తమ ప్లాట్‌ఫామ్‌లోని కొన్ని ఖాతాలు, పోస్ట్‌లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా దిగ్గజం ‘ఎక్స్’ (గతంలో ట్విటర్) పేర్కొంది. ప్రభుత్వ ఆదేశాలను తాము పాటిస్తాం కానీ, వారి చర్యలతో ఏకీభవించబోమని ప్రకటించింది. అయితే కంపెనీ ఆరోపణలపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.
‘ఎక్స్’కు సంబంధించిన గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ హ్యాండిల్‌లో ఈ మేరకు పోస్ట్‌లో వివరాలను కంపెనీ వెల్లడించింది. భారత ప్రభుత్వ చర్యలతో తాము ఏకీభవించడం లేదని, భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తూ పోస్ట్‌లను తొలగించడం సరికాదని అభిప్రాయపడింది. అయితే భారత ప్రభుత్వ ఆదేశాలకు కట్టుబడి ఉంటామని తెలిపింది.
"ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా భారత్‌లో మాత్రమే ఈ ఖాతాలు, పోస్ట్‌లను నిలిపివేస్తాం. అయినప్పటికీ మేము ఈ చర్యలతో విభేదిస్తున్నాం. ఈ పోస్ట్‌లకు భావప్రకటనా స్వేచ్ఛను కొనసాగిస్తున్నాం" అని పేర్కొంది. ప్రభుత్వ ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ఇంకా పెండింగ్‌లో ఉందని ‘ఎక్స్’ తెలిపింది. ప్రభావిత యూజర్లకు కూడా ఈ చర్యల నోటీసును అందించినట్లు పేర్కొంది.
గత ఏడాది జూన్‌లో నిర్దిష్ట సోషల్ మీడియా ఖాతాలు, ట్వీట్‌లను బ్లాక్ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా ‘ఎక్స్’ వేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. భారత ప్రభుత్వ ఆదేశాలను పాటించనందుకు కంపెనీకి హైకోర్టు రూ.50 లక్షల జరిమానా విధించింది. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని హైకోర్టు సమర్థించిందని, దేశ చట్టాన్ని కంపెనీ తప్పక పాటించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment