చోడవరం(కొండపి), న్యూస్‌లైన్: జిల్లాలో ముంచుకొచ్చిన వరదల్లో చిక్కుకున్న వందలాది మందిని శుక్రవారం అధికార యంత్రాంగం శ్రమించి రక్షించింది. టంగుటూరు మండల పరిధిలో చోడవరం గ్రామానికి కిలోమీటర్ దూరాన ఉన్న ముసి నది ఒడ్డున పొగాకు పంట వేశారు. రాజమండ్రికి చెందిన కూలీలు పొలాల వద్దే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఆ ప్రాంతంలో అప్పటికే నీరు చేరుకుంది.
రైతులు మాత్రం ప్రతి రోజూ పొలం పనులు చూసుకొని తిరిగి ఇళ్లకు వస్తున్నారు. గురువారం యథావిధిగా పొలాలకు వెళ్లగానే వరద ముంచుకొచ్చింది. ఉధృతి ఎక్కువవడంతో రాత్రికి కూడా అక్కడ నుంచి బయట పడలేకపోయారు. ఇలా కూలీలతో సహా మొత్తం 350 మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వణికిపోయారు. ఉదయానికి పొలాలన్నీ మునిగి నీటి మట్టం మరింత పెరిగింది. దీంతో సెల్‌ఫోన్‌ల సాయంతో అధికారులు, గ్రామస్తులకు సమాచారం అందించారు. తహశీల్దార్ వెంకటేశ్వర్లు పరిస్థితి సమీక్షించి ఉన్నతాధికారులకు వివరించారు. వెంటనే ఆర్డీఓ బాపిరెడ్డి, సీఐ అశోక్‌వర్థన్, ఎస్సై సోమశేఖర్‌లు రంగంలోకి దిగారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ముసి అవతలి ఒడ్డున ఉన్న బాధితులను బోట్ సాయంతో రక్షించారు. వరదలో చిక్కుకున్నవారిని కాపాడాల్సిందిగా కలెక్టర్‌ను కోరినట్లు వైఎస్‌ఆర్‌సీసీ కేంద్రపాలక మండలి సభ్యుడు జూపూడి ప్రభాకర్ చెప్పారు.
హమ్మయ్య.. గండం గడిచింది!
Published Sat, Oct 26 2013 5:35 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement