటంతో కూడా పలు రైళ్లు నిలిచిపోయాయి. రైల్వే శాఖ మరమ్మత్తులు చేపట్టి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించింది. -
'అండమాన్'ని నిలిపివేసిన అధికారులు
నెల్లూరు : జమ్మూ నుంచి చెన్నై వెళ్తున్న అండమాన్ ఎక్స్‌ప్రెస్‌ను శుక్రవారం నెల్లూరు జిల్లా దొరవారిసత్రం రైల్వే స్టేష్టన్లో అధికారులు నిలిపివేశారు. తమిళనాడులోని కొరుగుపేట - తొండయార్‌పేట మధ్య రైల్వే ట్రాక్‌పైకి భారీగా నీరు వచ్చి చేరింది. దీంతో అండమాన్ ఎక్స్‌ప్రెస్ రైలును అధికారులు నిలిపేశారు. అలాగే చెన్నై నుంచి నెల్లూరు వచ్చే రైలును కూడా రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. రైళ్లు ఎక్కడికక్కడ నిలచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. -
కరవదిలో నిలిచిన 'పినాకిని'
ఒంగోలు : విజయవాడ నుంచి చెన్నై మహానగరానికి వెళ్తున్న పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌లో గురువారం సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ప్రకాశం జిల్లా కరవదిలో దాదాపు 40 నిమిషాల పాటు నిలిచి పోయింది. దీంతో ఇంజిన్ డ్రైవర్ రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దాంతో ఇంజిన్‌లో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని నివారించేందుకు రైల్వే అధికారులు సాంకేతిక సిబ్బందిని కరవదికి పంపారు. అయితే రైలు అర్థాంతరంగా నిలిచిపోవడంతో రైలులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
ఛత్తీస్‌గఢ్‌లో పర్యాటకులకు తప్పిన ప్రమాదం
-
అయ్యో పాపం.....!
-
విమానంలో ఖాళీ లేదని వదిలేశారు
ఇరాక్ లో చిక్కుకుపోయిన పార్వతిరాజు తణుకు: విమానంలో ఖాళీలేదని తనను ఇరాక్‌లోనే వదిలేశారంటూ త్యాజంపూడికి చెందిన గనసాల పార్వతిరాజు ఆవేదనగా చెప్పారు. ఇరాక్ నుంచి కొందరు యువకులు సొంతగడ్డకు చేరుకోగా తమ స్నేహితులు ఇంకా కొందరు అక్కడే ఉండిపోయారని చెప్పడంతో గురువారం రాత్రి విలేకరితో పార్వతిరాజు ఫోన్లో మాట్లాడారు. హాసన్ కంపెనీలో తనతోపాటు పనిచేసిన తెలుగువారంతా ఇండియా వచ్చేశారని, తనను మాత్రం పదిరోజుల నుంచి రేపు మాపు కాలం గడుపుతున్నారని వాపోయాడు. తనతో పాటు చెన్నైకు చెందిన ముగ్గురు, కలకత్తావాసి ఒకరు, బీహార్‌వాసి ఒకరు ఇక్కడే ఉండిపోయారని, రోజు గడవడం కష్టంగా ఉందని కన్నీటిపర్యంతమయ్యా డు. తాను చూస్తుండగానే స్నేహితులు ఎక్కిన విమానం పైకి ఎగరడంతో బిగ్గరగా ఏడ్చానని తెలిపాడు. ఒక పూటతిని ఒక పూట తినక బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నానని, తనను కూడా ఇండియాకు తీసుకువెళ్లాలంటూ అభ్యర్థించాడు. -
హమ్మయ్య.. గండం గడిచింది!
చోడవరం(కొండపి), న్యూస్‌లైన్: జిల్లాలో ముంచుకొచ్చిన వరదల్లో చిక్కుకున్న వందలాది మందిని శుక్రవారం అధికార యంత్రాంగం శ్రమించి రక్షించింది. టంగుటూరు మండల పరిధిలో చోడవరం గ్రామానికి కిలోమీటర్ దూరాన ఉన్న ముసి నది ఒడ్డున పొగాకు పంట వేశారు. రాజమండ్రికి చెందిన కూలీలు పొలాల వద్దే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఆ ప్రాంతంలో అప్పటికే నీరు చేరుకుంది. రైతులు మాత్రం ప్రతి రోజూ పొలం పనులు చూసుకొని తిరిగి ఇళ్లకు వస్తున్నారు. గురువారం యథావిధిగా పొలాలకు వెళ్లగానే వరద ముంచుకొచ్చింది. ఉధృతి ఎక్కువవడంతో రాత్రికి కూడా అక్కడ నుంచి బయట పడలేకపోయారు. ఇలా కూలీలతో సహా మొత్తం 350 మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వణికిపోయారు. ఉదయానికి పొలాలన్నీ మునిగి నీటి మట్టం మరింత పెరిగింది. దీంతో సెల్ఫోన్ల సాయంతో అధికారులు, గ్రామస్తులకు సమాచారం అందించారు. తహశీల్దార్ వెంకటేశ్వర్లు పరిస్థితి సమీక్షించి ఉన్నతాధికారులకు వివరించారు. వెంటనే ఆర్డీఓ బాపిరెడ్డి, సీఐ అశోక్‌వర్థన్, ఎస్సై సోమశేఖర్లు రంగంలోకి దిగారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ముసి అవతలి ఒడ్డున ఉన్న బాధితులను బోట్ సాయంతో రక్షించారు. వరదలో చిక్కుకున్నవారిని కాపాడాల్సిందిగా కలెక్టర్‌ను కోరినట్లు వైఎస్ఆర్సీసీ కేంద్రపాలక మండలి సభ్యుడు జూపూడి ప్రభాకర్ చెప్పారు.