అనేక వివాదాలు చుట్టుముట్టిన చారిత్రక చిత్రం ‘పద్మావత్’ లో సెన్సార్ బోర్డు సూచనల మేరకు చిత్రయూనిట్ పలు మార్పులు చేసింది. ఈ సినిమాపై కర్ణిసేన అభ్యంతరాలు, ఆందోళనల నేపథ్యంలో ’ఘూమర్’ పాటలో ప్రధానంగా మార్పులు చేసింది. గత నెలలో ఆన్‌లైన్‌లో విడుదల చేసిన ఈ పాటపై కర్ణిసేన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రాణి పద్మావతిగా కనిపించిన దీపికా పదుకోన్ నృత్యం చేయడం, పాటలో ఆమె నడుము కనిపించడాన్ని ఆక్షేపించింది. రాణి పద్మావతి అలా గంతులేయడం ఏమిటని కన్నెర్ర జేసింది. ఈ పాటపై నృత్య ప్రదర్శన చేసిన పలుచోట్ల విధ్వంసాలకు దిగింది. ఈ నేపథ్యంలో తాజాగా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ‘ఘూమర్’ పాటలో దీపిక నడుము కనిపించకుండా.. కంప్యూటర్ జెనరేటెడ్ వస్త్రంతో కవర్ చేశారు. సీబీఎఫ్‌సీ సలహాల మేరకు యూ/ఏ సర్టిఫికెట్ పొందేందుకు సినిమాలో ఈమేరకు కీలక మార్పులు చేసినట్టు చిత్రయూనిట్ అనధికారికంగా మీడియాకు తెలియజేసింది.
పద్మావత్ సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు అనుమతి లభించినా ఈ నెల 25న చిత్రం విడుదల అవుతుందా? లేదా? అన్నది సందేహాస్పదంగా మారింది. ఈ సినిమా విడుదలకు అనుగుణంగా అక్షయ్‌కుమార్ తన ‘ప్యాడ్‌మన్’ సినిమా విడుదలను వాయిదా వేసుకున్నారు. అయినా, కర్ణిసేన దిగిరాకపోవడం.. సినిమా విడుదలైతే.. తీవ్ర విధ్వంసం, పరిణామాలు తప్పవని హెచ్చరిస్తుండటంతో ‘పద్మావత్’ ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అన్నది ఉత్కంఠకు దారితీస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment