సిమ్ కోట్ లో చిక్కుకున్నభారతీయులు!
న్యూఢిల్లీః కైలాశ్ మానస సరోవరం యాత్రకు వెళ్ళిన 500 మంది భారతీయ యాత్రికులు వాతావరణం అనుకూలించక పోవడంతో నేపాల్ లో చిక్కుకుపోయారు. నేపాల్ పర్వత ప్రాంతంలోని హిల్సా, సిమికోట్ ప్రాంతాల్లో యాత్రికులు చిక్కుకున్నారని, వారికి సహాయక చర్యలు అందించేందుకు సైతం అనేక ఇబ్బందులు ఎదురౌతున్నట్లు అధికారులు వెల్లడించారు.
మానస సరోవర్ యాత్రికులకు సహాయక చర్యలను అందించేందుకు నేపాల్ విదేశాంగ శాఖ కార్యదర్శితో కాట్మాండులోని భారత దౌత్య కార్యాలయ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ వెల్లడించారు. భారతీయ యాత్రికులందరినీ కాపాడేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల నేపాల్ లో చిక్కుకుపోయిన వారందరినీ రక్షించేందుకు హోం శాఖ కార్యదర్శి, ఆర్మీ స్టాఫ్ చీఫ్, మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ సహా ఇతర పోలీసు బలగాలు, అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
ఓ ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా మానస సరోవరం యాత్రకు వెళ్ళిన దాదాపు 50 మందిని ఇప్పటి దాకా హిల్సానుంచి సిమ్ కోట్ కు తరలించినట్లు, దాదాపు వంద మందిని సిమికోట్ నుంచి నేపాల్ గంజ్ కు తెచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. హెలికాప్లర్ల ద్వారా వారిని తరలిస్తున్నామని, ఇంకా సిమికోట్ లో 250 మంది వరకూ యాత్రికులు ఉన్నట్లు నేపాల్ పోలీసులు చెప్తున్నారు. వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా నేపాలీ అధికారులు అన్నివిధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు స్వరూప్ వెల్లడించారు.