కుప్పకూలిన దిగ్గజం, 22 వేల ఉద్యోగాలు ప్రమాదంలో | Travel Giant Thomas Cook collapses,22,000 jobs at risk | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన దిగ్గజం, 22 వేల ఉద్యోగాలు ప్రమాదంలో

Published Mon, Sep 23 2019 11:42 AM | Last Updated on Mon, Sep 23 2019 12:45 PM

Travel Giant Thomas Cook collapses,22,000 jobs at risk - Sakshi

బ్రిటిష్‌ పర్యాటక సంస్థ థామస్‌కుక్‌ కుప్పకూలింది. 178 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కంపెనీ దివాలా ప్రకటించడంతో వేలాదిమంది ఉద్యోగుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. చివరి నిమిషంలో జరిపిన చర్చలు విఫలమైన నేపథ్యంలో థామస్‌కుక్‌ దివాలా  తీసింది. ప్రపంచవ్యాప్తంగా థామస్‌కుక్‌ తన విమాన సేవలను నిలిపివేసినట్టుగా బ్రిటిష్‌ సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ ప్రకటించింది. థామస్‌కుక్‌కు చెందిన విమాన, హాలిడే బుకింగ్స్‌లను రద్దు చేసినట్టు ప్రకటించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 22వేల ఉద్యోగాలు ప్రమాదంలో పడిపోయాయి. వీరిలో 9వేల మంది బ్రిటన్‌ వారున్నారు. అంతేకాదు వేలాదిమంది ప్రయాణీకులు ఇబ్బందుల్లో చిక్కుకుపోయారు. 

సంస్థ పతనం తీవ్ర విచారం కలిగించే విషయమని థామస్ కుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీటర్ ఫాంక్‌హౌజర్ ఆదివారం రాత్రి పేర్కొన్నారు. దీర్ఘకాలిక చరిత్ర ఉన్నసంస్థ దివాలా ప్రకటించడం సంస్థలకు, లక్షలాది కస్టమర్లకు, ఉద్యోగులకు చాలా బాధ కలిగిస్తుందని, ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని చెప్పారు. తప్పనిసరి లిక్విడేషన్‌లోకి ప్రవేశించిందంటూ కస్టమర్లు, వేలాదిమంది ఉద్యోగులకు అయన క్షమాపణలు చెప్పారు. మరోవైపు ఇది చాలా విచారకరమైన వార్త అని  బ్రిటన్‌ రవాణా కార్యదర్శి గ్రాంట్ షాప్స్ చెప్పారు. అలాగే పర్యాటకులను, కస్టమర్లను వారివారి గమ్యస్థానాలకుచేర్చేందుకు ఉచితంగా 40కి పైగా చార్టర్‌ విమానాలను సీఏఏ అద్దెకు తీసుకుందని  తెలిపారు. కాగా ప్రపంచంలోని ప్రసిద్ధ హాలిడే బ్రాండ్లలో ఒకటైన థామస్‌ కుక్‌ను 1841లో లీసెస్టర్స్‌ షైర్‌లో క్యాబినెట్-మేకర్ థామస్ కుక్ స్థాపించారు. ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో నష్టాలు భారీగా పెరగనున్నాయని ఈ ఏడాది మేలోనే థామస్‌ కుక్‌ వెల్లడించింది. బ్రెగ్జిట్‌ అనిశ్చితి కారణంగా సమ్మర్‌ హాలిడే బుకింగ్స్‌ ఆలస్యం కావడంతో సంక్షోభం మరింత ముదిరింది. 

థామస్ కుక్  సీఈవో పీటర్ ఫాంక్‌హౌజర్

అయితే థామస్‌ కుక్‌ ఇండియా  మాత్రం ఆర్థికంగా, నిర్వహరణ పరంగా చాలా పటిష‍్టంగా ఉంది. 2012 నుంచి స్వతంత్ర సంస్థగా కొనసాగుతున్న ఈ కంపెనీలో  మేజర్‌ వాటా ఫెయిర్‌ఫాక్స్‌ గ్రూపు  సొంతం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement