
ఒమన్ లో చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన మరో ముగ్గురు మహిళలను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏపీఎన్‌ఆర్‌టీఎస్ స్వరాష్ట్రానికి తీసుకొచ్చింది.
గన్నవరం: ఏజెంట్ల మాయమాటలు నమ్మి ఒమన్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన మరో ముగ్గురు మహిళలను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీఎస్) గురువారం స్వరాష్ట్రానికి తీసుకొచ్చింది. ఒమన్ రాజధాని మస్కట్ నుంచి ఎయిరిండియా విమానంలో ఈ ముగ్గురు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరిలో ఇద్దరు పశ్చిమ గోదావరి జిల్లావారు కాగా, మరొకరు కడపకు చెందినవారు.
వీరి విమాన టిక్కెట్ ఖర్చులను ఏపీ ప్రభుత్వమే భరించింది. అంతేకాకుండా వారిలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరికి, కడపకు చెందిన ఒకరికి ప్రయాణం, భోజనం ఖర్చులను కూడా అందించింది. గన్నవరం విమానాశ్రయంలో వీరికి ఏపీఎన్‌ఆర్‌టీఎస్ సిబ్బంది స్వాగతం పలికారు. ఒమన్ వెళ్లి చిక్కుకుపోయిన వలస కార్మికులకు ఆ దేశం క్షమాభిక్ష ప్రకటించడంతో తొలి విడత ఈ నెల 14న ఎనిమిది మందిని రాష్ట్రానికి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మహిళలు కృతజ్ఞతలు తెలియజేశారు.