Mansarovar
-
మానస సరోవర్ యాత్రికులకు గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ : కైలాష్ మానస సరోవర్ యాత్రికులకు గుడ్‌న్యూస్. ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ పాస్ మార్గం ద్వారా కైలాష్ మానస సరోవర్ వెళ్లే వారు ఇక నుంచి 90 కిలో మీటర్ల పర్వతారోహణ ప్రయాణం తగ్గనుంది. ఉత్తరాఖండ్‌లోని ధార్చులా నుంచి చైనా బోర్డర్ అయిన లిపులేఖ్ పాస్‌లను కలిపే క్లిష్టమైన మార్గాన్ని బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించింది. ఈ మార్గాన్ని శుక్రవారం కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. పితోరగర్ నుంచి గంజికి(నూతనంగా నిర్మించిన మార్గం గుండా) వెళ్లే తొమ్మిది వాహనాల కాన్వాయ్‌ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పచ్చ జెండా ఊపి పంపారు. ఈ కార్యక్రమంలో ఛీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఛీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నార్వానే పాల్గొన్నారు. ఈ మార్గంతో 90కిలో మీటర్ల మేర పర్వతారోహణను నివారించడంతోపాటు వాహనాల్లో చైనా సరిహద్దుల వరకు వెళ్లే అవకాశముంటుందని బీఆర్వో ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కైలాష్ మానస సరోవర్ టిబెట్‌లో ఉంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం జూన్ నెల నుండి సెప్టెంబర్ వరకు రెండు మార్గాల ద్వారా (సిక్కింలోని నాథులా పాస్ మార్గం, ఉత్తరాఖండ్ లోని లిపులేఖ్ పాస్ మార్గం) ఈ యాత్రను నిర్వహిస్తుంది. ప్రతి ఏటా కైలాష్ మానస సరోవర్ యాత్రలో పాల్గొనేందుకు దేశ వ్యాప్తంగా లక్షలాది యాత్రికులు వెళుతుంటారు. -
యునెస్కో వారసత్వ జాబితాలో మానస సరోవరం
న్యూఢిల్లీ: భారత భూభాగంలోని మానస సరోవర్‌ను ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చేందుకు ఐక్యరాజ్య సమితికి చెందిన అనుబంధ సంస్థ ‘యునెస్కో’ అంగీకారం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ అధికారికంగా వెల్లడించింది. ఏప్రిల్‌లో భారత పురావస్తు విభాగం పంపిన ప్రతిపాదనలపై ఈ మేరకు ఆమోదముద్ర లభించినట్లు వివరించింది. కైలాస సరోవర్ ప్రాంతంలో ఎక్కువ భాగం భారత్‌లో విస్తరించి ఉండగా... మిగతా భాగం తూర్పున నేపాల్, ఉత్తరాన చైనా ఉంది. ఈ మూడు దేశాల్లో కలిపి 31 చ.కిలో మీటర్ల ప్రాంతంలో ఈ పవిత్రస్థలం ఉంది. తమ దేశాల్లోని ప్రాంతాలను కూడా వారసత్వ స్థలంగా గుర్తించాలని యునెస్కోకు చైనా, నేపాల్ ఇప్పటికే ప్రతిపాదనలు పంపాయి. -
సిమ్ కోట్ లో చిక్కుకున్నభారతీయులు!
న్యూఢిల్లీః కైలాశ్ మానస సరోవరం యాత్రకు వెళ్ళిన 500 మంది భారతీయ యాత్రికులు వాతావరణం అనుకూలించక పోవడంతో నేపాల్ లో చిక్కుకుపోయారు. నేపాల్ పర్వత ప్రాంతంలోని హిల్సా, సిమికోట్ ప్రాంతాల్లో యాత్రికులు చిక్కుకున్నారని, వారికి సహాయక చర్యలు అందించేందుకు సైతం అనేక ఇబ్బందులు ఎదురౌతున్నట్లు అధికారులు వెల్లడించారు. మానస సరోవర్ యాత్రికులకు సహాయక చర్యలను అందించేందుకు నేపాల్ విదేశాంగ శాఖ కార్యదర్శితో కాట్మాండులోని భారత దౌత్య కార్యాలయ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ వెల్లడించారు. భారతీయ యాత్రికులందరినీ కాపాడేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల నేపాల్ లో చిక్కుకుపోయిన వారందరినీ రక్షించేందుకు హోం శాఖ కార్యదర్శి, ఆర్మీ స్టాఫ్ చీఫ్, మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ సహా ఇతర పోలీసు బలగాలు, అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా మానస సరోవరం యాత్రకు వెళ్ళిన దాదాపు 50 మందిని ఇప్పటి దాకా హిల్సానుంచి సిమ్ కోట్ కు తరలించినట్లు, దాదాపు వంద మందిని సిమికోట్ నుంచి నేపాల్ గంజ్ కు తెచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. హెలికాప్లర్ల ద్వారా వారిని తరలిస్తున్నామని, ఇంకా సిమికోట్ లో 250 మంది వరకూ యాత్రికులు ఉన్నట్లు నేపాల్ పోలీసులు చెప్తున్నారు. వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా నేపాలీ అధికారులు అన్నివిధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు స్వరూప్ వెల్లడించారు.