సాక్షి, తిరువనంతపురం: కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో విదేశాల్లో వుంటున్నలక్షలాదిమంది కేరళీయులు తిరిగి కేరళ రాష్ట్రానికి రావాలని భావిస్తున్నారట. కరోనా వైరస్ వ్యాప్తి భయాలకు తోడు, ఉద్యోగాలపై నెలకొన్న అభద్రత కారణంగా వారంతా సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి చేరుకోవాలని భావిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో దాదాపు 2 లక్షల మంది ప్రవాస కేరళీయులు తమ అభ్యర్థనను నమోదు చేసుకున్నారని నాన్-రెసిడెంట్ కేరలైట్ వ్యవహారాల విభాగం (నార్కా) వైస్ చైర్మన్ కె వరదరాజన్ తెలిపారు. భారతదేశంలో విమానాశ్రయాలు కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ఇంటికి రావాలనుకునేవారి కోసం ప్రారంభించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)నుండి 70వేలమంది, 30వేల సౌదీ అరేబియా నుండి నమోదు చేసుకున్నారని తెలిపారు. 40 శాతానికి పైగా యుఎఇ నుంచి రాగా, మిగిలినవి సౌదీఅరేబియా, బహ్రెయిన్, ఇతర పెర్షియన్ గల్ఫ్ దేశాలనుంచి వచ్చాయన్నారు. అమెరికా, బ్రిటన్ నుండి కూడా ఇలాంటి అభ్యర్థనలున్నట్టు చెప్పారు. వీరిని దశల వారీగా తిరిగి తీసుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందన్నారు. (తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం)
కరోనా వైరస్ భయాలు, లాక్‌డౌన్ కారణంగా ఆయా దేశాలలో ఉద్యోగాలు కోల్పోనున్నామన్నఆందోళనతో 160 దేశాల్లోని కేరళీయులు తొలి విమానాల ద్వారా తమ సొంత రాష్ట్రానికి చేరుకోవడానికి ఆతృతగా ఉన్నారని వరద రాజన్ వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రధామంత్రి నరేంద్ర మోదీ దృష్టికి కూడా తీసుకు వెళ్లినట్టు తెలిపారు. అంతేకాదు ఈ సంఖ్య ఐదు లక్షలకు చేరవచ్చని భావిస్తున్నామన్నారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న ప్రజల భద్రత తమ ప్రాధాన్యత అని, వారిని తిరిగి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. గర్భిణీ స్త్రీలు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నవ్యక్తులు, వీసా గడువు ముగిసి అక్కడ చిక్కుకుపోయిన విద్యార్థులను తీసుకురావడానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలను తిరిగి తీసుకురావడానికి చార్టర్డ్ విమానాలు అవసరమని వరద రాజన్ పేర్కొన్నారు.
కాగా రాష్ట్రానికి తిరిగి వచ్చిన ప్రవాసీయుల కోసం రాష్ట్రంలోని నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో పరీక్షలు,క్వారంటైన్ లాంటి ఏర్పాట్లను ప్రభుత్వం చేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే, ఈ ప్రజలను తిరిగి తీసుకు రావడానికి సిద్దంగా ఉన్నామన్నారు. అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభమైన ఒక నెలలోనే 5 లక్షల మంది తిరిగి వస్తారని కేరళ అంచనావేస్తోంది. కేరళ 33 మిలియన్ల జనాభాలో 10 శాతం విదేశాల్లో నివసిస్తున్నారు. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న నాన్-రెసిడెంట్ కేరళీయుల ఆదాయం 80,000 కోట్ల రూపాయలు. కరోనా ప్రభావంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో తమ వారిని ఆహ్వానించేందుకు కేరళ సన్నద్ధంగా వుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment