సాక్షి, ముంబై: వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న సంజయ్‌లీలా భన్సాలీ తాజా చిత్రం ‘పద్మావత్’ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కర్ణిసేన ఆగ్రహావేశాల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ సినిమా విడుదలవుతోంది. దేశవ్యాప్తంగా ‘పద్మావత్’ సినిమా విడుదల అవుతున్న థియేటర్ల వద్ద భారీ భద్రత కల్పించారు. మరోవైపు ‘పద్మావత్’ సినిమా రాజ్‌పుత్‌లకు అనుకూలంగా ఉందని కథనాలు వెలువడుతున్నా.. కర్ణిసేన ఆగ్రహం మాత్రం చల్లారడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని కర్ణిసేన అంటోంది. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో హింస చోటుచేసుకోవడం, కర్ణిసేన మూకలు దాడులకు దిగుతుండటంతో ఉత్కంఠ నెలకొంది. సినిమా విడుదలను అడ్డుకునేందుకు కర్ణిసేన ఏమైనా అవాంఛనీయ ఘటనలకు దాడులకు పాల్పడుతుందా? అన్నది టెన్షన్ రేపుతోంది.
దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ‘పద్మావత్’ మార్నింగ్‌షోలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పుణెలోని ఈస్క్వేర్ థియేటర్‌లో ఎలాంటి అలజడి, ఆందోళన లేకుండా మార్నింగ్ షోలు నడుస్తున్నాయి. కర్ణిసేన బెదిరింపుల నేపథ్యంలో థియేటర్ వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. చాలా నగరాల్లో మార్నింగ్‌షోలు ప్రశాంతంగా ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ‘పద్మావత్’ థియేటర్ల వద్ద పోలీసులు అప్రమత్తంగా భద్రత కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు కర్ణిసేన ఆందోళనల నేపథ్యంలో గురుగామ్‌లోని పలు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. గురుగామ్‌లోని ఓ స్కూల్ బస్సుపై కర్ణిసేన దాడులు చేసి విధ్వంసానికి దిగడంతో పిల్లలను బడులకు పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం కారణంగానే ఈ భయానక పరిస్థితి నెలకొందని తల్లిదండ్రులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment