సాక్షి, హైదరాబాద్ : అనేక వివాదాలు ఎదుర్కొన్న ‘పద్మావత్’ సినిమా ఎట్టకేలకు రూ. 300 కోట్ల క్లబ్‌లో చోటు సంపాదించుకుంది. ఈ సినిమా వసూళ్లను ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తాజాగా ట్విట్టర్‌లో వెల్లడించారు. పద్మావత్ వసూళ్లతో బాలీవుడ్ చిత్ర సీమలో ఖాన్‌ల ఆధిపత్యం మరోసారి స్పష్టంగా నిరూపితమైంది.
ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైనప్పటికి రూ.500 కోట్లు సాధించలేకపోయింది. ఇప్పటివరకూ రూ.500 కోట్ల వసూళ్లు చేసిన సినిమా హీరోలుగా ఆమీర్, సల్మాన్‌లు ముందున్నారు. వీరిని పక్కకునెట్టి పద్మావత్ ముందుకు దూసుకు వెళ్తుందనుకున్న అంచనాలు తారుమారయ్యాయి.
సినిమా రిలీజై ఏడు వారాలు కావస్తున్నా రూ.300 కోట్ల వసూళ్లను మాత్రమే సాధించగలిగింది. వివాదాస్పద సినిమాల దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీపికా పదుకునే లీడ్‌రోల్ చేశారు. భారీ తారాగణంతో తెరకెక్కిన పద్మావత్ అప్పట్లో పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే.
జనవరి 25న భారీ అంచనాలు, వివాదాల నడుమ సినిమా రిలీజైనప్పటికీ బాలీవుడ్ ఖాన్‌లకు పోటీగా రాలేకపోయింది. మొదటివారంలో భారీగా వసూలు చేసి ఖాన్‌లకు గట్టి పోటీ ఇస్తుందనుకుంటే తర్వాతి కొద్ది రోజులకు అంచనాలను తలకిందులు చేస్తూ వసూళ్లు తగ్గుకుంటూ వచ్చాయి. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి వచ్చిన సల్మాన్ ఖాన్ ‘టైగర్ జిందా హై’ భారీ వసూళ్లు రాబట్టింది.
బాలీవుడ్‌లో రూ. 300 కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలు ఆరు ఉంటే అందులో 5 సినిమాలు ఆమీర్, సల్మాన్‌లవే. ఇందులో పీకే, భజరంగీ భాయిజాన్, సుల్తాన్, దంగల్, టైగర్ జిందా హై, బాహుబలిలు ఉన్నాయి. ఇక్కడ ఇంకో విశేషమేంటంటే ఈ సినిమాల లిస్ట్‌లో తెలుగు సినిమా బాహుబలి కూడా ఉండటం, ఈ సినిమా ఒక్క హిందీ వెర్షన్‌లోనే రూ. 500 కోట్లు వసూలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment